Home News తెలుగు భాషామతల్లి కంఠాభరణం – శ్రీ శివభారతం

తెలుగు భాషామతల్లి కంఠాభరణం – శ్రీ శివభారతం

0
SHARE

పుస్త‌క స‌మీక్ష‌

స్వాధీనతా అమృతోత్సవ తరుణంలో స్వాతంత్య్రోద్యమ లక్ష్యం ఏమిటో మనం ఒకసారి సింహావలోకనం చేయాలి. రాజ్యపాలనాధికారం ఒకరి నుండి మరొకరికి మారటం అనే స్వల్ప విషయం కాదు మన జాతీయోద్యమ లక్ష్యం అన్న విషయాన్ని మనం విస్మరించకూడదు.

వేలాది సంవత్సరాలుగా ఎందరో ద్రష్టల, స్రష్టల సృజనశీలత, ఎందరో వీరుల, శూరుల బలిదానాల వెల్లువల ఆధారంగా రూపుదిద్దుకుని, తనదైన ఒరవడిని ఏర్పరుచుకుని జగద్గురువుగా, అన్నపూర్ణగా, రత్నగర్భగా ఖ్యాతిగాంచిన హిందూ రాష్ట్రం తనకు ఎదురైన సవాళ్లను ఎలా తట్టుకుని నిలిచిందన్నది అందరికి ఆసక్తిదాయకమైన విషయమే అవుతుంది. ఒకవేళ పొరపాటున హిందూ రాష్ట్రం తన ఉనికిని కాపాడుకోలేకపోతే అది మానవాళికి ఎంతో చింతాజనకమైన విషయమవుతుంది. హిందూ రాష్ట్రం లేక హిందూ జాతి సగర్వంగా జీవించలేని స్థితి ఏర్పడటమంటే ఇప్పుడున్న భారతదేశంగా గుర్తింపు పొందుతున్న దేశం స్థానంలో మరో పేరు గల రాజ్యం ఏదో ఏర్పడటమే కాదు, కొన్ని వందల వేల తరాలు శ్రమించి సమకూర్చి పెట్టిన జ్ఞాన విజ్ఞానాలు ఇక ముందు ఎవరికీ ఉపయోగించకుండా పోతాయి. యోగవిద్య, సంగీతశాస్త్రం, నాట్యశాస్త్రం, శిల్పకళ, చిత్రకళ, కట్టుబొట్టు, తీరుతెన్నులు అన్నీ అంతర్థానమవుతాయి. మానవ ప్రగతికి, వికాసానికి, మోక్షానికి, నిర్భీతితో కూడిన చింతనకు, ప్రయోగాలకు అన్నింటికీ దారులు మూసుకుపోతాయి. అసమానమైన సాహిత్య సంపద నామరూపాలు లేకుండాపోతుంది. ‘అసహనం’ అంటే ఏమిటో ఇప్పటి ప్రజలకు అప్పుడు బాగా అర్థమవుతుంది. కానీ దానివల్ల ప్రయోజనం ఏముటుంది? భూతలస్వర్గం కాస్తా దెయ్యాల దిబ్బగా మారిపోయిన తరువాత ఎంత వగచినా ఏమీ ప్రయోజనం ఉండదు. (‘చరిత్ర పాఠాలను విస్మరిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది?’ అన్న గ్రంథ ప్రకాశకుల మనవి నుండి).

మహా విప్లవ మూల కారణాలు, లక్ష్యాలు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే – స్వధర్మ, స్వరాజ్యములే ఆ మహదాకాంక్షలు, ధర్మానురక్తి, దేశభక్తి. ఇక్కడి చరిత్రలోకాక ఇంకే చరిత్రలో ఇంత ఉత్కృష్టంగా వ్యక్తమయినాయి? అయితే ఈ రెండు లక్ష్యాలు పరస్పరం భిన్నమైనవా? స్వరాజ్యం, స్వధర్మం విభిన్నాలనే భావన కనీసం భారతీయులకు తెలియదు. సాధనం, సాధ్యముల వలే ఇవి పెనవేసుకున్నాయి. స్వధర్మం లేని స్వరాజ్యం ఏహ్యము. స్వరాజ్యము లేని స్వధర్మం శక్తి హీనము. (సావర్కార్‌ – 1857 ‌ప్ర.స్వా.సంగ్రామం నుండి)

‘స్వధర్మానికై లేవండి! స్వరాజ్యమును సాధించండి’ అని సమర్థ రామదాసు స్వామి ప్రబోధించినదీ ఇదే.

శివాజీ ఉద్యమానికి అంతఃసూత్రం – ధర్మమే
శ్రీ శివభారత కావ్యానికి ఆలంబన – ధర్మమే

పాఠకులమైన మనం చరిత్రను ధర్మదృష్టితో అధ్యయనం చేయాలి. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు భారతీయుల ప్రాణం ధర్మంలో ఉంది. అందుకే శ్రీకృష్ణభగవానుడు –

‘ధర్మ సంస్థాపననార్ధాయ సంభవామి యుగే యుగే’ అన్నారు.
జాతి జీవన గమనాన్ని, లక్ష్యాన్ని శ్రీ శివభారతం విశదీకరిస్తుంది.

ప।। అతని చరితము హైందవ
జాతి పరాయణము, భావి జగదభ్యుదయము
స్ఫీ•తము, ధర్మోపేతము
నీతి పథము, నిగమ సూక్తి నిభమై వెలయున్‌।।

‌ప।।        ధీరాగ్రేసరమూర్తి, హైందవ ధరిత్రీ భాగ్యసత్యాపన
ప్రారంభుండు దయాగుణాంబుధి మహారాష్ట్రాన్వయోత్తంసుడౌ
వీరక్షత్రియమౌళి భవ్యభరతోర్వీధర్మ రక్షార్పిత
శ్రీరమ్యుండు భవానిభక్తుడు శివాజి రాజు సామాన్యుడే!

‘శివాజీ భారతీయుల భాగ్య పరిపాకముగా జన్మించిన అపరశివుడు. మహమ్మ దీయుల క్రూరపాలనచే పరితప్తమైన హిందూజాతిని ఉద్ధరించుటకు పరమే శ్వరుడు పంపిన మహా ప్రమథుడు శివాజీ. పతితమై, భ్రష్ఠమై, స్ఫూర్తి రహితమై, నిస్తేజమైన ఈ పురాతన జాతి ధర్మావేశము నిర్మించి మట్టి నుండి మహా వీరమణు లను నిర్మించిన అద్భుత వ్యక్తి అతడు. భవానీ దయాదత్త కరవాల ఖేలా పునస్సంపాదిత రాజ్యలక్ష్మీ మహోదయుడైన మహాపురుషుడతడు’ అంటారు ఆచార్య ప్రసాదరాయ కులపతి. కసాయివాళ్లను సైతం తన వాక్‌ ‌నైపుణ్యంతో కరుణాపరులుగా మార్చిన వాచస్పతి శివాజీ.

ఆంధ్ర కవితా శారదకి, కవిత్వ విశారుదుడు గడియారంవారు ఈ పద్యంలో కరుణ రసాభిషేకం చేశారు.

చ।। ‘అటుగనుడయ్యా! పేద మొగమై కనుగోపుల నీరువాఱ ను
త్కోటము నార్చుచున్‌ ‌గుములు తల్లియు, దల్లినిఁజుటు ముట్టి సం
కటపడు దూడ, మీ కులముకై యొక శాపము వోయఁ గన్నుదో
యిట జలమెత్తెడున్‌, ‌బ్రతుకనెంచిన నీవిస మారగింతురే?’ అని ‘భరత భూశ్వాస కోశము గోమాత’ అంటారు గడియారం వారీ పద్యంలో.

తే।।‘బలము తేజంబు జీవన భాగ్యమిచ్చు
సాధు గోమాత భరత భూ శ్వాస కోశ;
మురియు నిద్దాని బంధింప, నుడికి పోదె
వట దళమ్మునఁ గనుమూయవాని కడుపు’.

తే।।‘తలఁపులో నున్న గోదేశ ధర్మ రక్ష
పలుకు తోడన చేసేతఁ గలుగజేసి,
ప్రథమ విజయంబు గూర్చు శాంభవికి మ్రొక్కి
యావు నడిపించుకొని, యింటికరిగె శివుడు’
ప్రథమ విజయాన్ని భవానిమాతకు అర్పించాడు శివాజీ.

శివాజీ రాజవంశంలో జన్మించాడు. రాజరిక వ్యవస్థలో పెరిగాడు, కానీ అతడు గొప్ప ప్రజాస్వామ్యవాది –

శివాజీ గురువు దాదాజీ అంటారు –

………………
…………….
………………..రా

జునుదత్ప్రాభవమున దదాజ్ఞనసదంచున్‌ ‌జూడరాదెవ్వడన్‌’’ అని.

దానికి సమాధానంగా శివాజీ ఇలా అంటారు –

ఉ।। నీతిపథమ్ము మెట్టి యవనీపతులందఱూ నేఁగుచో, జగ
త్త్రాతకు లేనిపోని యవతారము లెత్తఁబనేమి? దుష్ట సం
ఘాతము రాజులంబ్రజలఁ గల్గుట నిక్కము నాడు నేడు; భూ
నేతయటన్న మాత్రన వినేతుని శాసనమేల మోయఁగన్‌?
‌ప్రజా పక్షపతి శివాజీ

శివాజీ సహ్యాద్రి పర్వత శ్రేణులలో సంచరిస్తూండగా ఒక చెట్టు ఆకుపై ఒక సందేశం కనిపిస్తుంది –

ప।।‘చెదిరిపోయిన అంగముల్‌ ‌కుదురుపరచి
సడలువారిన తంతవుల్‌ ‌చక్కదీర్చి
అనుగత శ్రుతి భువన మోహనము గాగ
హాయి బలికెంప లెమ్ము జాతీయ వీణ’
అంతే స్పష్టమైన కర్తవ్యం దర్శనమిచ్చింది

ఈ కావ్యంలో తల్లి జిజియామాత పాత్ర చాలా ముఖ్యమైనదిగా తీర్చిదిద్దారు గడియారంవారు. ఆ మాటకొస్తే శివాజీ జీవితాన్ని ప్రభావితం చేసిన వీరమాత జిజియాబాయి.

ప।। స్వమత గో దేశ ధర్మరక్షణము కొరకు
నుచిత వజ్రాయుధమ్ముగా నొఱపు పెట్టి
తనయుఁ బెంచిన జీజియా ‘ధర్మపత్ని’
‘వీరపత్ని’యటంచు గర్వించె నతడు’

వీరశివాజీ అనుచరగణం ప్రమథగణంతో సమానం.

వీరాగ్రగణ్యుడైన భాజీ ప్రభుని ప్రభుభక్తి, సాహసం అనన్య సామాన్యం. 15 వేల మంది బీజాపుర సైన్యాన్ని 300 మంది అల్ప సైన్యంతో ఎదురొడ్డి నిలిచి, గెలిచిన ఆ మహావీర్యుని శౌర్యం జగన్నుతమైనది.

ఆ మహావీరుని రణాహ్వానం ఈ పద్యంలో చూడండి –

ప।। వెడలిరండు మహారాష్ట్ర వీరులార
తఱిగిపోయుడు రిపుల మస్తకముల గములు
మనకు రణరంగములు పెండ్లి మంటపములు
వీరలక్ష్మితో జయలక్ష్మి వియ్యమాడు!

భాజీ ప్రభుని బలిదానం ధీరోదాత్తుడైన శివాజీని కదిలించి వేసింది.

ప।। ఎంతలో నెంతలయిపోయె! నిపుడుగాదె
సెలవుగొంటివి – మరల దర్శింపలేని
సెలవు! బాజీ ప్రభూ! కనుల్‌ ‌సెదరమెఱిసి
మెఱుగులో ఱెప్పమరుగులో సురిగిపోతె!
బ్రతుకు అంటే అదీ బ్రతుకు –
‘ముహూర్తం జ్వలితం శ్రేయః, నతు ధూమాయితం చిరమ్‌।।
‌కాంతిపుంజంలా అలా మెఱిసి మాయమైపోవాలి!
పొగజూరిన బ్రతుకు ఎన్నాళ్లు బ్రతికిన ప్రయోజనం ఏమిటి?

అలాగే సింహగడ్‌ను అమూల్యమైన కానుకగా ప్రభువుకి సమర్పించి జీవన కుసుమాన్ని భరతమాతకి బహుమతిగా ప్రసాదించిన తానాజీ మరణం శివాజీని అమితంగా కలచివేసింది –

ప।। జారిపడినది – నా చేతి చంద్రహాస
మవగళితమయ్యె నా వజ్ర కవచమిపుడు
సింహగడమున గడమేమొ చిక్కెగాని
పోయినది సింహమే కుడిభుజము వోలె।।
గడ్‌ ఆలా, పన్‌ ‌సింహ గేలా!
వీర కరుణరసాన్వితమ్మూ శ్రీ శివభారతమ్ము!!

ప్రధానమైన వీరరస పోషణలో గడియారం వారిలో వీరశివాజీ పరకాయ ప్రవేశం చేశాడా? అనిపిస్తుంది. దానికితోడు శేషశాస్త్రి గా•రేమో! వీరరసం కావ్యం అంతటా బుసలుకొడుతూంటుంది. అయినా ఫర్వాలేదు అది ‘ధర్మవీరమ్‌’.

శ్రీ ‌శివభారతము (శివాజీ ప్రబంధము)
రచన : డా. గడియారము వేంకటశేషశాస్త్రి
ప్రతులకు: Ajeyam Strategy & Marketing Pvt Ltd
[email protected]
మొబైల్‌: 9121548857
‌పే.: 508; వెల: రూ.500

డా. కేకేవీ శర్మ

జాగృతి సౌజ‌న్యంతో…