Home News ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ఉత్తర-దక్షిణ భారత్‌ను కలిపే ఏకైక రహదారి

ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ఉత్తర-దక్షిణ భారత్‌ను కలిపే ఏకైక రహదారి

0
SHARE

కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఒకానొక సందర్భంలో అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అక్కడి మెరుగైన రహదారుల కారణంగానే ఆ దేశం ధనిక దేశంగా మారింది తప్ప అమెరికా ధనిక దేశమైన తర్వాత మాత్రమే అక్కడి రహదారులు మెరుగుపడ్డాయని భావించరాదని అన్నారు.

ఒక దేశం ప్రగతి సాధించడంలో అక్కడి రవాణా మౌలిక సదుపాయాల కల్పన కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పట్ణణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమమైన రవాణా మౌలిక సదుపాయాల కల్పన ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది. అది భారతదేశానికీ వర్తిస్తుంది.

ఈ అంశాన్ని గమనంలోకి తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. భారత్‌ను మరో అమెరికా దేశంలా తీర్చిదిద్దే క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రోజుకు 37 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చొప్పున భారత్‌లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు వడివడిగా అడుగులు వేస్తున్నది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో 2020 సంవత్సరం ఏప్రిల్ నుంచి 2021 సంవత్సరం జనవరి మధ్య కాలంలో 8,169 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను కేంద్ర రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మించింది. రోజుకు దాదాపు 28.16 కిలోమీటర్ల వేగంతో రహదారులు నిర్మితమయ్యాయి. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో జాతీయ రహదారుల నిడివి అర్థ భాగం పెరిగింది. 2014 ఏప్రిల్ మాసంలో 91,287 కిలోమీటర్ల మేరకు దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు.. 2021 మార్చి మాసానికి 1,37,625 కిలోమీటర్లకు విస్తరించాయి.

‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ అని నిత్యం పలికే ప్రధాని నరేంద్ర మోడీ.. ఇటీవల జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మూకు 17 కిలోమీటర్ల దూరంలోని పాలిలో జరిగిన ఒక కార్యక్రమంలో జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ కన్యాకుమారి‌లోని దేవి ఒకే రహదారి ద్వారా వైష్ణోదేవిని కలిసే సుముహూర్తం ఇక ఎంతో దూరంలో లేదని అన్నారు.

ప్రధాని ప్రకటన కార్యరూపం దాల్చిన మరుక్షణం భారతదేశపు ఆ చివరను ఈ చివరతో కలిపే అతి పెద్ద ఉత్తర-దక్షిణ జాతీయ రహదారిగా ఆ రహదారి పేరు తెచ్చుకుంటుంది. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారిగా నిలిచిపోతుంది. ప్రధాన నగరాలను, పట్టణాలను పరస్పరం కలుపుకుంటూ ఈ జాతీయ రహదారి ముందుకు సాగుతుంది. పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలకు దారి చూపుతుంది. చిన్న పట్టణాలను, వాటి పరిసరాలను దేశ ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చి అక్కడి ప్రజలకు లబ్ది చేకూర్చే సామర్థ్యాన్ని ఈ రహదారి ప్రాజెక్టులు సంతరించుకున్నాయి.

దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి సైతం ఈ జాతీయ రహదారి ప్రాజెక్టులు ఊతమిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులను సాఫీగా రవాణా చేయడానికి సైతం ఉపకరిస్తున్నాయి. ప్రధాని మోడీ సంకల్పించిన జాతీయ మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ ‘ప్రధానమంత్రి గతిశక్తి’ పథకంలో భాగంగా ఈ జాతీయ రహదారి నిర్మాణం కానుంది. దేశంలో వేర్వేరు ఆర్థిక మండళ్ళను అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్'(PM Gati Shakti NMP) అభివృద్ధికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (CCEA) 2021 సంవత్సరం అక్టోబర్ 21న ఆమోదం తెలిపింది.

PM Gati Shakti NMP కింద 22 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, 23 ఇతర కీలకమైన మౌలిక సదుపాయల కల్పన ప్రాజెక్టులు, ఇతర జాతీయ రహదారి ప్రాజెక్టులు, భారత్‌మాల పరియోజన, తదితర పథకాల కింద 35 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను (MMLPs) అభివృద్ధి పరిచే ప్రణాళికలో నితిన్ గడ్కరీ నేతృత్వంలో మంత్రిత్వ శాఖ ఉంది.

ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్న ప్రధానమైన ఎక్స్‌ప్రెస్ వేలు మరియు కారిడార్లలో ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ వే, అహ్మదాబాద్ – థలోరా ఎక్స్‌ప్రెస్ వే, ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్ వే, బెంగళూరు – చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ వే, అంబాలా – కోట్‌పుత్లీ ఎక్స్‌ప్రెస్ వే, అమృత్‌సర్ – భటిండా – జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వే, రాయ్‌పూర్ – వైజాగ్ ఎక్స్‌‌ప్రెస్ వే, హైదరాబాద్ – వైజాగ్ ఎక్స్‌ప్రెస్ వే, చెన్నయ్ – సేలమ్ ఎక్స్‌ప్రెస్ వే మరియు చిత్తోర్ – తచ్చోర్ ఎక్స్‌ప్రేస్ వే ఉన్నాయి.

రహదారుల అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా భారత్ వడివడిగా ముందుకు సాగుతున్నది. గడ్కరీ చెప్పినట్టుగా 2024 నాటికి భారతీయ రహదారులు అమెరికా రహదారులకు దీటుగా నిర్మితమవుతాయి. అతి త్వరలో భారత్ సరికొత్త అమెరికా దేశంగా అవతరిస్తుంది. ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ లక్ష్యాన్ని సాకారం చేసుకుంటుంది.

‘న్యూస్ భారతి’ సౌజన్యంతో…