Home News కాశీని తలపిస్తున్న కందకుర్తి గంగా హారతి

కాశీని తలపిస్తున్న కందకుర్తి గంగా హారతి

0
SHARE

ఆ విశ్వేశ్వరుడి చెంత కాశీలో అంగరంగ వైభవంగా జరిగే గంగాహారతికి అద్దం పడుతున్నట్టుగా పవిత్ర సంగమ ప్రాంతం కందకుర్తి గంగాహారతి శోభిల్లుతున్నది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తూ, తన తీరాన్ని సారవంతంగా మార్చి, గలగల పారుతూ వస్తున్న గోదావరి మాత తెలుగునాట అడుగుపెట్టే ప్రాంతం కందకుర్తి.

ఈ క్షేత్రం పవిత్ర గోదావరి, మంజీరా, హరిద్రా నదుల త్రివేణీ సంగమ క్షేత్రం. ప.పూ.డా. కేశవరావ్ బలిరాం పంత్ హెడ్గేవార్ జీ పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఇంతటి పరమ పవిత్ర పుణ్య స్థలిలో శోభాయమానంగా జరుగుతున్న గంగాహారతి కాశీలో అనునిత్యం జరిగే గంగాహారతిని తలపిస్తున్నది. కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో 2015 నుండి ప్రతీ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం జరుగుతున్నది.

గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుంచి హారతులతో బయలుదేరిన సుమారు 200 మంది మహిళలు గోదావరి తీరానికి చేరుకోవడంతో గంగాహారతి ఉత్సవం ఆరంభమవుతుంది. కార్యక్రమానికి శుభప్రదంగా భక్తులు గోపూజను చేస్తారు. అనంతరం అశేష భక్త జనసందోహం చూస్తుండగా పరమపవిత్రమైన గంగాహారతిని గోదావరి మాత అందుకుంది.

ఉత్సవానికి ముక్తాయింపుగా దాదాపు రెండు వేల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడం విశేషం. గోదావరి మాతకు గంగాహారతిని ప్రత్యక్షంగా వీక్షించడానికి తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనేక మంది సాధుసంతులు, సత్ పురుషులు, సామాజిక సేవకులు, ప్రభుత్వ అధికారులు సైతం గంగాహారతికి వీక్షకులు కావడం కార్యక్రమ విశిష్టతకు నిదర్శనం. విచ్చేసిన ప్రముఖులకు శ్రీమద్ రామాయణం, మహా భారతం వంటి సత్ గ్రంథాలతో సత్కరించడం కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చింది.

కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్‌డౌన్ విధించడానికి ముందు ప్రతి పౌర్ణమి నాడు గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించేవారమని కేశవ సేవా సమితి కార్యదర్శి శ్రీ అంకు మహేశ్ గారు తెలిపారు. ప్రస్తుతం ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్లో గోదావరి మాతకు గంగాహారతిని ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. కాశీలోనే గంగాహారతిని దర్శించలేనివారు కందకుర్తిలో గంగాహారతిని దర్శించుకోవడం ద్వారా అంతటి ఆధ్యాత్మిక అనుభూతిని పొందవచ్చని అనడం ఎలాంటి అతిశయోక్తి లేదు.

-రాంనరేష్