Home News 40 వేలకుపైగా విగ్రహాలతో భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం

40 వేలకుపైగా విగ్రహాలతో భాగ్యనగరంలో ఘనంగా గణేశ్ నిమజ్జనం

0
SHARE

గణేశ్ చతుర్ధి ఉత్సవాలను పురస్కరించుకొని భాగ్యనగరంలోని వినాయక సాగర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర తటాకాలు, కృత్రిమంగా నిర్మించిన తటాకాల్లో 40 వేలకు పైగా వినాయక విగ్రహాలను భక్తులు శుక్రవారం నిమజ్జనం చేశారని సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ‘గణపతి బప్పా మోరియా’, ‘గణేశ్ మహరాజ్‌కి జై’ అంటూ నినదిస్తూ లక్షలాదిగా భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. భాగ్యనగరంలోని వీధులు, వినాయక సాగర్‌కు చెందిన ట్యాంక్‌బండ్ భక్త జనసందోహం నడుమ ఆధ్యాత్మిక శోభను వెల్లివిరిసాయి. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత జరిగిన గణేశ్ నిమజ్జనం ఆనందోత్సహాల మధ్య జరిగింది. పెద్ద సంఖ్యలో యువత శోభాయాత్రలో పాల్గొన్నారు.

అశేష భక్తజనవాహిని మధ్య ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన 50 అడుగుల గణేశ్ విగ్రహం పుర వీధుల్లో నాలుగు గంటలపాటు ఊరేగిన అనంతరం వినాయక సాగర్ వద్ద ఏర్పాటు చేసిన నాల్గవ నెంబర్ క్రేన్ వద్దకు చేరుకుంది. ఖైరతాబాద్ వినాయక విగ్రహ నిమజ్జనం ఘనంగా జరిగింది.

భాగ్యనగరానికి దక్షిణ భాగాన ఉన్న బాలాపూర్ నుంచి ఆరంభమైన శోభాయాత్ర పాతబస్తీ, మొజంజాహి మార్కెట్, తదితర నగరంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వినాయక సాగర్‌కు చేరుకుంది. ముంబై, పూనె తర్వాత దేశంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే నిమజ్జనోత్సవానికి చెందిన శోభాయాత్రకు పక్కనే ఉన్న లాల్ దర్వాజా, షాలిబండ, బేగం బజార్, గోషామహల్, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాలకు చెందిన గణేశ విగ్రహాల నిమజ్జన ఊరేగింపులు కూడాయి.

గణపతి విగ్రహాలతో వేలాదిగా భక్తులతో కూడిన శోభాయాత్రతో మొహంజాహి మార్కెట్ కూడలి అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ‘బేగం బజార్ కా రాజా’ అని పేరొందిన ‘పహిల్వాన్ గణేశ్’ విగ్రహం భక్తులకు కనులపండువ చేసింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మతో పాటుగా భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జనం కోసం వినాయక్ సాగర్‌కు తరలివెళుతున్న వినాయక విగ్రహాలకు పుష్పాలను సమర్పిస్తూ, భజనలు చేస్తూ స్వాగతం పలికారు.