Home News నిజామాబాద్: చోరీకి గురైన రామాల‌యంలోని విగ్రహాలు… తిరిగి ఆల‌యంలో ప్ర‌త్య‌క్షం

నిజామాబాద్: చోరీకి గురైన రామాల‌యంలోని విగ్రహాలు… తిరిగి ఆల‌యంలో ప్ర‌త్య‌క్షం

0
SHARE

చోరీకి గురైన దేవుళ్ల విగ్ర‌హాలు తిరిగి ఆల‌యంలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. దేవుడికి భ‌య‌ప‌డో, లేదా పోలీసుల విచార‌ణ‌లో దొరికిపోతామ‌నే భ‌యంతోనో దొంగిలించిన విగ్ర‌హాల‌ను తిరిగి ఆల‌యాల‌నికి చేర్చారు ఆ దొంగ‌లు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  ఈ జనవరి 7న నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం కందుకూర్తి రామాలయంలో ఉన్న‌ 20కిలోల సీతా రామ పంచలోహ విగ్రహం, మరో 5 కిలోల రాగి విగ్రహాలు, వెండి కొమ్ములను దొంగలు దోచుకెళ్లారు. విగ్ర‌హాల అప‌హ‌ర‌ణ విష‌యాన్ని ఆలయ పూజారి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. దొంగలను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని తనిఖీ చేయడం మొదలు పెట్టారు . అయితే అనూహ్యంగా ఆలయంలో విగ్రహాలు తిరిగి ప్రత్యక్షమయ్యాయి.

జనవరి 25న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి రామాలయంలో ఉమ్రీ బిర్జు మహరాజ్ జోషి నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు ఉమ్రీ బిర్జు మహరాజ్ జోషి కొన్ని వస్తువులు విరాళంగా ఇచ్చిన‌ట్టు పూజారితో చెప్పారు. అయితే వ‌చ్చిన ఎవ‌రో ఆ పూజారికి తెలియ‌క‌పోవ‌డంతో ఆ వ‌స్తువుల‌ను ఆలయంలోనే ఉంచారు. ఫిబ్రవరి 2న ఆలయంలో అన్నదానం జరుగుతున్న నేపథ్యంలో పూజారి ఈ సోమ‌వారం (జ‌న‌వ‌రి 31) మూటలను తెరిచారు. అందులో 10 కిలోల బియ్యం, 5 కిలోల రవ్వ, 5 కిలోల పంచదార ఉన్నాయి. మరో సంచి తెరిచి చూడగా అందులో 3 అట్ట పెట్టెలు ఉన్నాయి. మొదటి పెట్టెలో సీతా రాముల ఉత్సవ విగ్రహం ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఇతర పూజారులకు తెలియజేయగా, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఘటనపై స్పందించిన పోలీసులు. తిరిగి ఎందుకు తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. విచారణకు భయపడ్డారా లేదా దేవుడికి భయపడి లొంగిపోయాడా అనేది తెలియాల్సి ఉంది. బియ్యం తో సహ ఇవ్వడాన్ని బట్టి చూస్తే దేవుని భయానికే తిరిగి అప్పజెప్పారేమొ అని ప్రజలు భావిస్తున్నారు.

Source : IV News