అజాదీకి అమృత్ మహోత్సతం జరుపుకుంటున్న ఈ శుభతరుణాన వచ్చే 25సంవత్సరాల అమృత కాలాన్ని దృష్టిలో ఉంచుకొని శత సంవత్సరాన్ని(ఇండియా @ 100) విశ్వగురుత్వ బాధ్యత నేపథ్యంలో ఆర్థిక అంశాలను స్పృశించారు. నిన్నటి ఆర్థిక సర్వేప్రకారం అత్యధిక వృద్ధిరేటు నమోదుకు ఊతంగా, స్థూల ఆర్థిక అభివృద్ధికి, సూక్ష్మ ఆర్థిక మూలాలను కలుపుకునే విధంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు.
డిజిటల్ ఎకానమీ, ఆర్థిక సాంకేతిక(FINTECH) శాస్త్రీయాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ దృష్టితో శక్తి వనరుల ఉపయోగం వంటి మూల సూత్రాలను ఈ బడ్జెట్ లో పాటించారు. పెట్టుబడి ఉత్పాదక వినిమయ విధానం లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రొత్సహిస్తూ ప్రజలను హక్కుదారుల ను చేయడం కోసం భారీ ప్రయత్నం జరుగుతోంది.
ముఖ్యాంశాలు.
కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. దేశ దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం అనేక అంశాలను ఇందులో పొందు పరిచారు. డిజిటల్ భారతావని ఆవిష్కరించే దిశగా, ఇతర దేశాలతో పోటీ పడేట్లుగా దీనిని తీర్చిదిద్దారు. లోతుగా అధ్యయనం చేస్తే ఇందులో అనేక కీలక అంశాలు కనిపిస్తాయి.
* 14 రంగాలలో ఉత్పాదక ఆధార ఇన్సెంటివ్ లు ఇవ్వడం ద్వారా ఆత్మనిర్భర భారతం విలువను పెంచడం, తద్వారా 60 లక్షల నూతన ఉపాధి కల్పన, దాదాపు 30 లక్షల కోట్ల ఉత్పాదక సంపద సృష్టించడం.
* ప్రధాన మంత్రిగతిశక్తి కేంద్రంగా రైల్వే, రోడ్డు, జల రవాణాలను అభివృద్ధి చేసుకొని వస్తే సేవల రవాణాల ఉత్ప్రేక్ష. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, నౌక కేంద్రాల్లో అభివృద్ధి చేయడం.
* 25000 కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధి, తపాలా, రైల్వే శాఖల అనుసంధానం, అర్బన్, రవాణాను రైల్వేలను అనుసంధానించడం
* అన్నదాతకు ఆలంబనగా ఉంటూ సేంద్రియ సాగుని ప్రోత్సహిస్తారు. చిన్న రైతుల కోసం రైల్వే నెట్ వర్క్ ను ఏర్పాటు చేసి, వన్ నేషన్ .. వన్ ప్రొడక్ట్ పథకాన్ని అమలు చేస్తారు. మార్కెటింగ్ సహకారం కోసం పోర్టల్, ప్రత్యేక ప్లాట్ ఫామ్ లను ఏర్పాటు చేస్తారు.
* చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేక గ్యారంటీ పథకం కింద 2 లక్షల కోట్ల మేర నిధులు కేటాయించారు. నైపుణ్యాలు పెంచుకొనేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు..
* మేకిన్ ఇండియా లో భాగంగా … 400 వందే భారత్ రైళ్లను తీసుకొస్తున్నారు. రాగల రోజుల్లో అక్షరాలా 60 లక్షల ఉద్యోగాలను కల్పిస్తారు. 25వేల కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ది చేస్తారు.
* గ్రామీణ పేద విద్యార్థుల కోసం డిజిటల్ యూనివర్శిటీ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానమంత్రి ఈ విద్య కింద 200 ఛానెళ్లను తీసుకొస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో సైతం నాణ్యమైన విద్యను అందించబోతున్నారు.
* పేదవాడి సొంతింటి కల సాకారం దిశగా ఈ ఏడాదే 80 లక్షల ఇండ్లను నిర్మిస్తున్నారు. 48వేల కోట్ల తో పనులు ముమ్మరం చేస్తున్నారు.
అంతిమంగా చూస్తే …. ఎటువంటి పన్నులు విధించకుండా, పన్ను శ్లాబ్ లను మార్చకుండా రూపొందించారు. నదుల అనుసంధానం, పర్యావరణం, ప్రజా రవాణా, మౌళిక వసతులకు పెద్ద పీట వేశారు. మొత్తం మీద అనేక రంగాల్లో పురోభివృద్ది సాధించేందుకు బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది.