– పి. విశాలాక్షి
మన భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచానికే తలమానికం. మన మహర్షులు సూక్ష్మంగానూ, స్థూలంగానూ, జన్మరాహిత్యాన్ని పొందే ముక్తిమార్గం చూపే దీపస్థoభాల వంటివారు. మానవులు పూర్వజన్మల పుణ్య చారిత్రకత వల్ల అటువంటి మునుల శిష్యులై ఆదర్శవంతంగా జీవించి మార్గదర్శకులైనారు. కొందరు తమ పూర్వజన్మ పుణ్యఫలo మూలంగా సాక్షాత్ భగవంతుడినే గురువుగా ఆరాధిస్తూ, ఈ కలియుగంలో అత్యున్నత స్థాయికి చేరి, ప్రజలకు తమ జీవనాన్నే ఉదాహరణగా చూపిన వారిలో శ్రీ రమణ భగవాన్ ప్రథములు. ఏ గురు సుశృష లేకుండా, శ్రీ అరుణాచలేశ్వరునే తండ్రి, గురువుగా, తమ జీవితమే తపస్సుగా మార్చుకున్న ఋషి ఆయన. వారిని యావత్ప్రపoచం గురువుగా భగవంతునిగా నమ్మింది.
మధురై సమీపంలోని తిరుచ్చులిలో `వెంకటరమణ అయ్యర్’ 30డిసెంబర్ 1879లో జన్మించి, తమ 16వ ఏట అపూర్వానుభవం పొందారు. ఇంట్లో తానొక్కడే ఉన్న సమయంలో, తను చనిపోతున్నాననే భయంతో మనస్సు అంతర్ముఖమైనపుడు, `దేహానికి చావు ఉంటుంది కానీ, నేను దేహాతీతమైన ఆత్మని, ఆ ఆత్మకు చావు లేదనే’ స్ఫురణ కలిగింది. బహుశా, `పెరియపురాణం’ (శివయోగుల చరిత్ర) చదవడం వల్లనో, లేక ఇంటికి వచ్చే సాధువుల ద్వారానో, వారు అరుణాచలం, శ్రీ అరుణాచలేశ్వరుడు గురించి తెలుసుకున్నారు, మనసు అయస్కాంత శక్తి లాగా ఆయనను అరుణాచలం వైపు లాగింది. అద్భుతమైన అత్మజ్ఞ్యానం కలగడం కూడా తోడై, ఆ 16సం. బాలుడు ఇల్లు విడిచి, బహు కష్టపడి పట్టుదలతో తిరువణామలై చేరారు. అప్పటినుండి తన గురించి చెప్పేటప్పుడు `ఇది’ అనే పదం శరీరానికి వాడేవారు. ఆ క్షణం నుంచి ఆయనకు గురువైనా, తండ్రైనా శ్రీ అరుణాచలేశ్వరుడే అన్నీ.
ఆలయంలో శివదర్శనం అనంతరం ఆ బాలుడు, తన శరీరంపై వస్త్రాలు, వస్తువులు విసర్జించి, కౌపీనధారియై, ఆలయ వెనుకభాగంలో నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసాడు. చుట్టుపక్కల సందడి కోలాహలం వద్దని, ఆలయ పరిసరాలలోని పాతాళలింగం వద్దకు చేరి ఎన్నో నెలలు సమాధి స్థితిలో ఉండిపోయారు. జుట్టు అట్టలు కట్టి, తొడలు పురుగులు కీటకాలు కోరికివేయడంతో రక్తం గడ్డకట్టేసినా, స్వామికి ఇవేమీ తెలియలేదు. కొందరు భక్తులు ఆయనను ఆ స్థితిలో చూసి, అక్కడినుంచి బయటకు చేర్చి, స్నానపానాలు అమర్చారు. అప్పటినుంచీ `గురుమూర్తమ’నే మఠంలో అయన ఉండగా, ఉద్దండ నాయనార్, అన్నామలై తంబిరాన్ అనే సాధువులు సంరక్షించారు. తరువాత అరుణాచలం కొండపైనున్న `పవళకుండ్రు’కి బస మార్చారు. తల్లికి సంగతి తెలిసి తీసుకెళ్ళడానికి వస్తే `ఏది ఎలా జరగాలో అట్లా జరుగుతుంది’ అని వ్రాసి ఇచ్చారు ఆ మౌనస్వామి. 1899లో అనుచరుడైన పళనిస్వామితో విరూపాక్ష గుహకి మారారు. పాటవం కలిగిన వారి మౌనోపదేశమే వచ్చేవారికి ప్రయోజనకారి అయింది. ఆ తరువాతి కాలంలో ఆయన, ఒక భక్తుని విన్నపం మీద `అరుణాచలేశ్వరునికి ఐదు స్తోత్రాలు’ కృతి గానం చేసారు. అవి `అక్షర మణిమలై, నవ మణిమలై, అరుణాచల పటికం, అరుణాచల అష్టకం, అరుణాచల పంచరత్న’. భక్తులు శ్రీ రమణ మహర్షి వాక్కులు, ప్రసంగాల గురించి వ్రాసిన మరెన్నో గ్రంథాలు ఉన్నాయి.
సంస్కృత విద్వాంసుడు, ఆసుకవి, తపస్వి అయిన శ్రీ కావ్యకంఠ గణపతి ముని, భగవాన్ శ్రీ రమణులను గురువుగా స్వీకరించి, ఎన్నో సందేహాలను తీర్చుకున్నారు, అవే `రమణగీత’గా రూపొందాయి. అందులోని ఒక శ్లోకం విశేష ప్రాముఖ్యత పొందింది. ఆత్మ స్వరూపం నిర్దేశించే ప్రశ్నకు సమాధానంగా శ్రీ రమణ మహర్షి తెలిపినది:
శ్లో!! హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం
హ్యహ మహమితి సాక్షాదాత్మ రూపేణ భాతి:
హృది విశమనసాస్వం చిన్వతా మజ్ఞ్యతావా
పవన చలన రోధా దాత్మ నిష్ట్ఓ భవత్వం!!
ఎఫ్.హెచ్. హంఫ్రీస్ 1911లో స్వామిని వేసే ప్రశ్నకు సమాధానంగా `నీవు లోకానికి భిన్నం కాదు, నిన్ను నీవు తెలుసుకో’ అని తెలిపారు. స్వామి చూసే వారు వేసే ప్రశ్నలకు సమాధానాలు, సూరి నాగమ్మగారు మొదలైన వారు వ్రాసిన కొన్ని పుస్తకాలు వచ్చాయి. కాలక్రమేణా దేశవిదేశాలనుంచి ఎంతోమంది పండితులు, పరమహంస యోగానంద వంటి యోగులు, పాల్ బ్రాంటన్ మరియు సోమర్సెట్ మాఉమ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు. మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు. స్వమీ రామదాస్ వంటి మహాయోగి కూడా శ్రీ రమణ మహర్షిని దర్శించుకుని అక్కడి అరుణాచల గుహలో కొంత కాలం ధ్యానంలో గడిపారు. ప్రఖ్యాత రచయిత శ్రీ గుడిపాటి వెంకటాచలం, రమణ మహర్షి శిష్యుడై తమ జీవితం చాలాకాలం అంతిమ దశ వరకు అరుణాచలంలోనే గడిపారు. ఒక విదేశీ భక్తుడు `ఆర్థర్ ఆస్బోర్న్’ రమణాశ్రమం పత్రిక `మౌంటెన్ పాత్’ మొదటి సంపాదకునిగా 1964లో పని చేసారు. అందరికీ అశ్రమంలో పరమ శాంతి లభించేది. అక్కడ నెమళ్లు, ఆవులు, లేళ్ళు, కోతులు, కుక్కలు మరెన్నో జీవులుoడేవి.
దేశ జాతి కుల మతభేదాలు లేకుండా అందరూ మహర్షిని దర్శించుకునేవారు, వచ్చిన వారందరినీ అత్యంత ప్రేమాదరణలతో చూసేవారు, అక్కడి ప్రశాంతత అందరినీ ఆకర్షించేది. వారివద్దకు వచ్చిన వారినందరినీ, భక్తి పరమార్థాల వైపు తిప్పేవారు, వారి ఒక దృష్టి మాత్రంగానే ఇదంతా జరిగేది. ఫోటో చూసినా వారి చూపు సూదంటురాయి వలె భక్తులను ఆకర్షించేది. వారు సాక్షాత్ సుభ్రమణ్యస్వామి అవతారమని కొందరు, శ్రీ దక్షిణామూర్తి అవతారమని మరి కొందరు భక్తులు భావించేవారు, ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయమేమీ లేదని ఆయన అనేవారు. ఒక రోజు ఒక వస్తువు లేకపోతే, మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది. ఆయన తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్నా, మిగతా అందరిలాగే చూసేవారు. ఆమె ఆఖరి ఘడియల్లో తన హస్త స్పర్శతో ముక్తినిచ్చిన సంఘటన ఎంతో విశేషం.
శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో, ఎడమ చేతిపై వ్రణం పెరిగి, శస్త్ర చికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు మత్తుమందు ఇస్తామన్నా నిరాకరించారు. ఎందరో భక్తులు ఆయనని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని కోరగా, `భోజనానంతరం విస్తరిని ఉంచుకుంటామా?’ అని అడిగారు. 14ఏప్రిల్ 1950 రాత్రి 8.47ని.లకు శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు, ఒక నక్షత్రం గిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది. మహితాత్మ స్వస్థలానికి చేరుకుంది.
!! లోకాస్సమస్థా సుఖినోభవంతు !!
This article was first published in 2019