Home News నేతాజీ సాహ‌సం, మేధోశ‌క్తి అద్వితీయం: “నేతాజీ” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌లో శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ

నేతాజీ సాహ‌సం, మేధోశ‌క్తి అద్వితీయం: “నేతాజీ” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌లో శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ

0
SHARE

నేతాజీ సాహ‌సం, మేధోశ‌క్తి అద్వితీయం అని రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స‌ర్ కార్య‌వాహా శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే జీ అన్నారు. ప్ర‌ముఖ పాత్రికేయులు శ్రీ ఎంవీఆర్ శాస్త్రీ గారు ర‌చించిన “నేతాజీ” పుస్తక ఆవిష్క‌ర‌ణ స‌భ భాగ్య‌న‌గ‌ర్‌లోని(హైద‌రాబాద్‌) ర‌వీంద్ర భార‌తీ ఆడిటోరియంలో 2022.02.25 శుక్ర‌వారం రోజున ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వ‌యంసేవ‌క్ సంఘ్ స‌ర్ కార్య‌వాహ శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే గారు, రామ‌కృష్ణ మ‌ఠానికి చెందిన పూజ్య స్వామి శ్రీ శితికంఠానందాజీ, జ‌స్టిస్ శ్రీ ఎల్‌.న‌ర్సింహ రెడ్డి గారు, ప‌ద్మ అవార్డు గ్ర‌హీత శ్రీ హ‌నుమాన్ చౌద‌రి గారు, దుర్గా ప‌బ్లికేష‌న్స్ అధినేత దుర్గా గారు, పుస్త‌క ర‌చ‌యిత, ప్ర‌ముఖ పాత్రికేయులు ఎంవీఆర్ శాస్త్రి గారు త‌దిత‌రులు పాల్గొన్నారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న గావించిన త‌ర్వాత వందేమాత‌ర గీతాల‌ప‌న‌తో కార్య‌క్ర‌మం ఆరంభ‌మైంది.

ధ‌ర్మ‌శ‌క్తి సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌భా కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డా. వ్యాక‌ర‌ణం శ్రీ‌నివాస్ గారు మాట్లాడుతూ స్వామి శివానంద మూర్తి గారి ఆశీస్సుల‌తో “ధ‌ర్మ శ‌క్తి” సంస్థ ఏర్ప‌డింద‌ని, ధ‌ర్మ ర‌క్ష‌ణే ధ్యేయంగా ఈ సంస్థ ప‌ని చేస్తోంద‌ని తెలిపారు. అనంత‌రం దుర్గా ప‌బ్లికేష‌న్స్ త‌రుపున శ్రీ‌మ‌తి దుర్గా గారు మాట్లాడారు. అనంత‌రం ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆర్‌.ఎస్‌.ఎస్ స‌ర్ కార్య‌వాహ శ్రీ ద‌త్తాత్రేయ హోస‌బ‌లే గారు మాట్లాడుతూ “నేతాజీ” పుస్త‌క ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం గ‌ర్వంగా ఉంద‌న్నారు. “ముఖ్య అతిథిగా ఇక్క‌డ నిల‌బ‌డినా, నిజానికి నేను అతిథిని కాద‌ని, నేతాజీ జీవిత ల‌క్ష్యంతో మ‌మేక‌మైన కోట్లాది భార‌తీయుల‌లో నేను ఒక‌డిన‌ని, ఈ దేశ ప్రేమికుల స‌మూహంలో నేను కూడా ఉండ‌డం ఎంతో గ‌ర్వంగా ఉంది” అని ఆయ‌న అన్నారు. తాను తెలుగు భాష మాట్లాడ‌గ‌ల‌న‌ని, చ‌ద‌వ‌గ‌ల‌న‌ని 300 పేజీల ఈ పుస్త‌కంలోని భాష నిజానికి ముక్త‌కంఠంతో యావ‌ద్దేశ ప్రేమికులు మాట్లాడే భాష‌, ఇది మ‌న దేశ భాష‌, క‌నుక ఇది తెలుగు భాష‌నా, హిందీ భాష‌నా అనే తేడా చూడ‌లేమ‌ని ఆయ‌న అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గురించి చెప్పాలంటే ఒళ్లు పుల‌క‌రించిపోతుంద‌ని, నేతాజీ అనే పేరులోనే ఒక విద్యుత్ ప్ర‌వ‌హిస్తోంద‌ని అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడిగా, లోక ప్రియుడైన నాయ‌కుడిగా, సేనాధితిగా, మ‌న దేశ మొద‌టి ప్రధానిగా అన్నీ ఆయ‌న సాధించిన ప‌ద‌వులే అని అన్నారు.

నేతాజీ తండ్రి గారు ఆయ‌నను “ఐసిఎస్” చ‌ద‌వ‌మ‌ని కోరిన‌పుడు… ఏ మాత్రం త‌డ‌బ‌డ‌కుండా వెళ్లి ఆ ప‌రీక్ష‌ను పాస్ అయ్యి ఆ త‌ర్వాత త‌న మ‌న‌స్సులో స్వాతంత్య్ర కాంక్ష‌ను తెలియ‌జేస్తూ త‌న ఐసిఎస్ ప‌ద‌విని తృణ ప్రాయంగా వ‌దిలేశార‌ని తెలిపారు. భార‌తీయ సాంప్ర‌దాయాల‌లో చిరంజీవులుగా పేర్కొన్న అనేక మంది పురాణ పురుషులలో స‌మానంగా ఆయ‌న కూడా చిరంజీవే అనండం అతిశ‌యోక్తి కాద‌ని పేర్కొన్నారు. అజాద్‌ హిందూ ఫౌజ్ (ఐఎన్ఏ) స్థాపించి ఎంతో మంది సైనికుల‌ను త‌యారు చేసిన ఘ‌న‌త వారిదే అని అన్నారు. విద్యార్థి ద‌శ‌లోనే టెరిటోరియ‌ల్‌ ఆర్మీలో ప‌ని చేయ‌డం వ‌ల్ల ఆ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణం అల‌వ‌డింద‌ని గుర్తు చేశారు. నేతాజీ చ‌రిత్ర మాత్ర‌మే కాదు, మ‌న భ‌విష్యత్‌ భార‌త విధాన రూప‌క‌ర్త అని అన్నారు. ఆయ‌న సాహ‌సం, మేధ అద్వితీయమ‌ని, కేవ‌లం త‌న స్వ‌శ్తితోనే అనేక ప‌ద‌వుల‌ను అలంక‌రించార‌ని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి గా ఎన్నిక‌అయినప్పుడు జరిగిన విషయాలన్నీ చరిత్ర మరువద‌ని, గాంధీజీ బ‌ల‌ప‌రిచిన‌ అభ్యర్థిని కూడా ఓడించిన ఘనత ఆయనది గుర్తు చేశారు.

ఆయ‌న అంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన నాయ‌కుడైనా, ఆ స‌మ‌యంలో ఏ జ‌రిగిందో అందిరికీ తెలుసు, గాంధీజీతో ఎన్ని విభేదాలున్నా ఆయ‌న‌ను ఏనాడు ప‌ల్లేత్తు మాట అన‌లేదు, సింగ‌పూర్ నుంచి రేడియో ద్వారా ఇచ్చిన ప్ర‌సంగ‌గం లో కూడా గాంధీజీ గారి ఆశీర్వాదం కోరారు. దీన్ని బ‌ట్టి ఆయ‌న వ్య‌క్తిత్వం ఎంత గొప్ప‌దో అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధంలో ఆయ‌న దౌత్య‌నీతి ప్ర‌స్ఫుట‌మైతుంది. ఆయ‌న సామ్రాజ్య వాద శక్తుల‌తో కలిశాడ‌నే విమ‌ర్శల‌తో ఆయ‌నపై నోటి కొచ్చిన రీతిలో మాట్లాడారు. వారికి స‌మాధానం చెప్పాలంటే ఆయ‌న జ‌పాన్ తో ఏర్ప‌రిచిన ఒప్పందం గ‌మ‌నిస్తే ఆయ‌న ఎంత జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌దీ తెలుస్తుంద‌ని గుర్తు చేశారు.

భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం ఆధారంగా ఆయ‌న ఆలోచ‌న‌లు ఉండేవ‌ని, ఆయ‌న అనుచ‌రుడు స‌మ‌ర్‌గుహ చెప్పిన మాట‌ల ప్రకారం.. ఎర్ర‌కోట‌లో చూలాబాయ్ దేశాయ్ ఐఎన్ఏ త‌రుపు వాదించిన బారిష్ట‌ర్, ఆయ‌న నేతాజీని ఎంత త‌ప్పుగా అనుకున్న‌ను అంటూ వాపోయారు. ఐఎన్ఏ కోసం వారు వాదించారు. నేతాజీ యొద్ధ స‌న్యాసి. ఆయ‌న ప్ర‌తీ రోజు భ‌గ‌వ‌ద్గీత‌లో ఒక శ్లోకం చ‌దువుకున్న త‌రువాతే నిద్ర‌కు ఉప‌క్ర‌మించే వారు. అదీ ఆయ‌న ధ‌ర్మ నిష్ట‌.

చరిత్ర‌లో ఇలాంటి ప‌రిపూర్ణ దేశ భ‌క్తులు వారి సంగ్రామం గురించి ఎటువంటీ వివ‌రాలు తెలియ‌కుండా మూసి ఉంచిన వారు ఎవ‌రు అనేది సామాన్య ప్ర‌జానీకానికి తెలియాల్సిన స‌మ‌యం ఇద‌ని, ఇటువంటి పుస్త‌కాలు వంద‌లు, వేలుగా రావాలి అని ఆయ‌న పిలుపునిచ్చారు. ఎంవీఆర్ శాస్త్రీ గారు అద్భుత‌మైన చ‌రిత్ర ప‌రిశోధ‌కుడు, ఆయ‌న స‌త్య‌శోధ‌న‌లో ఎటువంటి అవ‌కాశాల‌ను వ‌ద‌ల్లేద‌ని, నిర్భ‌యంగా స‌త్యాన్ని చాటార‌ని కొనియాడారు. భార‌తీయ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించిన భార‌త విచ్చిన్నం చేయాల‌ని ప్ర‌య‌త్నించినా, ప్ర‌య‌త్నిస్తున్న అనేక ఉన్మాద శ‌క్తుల‌ను ఎదుర్కొని భార‌తీయ స‌నాత‌న సాంప్రదాయం సంస్కృతిని ప‌రిర‌క్షించే మేధో క్ష‌త్రియులు ఇప్పుడు అవ‌స‌ర‌మ‌ని అందుకు ఇటువంటి పుస్త‌కాలు అనేకం రావాలి అని ద‌త్తాత్రేయ జీ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు తమ అభినందనలు తెలియజేశారు. వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.