Home News అంపశయ్య పైన అమెరికన్ డాలర్‌

అంపశయ్య పైన అమెరికన్ డాలర్‌

0
SHARE

-డాక్టర్ అంకిత్ షా

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం అంతర్జాతీయ సమాజ గమనంలో ఒక భారీ కుదుపునకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా నిపుణుల దృష్టిలో అమెరికన్ డాలర్ కరెన్సీ నిల్వల స్థితిగతులు ప్రశ్నార్థకమయ్యాయి. అంతర్జాతీయ సంస్థల అండదండలతో ఆంక్షలు విధించడంలో అమెరికా ప్రభుత్వం సంతరించుకున్న అధికారం, చెల్లింపు వ్యవస్థలు సమీప కాలంలో సవాళ్ళను ఎదుర్కోనున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలను రష్యా, ఇరాన్ వంటి దేశాలు పట్టించుకుంటాయా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఒకప్పుడు అంతర్జాతీయ కరెన్సీగా సర్వామోదం పొందిన అమెరికన్ డాలర్ ఆధిపత్యం ఆత్మహత్యా మార్గం పడుతున్న వైనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కుదిరిన ది బ్రెట్టోన్ వుడ్స్ ఒప్పందం యుఎస్ డాలర్‌ను ప్రపంచానికి రిజర్వ్‌డ్ కరెన్సీగా ఖరారు చేసింది. రిజర్వ్‌డ్ కరెన్సీ అంటే అర్థం అన్ని దేశాలు అమెరికన్ డాలర్లను తమ వద్ద ఉంచుకోవాలి. వాటి ద్వారా ఇతర దేశాలతో లేదా అంతర్జాతీయ సంస్థలతో ఏదేనీ ద్వైపాక్షిక లావాదేవీలు లేదా బహుముఖ లావాదేవీలు చేయాలి.

1971 సంవత్సరానికి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా(కమ్యూనిస్టేతర దేశాల్లో) నిర్వహించిన ఒక నమూనా సర్వేలో అత్యంత ఆరాధ్యనీయమైన వ్యక్తిగా అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిలిచారు. అప్పుడే అనేక ఆర్థిక సంక్షోభాలతో తలమునకలవుతున్న అమెరికన్ ప్రెసిడెండ్ నిక్సన్ అదే సంవత్సరం భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నారు. అమెరికన్ డాలర్‌కు, బంగారానికి మధ్య అప్పటిదాకా ఉన్న బంధాన్ని అదే రోజున నిక్సన్ నిర్దాక్షిణ్యంగా తెగ్గొట్టేశారు.

అమెరికా పొందిన ప్రయోజనాలు

ఫియట్ మనీ అంటే కరెన్సీకి బంగారం లాంటి ఏదేనీ పరిమిత వనరులతో సంబంధం ఉండదు. అంతర్జాతీయ డిమాండ్, కరెన్సీ సరఫరాకు తగ్గట్టుగా అమెరికన్ ప్రభుత్వం కరెన్సీ నోట్లను సునాయాసంగా ముద్రిస్తుంది.

అమెరికన్ డాలర్‌కు ఎప్పుడైతే రిజర్వ్ కరెన్సీ హోదా దక్కిందో, ప్రపంచ దేశాలన్నీ డాలర్లను సంపాదించడం కోసం ముందుగా కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అవే డాలర్లతో ఇతర దేశాలు లేదా అంతర్జాతీయ సంస్థలతో లావాదేవీలు జరపాలి. దీంతో అమెరికన్ డాలర్‌ కోసం ఒక కృత్రిమమైన గిరాకీ ఏర్పడింది.

ప్రపంచ దేశాలు ఒకదానికి ఒకటి లేదా ఏదేని అంతర్జాతీయ సంస్థ నుంచి రుణాలు పొందడం లేదా రుణాల చెల్లింపులకు అవసరమైన నగదు కోసం చివరకు అమెరికన్ ఫెడరల్ నిల్వలను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇది కడకు ఎక్కడి దాకా వచ్చిందంటే.. అమెరికాను మినహాయిస్తే మిగిలిన ప్రపంచమంతా తన సంపదను అమెరికాకు దారాదత్తం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అమెరికా మాత్రం తన ఇష్టానుసారంగా కరెన్సీని వాడుకునేది. ఏదేనీ చెల్లింపులు జరపాల్సి వచ్చినప్పుడు మాత్రం కరెన్సీ నోట్లను ముద్రించుకొని యధాలాపంగా చెల్లింపులు జరిపేది.

ఇతర దేశాలు మాత్రం అమెరికన్ డాలర్ల రూపేణా విదేశీ మారకం నిల్వలు, సురక్షిత నగదును ఎల్లప్పుడూ ఉంచుకునేవి. అలా నిల్వ ఉంచిన వాటితోనే ముడి చమురు, బంగారం, ఆహారం లాంటి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయగలిగేవి. యావత్ ప్రపంచానికి అత్యంత సురక్షితమైన పెట్టుబడి పోర్ట్‌ఫొలియో(safest investment portfolio) గా యూఎస్ ట్రెషరీ బాండ్లు(US treasury bonds) నిలిచాయి. బాండ్లతో యూఎస్ ప్రభుత్వం ఎంత భద్రంగా ఉన్నదంటే అది ఎప్పుడు పడితే అప్పుడు కరెన్సీ నోట్లను ముద్రించి మీకు తిరిగి ఇస్తుంది.

ప్రపంచ దేశాలన్నీ వాటి సేవింగ్స్‌ను అమెరికన్ డాలర్లలోకి మార్చుకోవడంతో అమెరికన్లు చాలా తక్కువ వడ్డీ రేటుకు రుణాలను పొందుతున్నారు. దానర్థం ద్రవ్యోల్బణంలో సింహ భాగం మిగిలిన ప్రపంచానికి క్రమక్రమంగా తాకుతున్నది.

ఇక వాణిజ్య లోటు గురించి అమెరికా ఏ మాత్రం చింతించాల్సిన పని లేదు. అది తనకు అవసరమైనప్పుడు రుణ గరిష్ఠ పరిమితిని పెంచుకుంటూ పోతుంది. అంతేకాదు ఎగుమతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం అమెరికా దేశానికి ఏ మాత్రం లేదు. అంతర్జాతీయ సంస్థల్లో అత్యధికం అమెరికన్ డాలర్లతో నడుస్తుంటాయి. కనుక ఎవరిపైనైనా లేదా ఏదైనా దేశంపైన అయినా ఆంక్షల విధింపు లేదా ఆంక్షల ఉపసంహరణ విషయంలో అమెరికా ప్రభావం కచ్చితంగా ఉంటుంది.

అమెరికన్ డాలర్ కట్టడికి ప్రపంచ దేశాలు తీసుకున్న చర్యలు

నేపాల్, భూటాన్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE), సింగపూర్ దేశాలు ఇండియన్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫెస్ – UPI తో లావాదేవీలు సాగిస్తున్నాయి

భారతీయ రూపాయి కరెన్సీతో లావాదేవీలు జరపడం కోసం UAE, మయన్మార్, రష్యా, ఇరాన్ లాంటి దేశాలు భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి

యువాన్, రూబుల్, దిర్హామ్ కాకుండా ఇతర కరెన్సీలతో రష్యాతో చమురు ఒప్పందాలు చేసుకోవాలనే ఆలోచనలో భారత్ ఉంది. అంతర్జాతీయ వాణిజ్య సెటిల్‌మెంట్లకు కరెన్సీగా రూపాయికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ఆమోదం తెలిపింది

సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య, వ్యాపార ఒప్పందాలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకునే ప్రక్రియకు భారత్ నాంది పలికింది. ఇది బహుముఖ వాణిజ్య ఒప్పందాల నుంచి ఒక స్పష్టమైన నిష్క్రమణం. ఇది భవిష్యత్తులో భారతీయ కరెన్సీ విస్తార వినియోగానికి దోహదం చేస్తుంది

ఉక్రెయిన్‌తో తలపడటం కోసం అమెరికన్ డాలర్లలో పెట్టుబడులను, రిజర్వులను ఇతర రూపాల్లోకి బదలాయింపు, రూపాంతరం చేయడం ద్వారా 2021 సంవత్సరం మధ్య కాలానికి కీలకమైన క్రతువుకు రష్యా నాంది పలికింది

సౌదీ అరేబియా అమెరికన్ డాలర్లకు బదులుగా యువాన్లలో ఒక చమురు ఒప్పందం చేసుకుందామనే ప్రతిపాదనను చైనా ముందు ఉంచింది. యువాన్లలో వాణిజ్యం నెరపాలనే ప్రక్రియలో బెలారస్ స్టాక్ ఎక్చేంజ్ ఉంది

అమెరికన్ డాలర్ నిల్వలను కనిష్టం చేసుకున్న ఇజ్రాయెల్ బదులుగా యువాన్‌కు చోటు కల్పించింది. అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికన్ డాలర్‌ను పక్కనపెడతామని ఇరాన్ పునరుద్ఘాటించింది. దేశంపై భవిష్యత్తులో విధించే ఆర్థిక ఆంక్షల గురించి చైనా సైతం ఆలోచిస్తున్నది

దేశీయ కరెన్సీల్లోనే అన్ని రకాల వాణిజ్య లావాదేవీల నిర్వహణకు ఒక ముసాయిదా ఒప్పందం చేసుకోవాలనే ఆలోచనలో బ్రిక్స్ దేశాలు(BRICS- బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఒక ఉమ్మడి BRICS కరెన్సీ సమూహం రూపకల్పనకు సంబంధించిన వార్తలు కూడా వినిపిస్తున్నాయి

భౌగోళిక రాజకీయ పర్యవసానాలు

ఇరాన్, రష్యా, భారత్, చైనా, సౌదీ అరేబియా, UAE, ఇజ్రాయెల్ లాంటి పెద్ద దేశాలు క్రమక్రమంగా అమెరికన్ డాలర్‌ను రిజర్వ్ కరెన్సీ హోదా నుంచి తప్పించడానికి మొగ్గుచూపుతున్నాయి. ఇది కొన్ని దేశాలపై భౌగోళిక రాజకీయంతో పాటుగా ఆర్థికపరమైన, రక్షణ సంబంధితమైన పర్యవసానాలకు దారి తీస్తుంది. సంబంధిత ప్రాంతాల్లో వాణిజ్యం, శాంతిని పాదుగొల్పే దిశగా ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో వాటిదైన అప్రకటిత ఆమోదం దృష్ట్యా భారత్, రష్యా, చైనా దేశాల మధ్య ఒక సరికొత్త సూత్రం రూపకల్పనకు నోచుకుంటుందని ఒక అంచనా. అమెరికాతో ప్రపంచానికి ఏ మాత్రం పనిలేదని అవగతమైన తరుణంలో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకుల్లో అమెరికా డాలర్ రిజర్వ్‌లను బంగారం, ఇతర కరెన్సీలతో భర్తీ చేసే రోజు ఇక ఎంతో దూరంలో లేదు.

SOURCE : ORGANISER