జమ్మూకశ్మీరులో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్ నాగ్, కుల్గాం జిల్లాల్లో గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని కశ్మీర్ జోన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. హతమైన ఉగ్రవాదుల్లో ఇద్దరు పాకిస్థాన్ దేశానికి చెందిన వారని, మరో ఇద్దరు స్థానిక జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులని ఐజీ పేర్కొన్నారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించాల్సి ఉంది. కుల్గాం జిల్లా మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర పోలీసులు భద్రతా బలగాలతో కలిసి గాలింపు చేపట్టగా, దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు జరపగా, తాము ఎదురుకాల్పులు జరిపామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ఉగ్రవాది హతమయ్యాడు. కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని దూరులోని నౌగామ్ షహాబాద్ ప్రాంతంలో గురువారం ఎదురు కాల్పులు జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డారు.గాయపడిన పోలీసును ఆసుపత్రికి తరలించినట్లు ఐజీ తెలిపారు.