2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్లతో అమాయకపు ప్రజలను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్రవాది సఫ్దర్ నగోరి స్పష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతానని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు. 100కి పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్న నగోరి 2008లో అరెస్టయి ప్రస్తుతం భోపాల్ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
“రాజ్యాంగం నాకు లెక్కలేదు. నాకు ఖురాన్ నిర్ణయాలే అత్యున్నతమైనవి” అని నగోరి అనేక సార్లు జైల్లో చెప్పినట్టు భోపాల్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ దినేష్ నర్గావే తెలిపారు.
2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మంది ఉగ్రవాదులకు మరణశిక్ష, 11 మంది ఉగ్రవాదులకు జీవిత ఖైదు విధిస్తూ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 18న తీర్పునిచ్చింది. 2008 వరుస పేలుళ్లలో 56 మంది మరణించగా, 200 మందికి పైగా గాయపడ్డారు.
2008 జూలై 26న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 70 నిమిషాల వ్యవధిలో 21 పేలుళ్లు జరిగాయి. నాగోరి ఈ వరుస పేలుళ్ల సూత్రధారుల్లో ఒకరు. మతం మారేందుకు ఒప్పించడంలో నిపుణుడైన నగోరి గతంలో జైలు ఖైదీలను కూడా మతం మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. హిందూ మతంలో వివక్ష ఉందని, అల్లా దృష్టిలో అందరూ సమానమేనని ప్రచారం చేస్తూ ఖైదీల మనసులను కలుషితం చేసేవాడని జైలు అధికారులు తెలిపారు.
1977లో అలీఘర్‌లో జమాత్-ఇ-ఇస్లామీ హింద్ విద్యార్థి విభాగంగా ప్రారంభమైన సిమీ సంస్థ 2001లో నిషేధానికి గురైంది. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యంగా ఉండేది. అయితే అదే సంస్థ ఆ తర్వాత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)గా ఏర్పడి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని అనేక మంది నిపుణులు భావిస్తున్నారు.
జమియత్ ఉలమా-ఇ-హింద్ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) ఉపాధ్యక్షుడు, దారుల్ ఉలూమ్ దేవబంద్ ప్రిన్సిపాల్ మౌలానా సయ్యద్ అర్షద్ మదానీ 49మంది తీవ్రవాదులకు శిక్షను కోర్టులో సవాలు చేస్తానని ప్రకటించాడు.
Source : ORGANISER