Home News శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితం

శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితం

0
SHARE

కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి సమయోచితమైనదిగా వక్తలు అభిప్రాయపడ్డారు. బహుముఖీనమైన, బహు మితీయ దార్శనికులైన శ్రీ అరబిందో తత్త్వ జ్ఞానము, హిందూ ధర్మాన్ని అధిగమించి యావత్ విశ్వానికి చెందినవారుగా నిలిచారని పేర్కొన్నారు.

శ్రీ అరబిందో 150వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘అరో అధ్యాయన్’, ‘శ్రీ అరబిందో అండ్ ఇండియా’ పేరిట ఒక రోజు సదస్సు భాగ్యనగరంలోని సెంటర్ ఫర్ ఎకనమికల్ అండ్ సోషల్ స్టడీస్(CESS) లో ఆగస్టు 21న జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ, ప్రజ్ఞా భారతి, సంవిత్ కేంద్ర సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. సదస్సులో ఫలవంతమైన, విజయవంతమైన చర్చలు జరగాలని గవర్నర్ గారు ఆకాంక్షించారు.

సదస్సును ఉద్దేశించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్.ఎస్. సర్రాజు గారు ప్రసంగిస్తూ శ్రీ అరబిందో దృక్పథం ప్రస్తుత కాలానికి అత్యంత సమయోచితమైనదిగా అన్నారు.

అరోవిల్లే నుంచి సదస్సుకు హాజరైన ప్రొఫెసర్ (డాక్టర్) వి ఆనందరెడ్డి గారు ‘The Renaissance in India’ (భారత్‌లో పునరుజ్జీవనం) అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. శ్రీ అరబిందో ఆలోచనలను అవగతం చేసుకున్న వ్యక్తులు రానున్న సంవత్సరాల్లో శ్రీ అరబిందో ప్రాపంచిక దృక్పథాన్ని ఆవాహన చేసుకుంటారని వారు అన్నారు. తత్త్వ జ్ఞానము, హిందూ ధర్మం అవధులను దాటిన బహుముఖీన, బహు మితీయ దార్శనికులైన శ్రీ అరబిందో యావత్ విశ్వానికి చెందినవారుగా ప్రొఫెసర్ (డాక్టర్) ఆనందరెడ్డి గారు అభివర్ణించారు.

ప్రముఖ రచయిత ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే గారు ‘Bhavani Bharathi : Sri Aurobindo’s Zeitgeist of the Nation’ (భవాని భారతి: శ్రీ అరబిందో ప్రవచించిన జాతి యుగధర్మము) అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. శ్రీ అరవిందో ప్రవచించిన అద్భుతమైన ‘భవాని భారతి’ ని మరోసారి సందర్శించడం ద్వారా భారత్ పునరుజ్జీవనం కోసం అసంపూర్ణంగా మిగిలిపోయిన కార్యాచరణను పూర్తి చేయడానికి మనం ప్రేరేపితులము అవుతామని వారు అన్నారు. జాతి స్ఫూర్తి దిశగా పయనించడానికి మనం దేశ హితానికి ఉద్దేశించిన యజ్ఞానికి బదులుగా విశ్వ యజ్ఞం చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ మకరంద్ పరాంజపే గారు తెలిపారు.

సమాచార భారతి, సంవిత్ కేంద్ర ప్రతినిధి శ్రీ ఆయుష్ నడింపల్లి గారు మాట్లాడుతూ భారతీయ కళలు, కళాతత్త్వ శాస్త్రం దివ్యమైన భవాని భారతి సంప్రదాయంలో భారతి దృక్కోణానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని అన్నారు. శ్రీ అరబిందో రచించిన ‘Renaissance of India’ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని వారు విజ్ఞప్తి చేశారు.

అరోవిల్లే నుంచి సదస్సుకు హాజరైన ప్రముఖ రచయిత డాక్టర్ బేలూ మెహ్రా గారు ‘Indian Artistic and Literary Culture in the Light of Sri Aurobindo’ (శ్రీ అరబిందో కాంతి రేఖలో వెలుగొందిన భారతీయ కళాత్మక మరియు సాహితీ సంస్కృతి) అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.

 

 రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) జాతీయ కార్యనిర్వాహక సభ్యులు, ప్రజ్ఞా ప్రవాహ కన్వీనర్ శ్రీ జె.నందకుమార్ ‘Sri Aurobindo’s Vision of Indian Polity: Building a Dharmic Society’ (భారతీయ రాజ్యపరిపాలనా పద్ధతిపై శ్రీ అరబిందో దృక్పథం: ఒక ధార్మిక సమాజ నిర్మాణం) అనే అంశంపై కీలకమైన ఉపన్యాసం చేశారు. వలస పాలకుల నుంచి భారత్ స్వాతంత్ర్యం పొందిందని కొందరు మేధావులు విశ్వసిస్తుంటారని, కానీ అది వాస్తవం కాదని శ్రీ నందకుమార్ గారు అన్నారు. కనుక మన చరిత్రను స్మరించుకోవాల్సిన కీలకమైన బాధ్యత ప్రతి పౌరుడిది ముఖ్యంగా యువతరానిదిగా వారు తెలిపారు. అందుకోసం ‘స్వతంత్రత’ తాలూకు నిజమైన అర్థాన్ని తెలుసుకోవడాన్ని మనం ఆరంభించాలని శ్రీ నందకుమార్ జీ అన్నారు. భారత్‌ను కేవలం యాంత్రికంగా కాకుండా నైతిక, ఆధ్యాత్మిక మార్గాల్లో జాగృతపరచాలని శ్రీ అరబిందో విశ్వసించేవారని తెలిపారు. స్వతంత్రత మనలను కేవలం ప్రభుత్వాన్ని మార్చడానికి మాత్రమే పరిమితం చేయదని శ్రీ నందకుమార్ జీ అన్నారు. అయితే రాజకీయ ఆధ్యాత్మికత అందులో కేవలం ఒక భాగం మాత్రమేనని తెలిపారు. రాజకీయ, సామాజిక, కళ, సాహితీ రంగం ఇలా అనేక రంగాల్లో ధర్మాన్ని పాదుగొల్పడం ఒక ఉత్తమమైన మార్గమని వారు చెప్పారు.

సంవిత్ కేంద్రానికి చెందిన శ్రీ బాల్ రెడ్డిగారు, అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ ప్రతినిధి డాక్టర్ చలమయి రెడ్డి గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

-ప్రదక్షిణ