- డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి పాత నగరం పరిస్థితి వివరించిన విశ్వహిందూ పరిషత్ (VHP)రాష్ట్ర బృందం
ప్రశాంతమైన భాగ్యనగర్ లో విధ్వంసం సృష్టిస్తున్న అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ (VHP) రాష్ట్ర బృందం డీజీపీ మహేందర్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసింది. “ప్రశాంతమైన భాగ్యనగరంలో చిచ్చు పెట్టింది ఎవరు..? పరమ పవిత్రమైన వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంలో మునావర్ షో కు అనుమతించింది ఎవరు..? దేశంలోని 16 రాష్ట్రాలలో మునావర్ షోలను నిషేధించినా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆయనను ఘనంగా ఎందుకు ఆహ్వానం పలికింది..? ఒక రాష్ట్రపతి.. ఒక ప్రధానమంత్రి తరహాలో భద్రతా కల్పించి హిందువులను తిట్టించాల్సిన అవసరం ఏమొచ్చింది..? హిందూ దేవి దేవతలను అవమానపరిచే కామెడీ షో కోసం భాగ్యనగరం లోని హిందూ సంస్థలను బందీలను చేయడం అవసరమా..? అయితే…ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానంగా భావించాల్సి వస్తోంది.” అని విశ్వహిందూ పరిషత్ డిజీపీ కి అందజేసిన లేఖలో పేర్కొంది.
భాగ్యనగరాన్ని అతలాకుతలం చేసి, అల్లర్లు సృష్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం మునావర్ షో కు అనుమతించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు! రాజకీయ లబ్ధి కోసం హిందూ వ్యతిరేక చర్యలకు పూనుకోవడం క్షమించరాని దుశ్చర్యగా విశ్వహిందూ పరిషత్ భావిస్తోందని లేఖలో పేర్కొన్నారు.
అధికార దాహం కోసమే తెలంగాణ సర్కార్ ఈ చిచ్చు పెట్టిందని, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తూ హిందుత్వంపై విషం చిమ్మే పనిలో పూర్తిస్థాయిలో నిమగ్నమై, తెరాస తమ మిత్రపక్షమైన మజిలీస్ పార్టీకి హిందువులపై దాడులు చేసే స్వేచ్ఛను అప్పగించి, మునావర్ ఫరూక్ అనే హిందూ ద్రోహిని ప్రోత్సహిస్తూ.. ఇటివల అతడి కామెడీ షోకు పోలీసులు అనుమతి ఇచ్చి హిందువులను రెచ్చగొట్టారని VHP లేఖలో పేర్కొంది. మునావర్ వస్తున్నాడని ముందుగానే హిందూ సంస్థల నాయకులను, .. ముఖ్యంగా VHP , బజరంగ్దళ్ కార్యకర్తలను హౌస్ అరెస్టు చేశారని, మరికొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు తీసుకెల్లారని, పోలీసులు రాష్ట్ర మొత్తం ఇదే పరిస్థితి నెలకొల్పారని లేఖలో పేర్కొన్నారు. అయితే మునావర్ ను రాష్ట్రానికి రానివ్వద్దని.. వస్తే అడ్డుకొని తీరుతామని హిందూ సంస్థలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, పైగా కవ్వింపు చర్యలకు పాల్పడిందని, వేలాది పోలీసులను మోహరించి షో నిర్వహించి నగరంలో అల్లర్లకు దారితీసేలా చేసిందని VHP లేఖలో పేర్కొంది.
“హిందూ దేవీ దేవతలను కావాలని అవమానపరిచిన మునావర్ ను నగరానికి అనుమతించవద్దంటూ జరిగిన నిరసన కార్యక్రమాలు.. తదనంతరం జరిగిన పరిణామాల కారణంగా భాగ్యనగరంలో ముస్లిం మూకలు రెచ్చిపోయి, హిందువులపై విరుచుకుపడ్డాయి. పాత నగరంలో చాలా ప్రాంతాలలో ముస్లిం దుండగులు స్వైర విహారం చేశారు. పలుచోట్ల హిందువుల ఇల్లు.. దుకాణాలపై రాళ్ల వర్షం కురిపించారు. కొన్ని ప్రాంతాల్లో హిందువుల ఇల్లకు నిప్పు పెట్టారు. ఏకంగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని తగలబెట్టారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు . చార్మినార్, శాలిబండ, చత్రినఖ, ఉప్పరపల్లి తదితర ప్రాంతాల్లో ముస్లింలు యదేచ్చగా మారణాయుధాలతో రోడ్లపై ర్యాలీ నిర్వహించారు. హిందుత్వానికి.. ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భయభ్రాంతులు సృష్టించారు. అయినా కూడా పోలీసులు, ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణం. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ముస్లిం అల్లరి మూకలు చేసిన వికృత విన్యాసాలను పోలీసులు కల్లప్పగించి చూశారు తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతటి భయానక పరిస్థితుల్లో హిందూవు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి నైతిక బాధ్యత తెలంగాణ సర్కారుదే నని విశ్వహిందూ పరిషత్ ఆరోపిస్తోంది. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి భాగ్యనగరంలో హిందువులకు రక్షణ కల్పించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.” లేఖలో పేర్కొంది.
గోషామహల్ ప్రాంతాన్ని తగలబెడతామని.. రాజాసింగ్ ఎక్కడ కనపడితే అక్కడ దాడులు చేయాలని పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్, అతని తమ్ముడు రషీద్ ఖాన్ లను వెంటనే అరెస్టు చేయాలని వారి వ్యాఖ్యల వల్ల ముస్లిం సమాజం మరింత రెచ్చిపోతుందని, అసలు ఇప్పటివరకు వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు పోలీసులు సమాధానం చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.
“ముస్లింలు అమాయకులని.. హిందువులే కావాలని రెచ్చగొడుతున్నారని.. పాత నగరంలో ప్రశాంత వాతావరణన్ని పాడు చేస్తున్నారని సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ ఆనంద్ కుమార్ వ్యాఖ్యలను హిందూ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. హిందువులు కావాలని ముస్లింలను కేసులలో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం.. ఇది హిందువుల మైండ్ గేమ్ అని.. పోలీసులు ముస్లింల మధ్య హిందువులు గొడవలు పెడుతున్నారని స్వయానా అడిషనల్ డీసీపీ మాట్లాడటం చట్ట విరుద్ధం. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను హిందూ సమాజానికి ఆపాదిస్తూ కోర్టు పరిధిలో ఉండాల్సిన అంశాన్ని పక్కనపెట్టి, హిందూ సమాజాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ముమ్మాటికి నేరం. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది.” అని విశ్వహిందూ పరిషత్ డిజీపీ కి అందజేసిన లేఖలో పేర్కొంది.