పేరుకు వెదిరె రామచంద్రరెడ్డి అన్న మాటే కానీ.. వినోబా బావే అడిగిందే తడవుగా భూదానోద్యమం కోసం మొత్తంగా 1,000 ఎకరాల భూమిని దానంగా ఇచ్చి ‘భూదాన్’ రామచంద్రారెడ్డిగా చరిత్ర పుటల్లో వారు నిలిచిపోయారు. ‘భూమికోసం యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. కానీ రామచంద్రారెడ్డిగారు మన సమస్యలను అర్థంచేసుకొని.. మొదట 100 ఎకరాల భూమిని దానం ఇవ్వడంతో భూదానోద్యమం ప్రారంభమైంది. మనం చేపడుతున్న భూదానోద్యమానికి మొదటి మహాదాత ఆయనే’ అని పోచంపల్లిలో నిండు సభలో ఉద్ఘాటించారు వినోబా బావే.