Home News జహంగీర్‌పురాలో ‘రాతి’ యుగం

జహంగీర్‌పురాలో ‘రాతి’ యుగం

0
SHARE

– మహేంద్ర కుమార్

హనుమాన్ జయంతిను పురస్కరించుకొని ఏప్రిల్ 16న శాంతియుతమైన శోభాయాత్రను చేపట్టిన హిందువులపై జహంగీర్‌పురాలో ఇస్లామిస్టులు రాళ్ళు రువ్వారు. పదునైనా ఆయుధాలతో దాడి చేశారు. అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. శోభాయాత్ర చేపట్టిన హిందువుల నుంచి ఎలాంటి కవ్వింపు చర్య లేకుండానే ఇంతటి దారుణానికి ఇస్లామిస్టులు ఒడిగట్టారు. హిందువుల ఇండ్లు, దుకాణాలపై రాళ్ళు, ఇనుప చువ్వలతో ముస్లిం మూకలు దాడులకు తెగబడ్డాయి. విధ్వంసకర శక్తులు జరిపిన కాల్పుల్లో పోలీసులు గాయపడ్డారు. యావత్ జహంగీర్‌పురాలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు.

దాడుల వెనుక కీలక కుట్రదారుల్లో ఒకడైన తుక్కు సామాన్ల వ్యాపారి, హిస్టరీ షీటర్ మహమ్మద్ అన్సారీతో పాటుగా మరికొందరు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన కొద్దిసేపటికే అన్సారీని ఒక సంఘ సేవకుడుగా, అల్లర్లను అడ్డుకున్న ఉత్తముడనే అవాస్తవిక వార్తలను వ్యాపింపచేయడానికి NDTV నేతృత్వంలోని లౌకికవాద ల్యాబీ ప్రయత్నించింది. అనంతరం, పోలీసులు జరిపిన దర్యాప్తులో దాడికి నాంది పలికింది అన్సారీ అని తేలింది. అల్లర్లకు కేంద్ర బిందువుగా ముస్లింలు అత్యధికంగా నివసించే జహంగీర్‌పురాలోని C-బ్లాక్ మారింది.

ఈ వాస్తవాన్ని నిర్ధారించుకునే నిమిత్తం ‘ఆర్గనైజర్’ నుంచి ఒక బృందం జహంగీర్‌పురాలో అల్లర్లు చోటు చేసుకున్న అన్ని ప్రాంతాలను సందర్శించింది. అక్కడి స్థానికులతో మాట్లాడింది. స్థానికుల మాటల్లో అన్సారీకి నేర చరిత్ర ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. నేర చరిత్రను కప్పిపుచ్చుకునే నిమిత్తం మెడలో ఒక బంగారు గొలుసు ధరించి, BMW కారుతో తాను ఒక సంపన్నుడననే రీతిలో అధికారులతో అతడు వ్యవహరించేవాడని తెలిసింది.

మసీదులో రాళ్ళ గుట్ట

ఈ మతపరమైన అల్లర్లు జహంగీర్‌పురాలో కుశాల్ చౌక్, జమా మసీద్, C-బ్లాక్, H-బ్లాక్, G-బ్లాక్‌లో చోటు చేసుకున్నాయి. జహంగీర్‌పురాలో ఏప్రిల్ 16న శోభాయాత్ర మొదలు కాగానే జమా మసీదు పైనుంచి, ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో శోభాయాత్రపై రాళ్ళ వర్షం కురిసింది. ఇస్లామిస్టులు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపారు. ఇస్లామిస్టులకు ఆయుధాలు మరీ ముఖ్యంగా తూటాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 25 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు మైనర్ బాలురను కూడా కస్టడీలోకి తీసుకున్నారు. హింసలో ఎనిమిది మంది పోలీసులు, ఒక పౌరుడు గాయపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల ప్రకారం సాయుధులైన ఇస్లామిస్టులు ఒక పథకం ప్రకారమే హింసకు దిగారని స్పష్టమవుతున్నది. మసీదులు, ఇండ్లపై నుంచి గాసు సీసాలతో శోభాయాత్రపై దాడి చేసిన వైనమూ తేటతెల్లమవుతున్నది.

ముస్లిముల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు కుశాల్ చౌక్‌కు దారి తీసే మార్గంలో తుక్కు సామాన్ల పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శోభాయాత్రకు ఒకరోజు ముందు ముస్లిములు ఈ దుకాణాల నుంచి గాజు సీసాలను తీసుకొని వచ్చారు. గాజు సీసాల్లో పెట్రోల్‌ను నింపారు. వాటిని తమ ఇండ్ల పైకప్పులపై ఉంచారు. ఇలా పెట్రోల్ నింపిన గాజు సీసాలను శోభాయాత్రలో పాల్గొన్న హిందువులపై విసిరివేశారు.

ఆశ్చర్యకరంగా, అదే రోజున ఈ ప్రాంతంలో రెండు యాత్రలు జరిగాయి. కానీ వాటిని లక్ష్యంగా చేసుకోలేదు. అయితే సాయంత్రం ఆరు గంటలకు కుశాల్ చౌక్‌కు సమీపంలో నిర్మితమైన ఒక మసీదు సమీపానికి చేరుకున్న మూడవ యాత్రపై జరిగింది. ఆ యాత్రలో కొద్ది మంది యువకులు మాత్రమే ఉన్నారు. పోలీసుల సంఖ్య కూడా నామమాత్రంగా ఉంది. ఈ కారణంగానే ఇస్లామిస్టులు ముందస్తు కుట్రతో ఈ యాత్రను లక్ష్యంగా చేసుకున్నారు.

రోహింగ్యాలకు నిలయం

జమా మసీదు పైన కాషాయ పతాకాన్ని ఎగురవేయడానికి హిందూ భక్తులు ప్రయత్నించిన కారణంగా అల్లర్లు ప్రారంభమయ్యాయనే దుష్ప్రచారం సాగించడానికి మీడియాలో ఒక వర్గం ప్రయత్నించింది. అయితే అలాంటిదేమీ లేదని శోభాయాత్రను, తదనంతరం జరిగిన అల్లర్లను ప్రత్యక్షంగా చూసిన ఒక పోలీసుతో పాటుగా ఒక ముస్లిం మత గురువు చెప్పడంతో ఆ దుష్ప్రచారానికి తెరపడింది. అల్లర్లలో హిందువుల ప్రమేయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్తానా తోసిపుచ్చారు. పతాక ఆవిష్కరణ లాంటి సంఘటన ఏదీ జరగలేదని ఆయన తేల్చి చెప్పారు. మీడియా ప్రముఖంగా ప్రస్తావించిన ప్రాంతం రోహింగ్యా ముస్లింలకు సైతం ఒక నిలయంగా మారింది. ఢిల్లీలో గతంలో జరిగిన తీవ్రవాద ఘటనలు, అల్లర్లలో రోహింగ్యాల ప్రమేయం ఉన్నది. జహంగీర్‌పురా అల్లర్లలో రోహింగ్యాల పాత్రను సైతం పోలీసులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి హై కమిషనర్ (UNHRC) ప్రకారం ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న 1,000 మంది రోహింగ్యా శరణార్థులు ఉన్నారు. ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఇంతకన్నా ఎక్కువ మంది ఢిల్లీలో ఉన్నారు. వారిలో అత్యధికులు కూలీపని చేసుకుంటున్నారు. శరణార్థులుగా ఉద్యోగాలను పొందిన తర్వాత ఢిల్లీలో స్థిరపడిపోతున్నారు.

‘ఆర్గనైజర్’ సౌజన్యంతో..