Home News “సమస్యలను సానుకూలంగా మలుచుకుని సమాజ సేవ చేసిన మహనీయుడు డా. అంబేద్కర్”

“సమస్యలను సానుకూలంగా మలుచుకుని సమాజ సేవ చేసిన మహనీయుడు డా. అంబేద్కర్”

0
SHARE

డా బి.ఆర్ అంబేద్కర్ తన జీవితకాలంలో అనుభవించిన కష్టాల నేపథ్యం నుండి ఉద్భవించిన ఆక్రోశం, ఆవేదన, ఆవేశాలను సమాజంపై పగ, కక్ష సాధింపులకు కాకుండా సానుకూలంగా తన జీవితాన్ని మలుచుకుని విద్యను , వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకొని, దీన జనోద్దరణలో కాలం గడిపిన మహనీయుడని సామాజిక స‌మ‌ర‌స‌తా వేదిక తెలంగాణ ప్రాంత క‌న్వీన‌ర్ శ్రీ అప్పాల ప్రసాద్ జి అన్నారు.

డిసెంబ‌ర్ 6 అంబేద్క‌ర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా గోదావరిఖనిలోని మెయిన్ చౌరస్తా లో జరిగిన బహిరంగ సభలో 25 కులాలకు చెందిన ప్ర‌జ‌లు, ప్ర‌ముఖులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హ‌జ‌రైన శ్రీ అప్పాల ప్ర‌సాద్ జీ మాట్లాడుతూ అన్ని కులాలలో సద్గుణ వంతులు జన్మించి, సమాజ ఐక్యతకు కృషి చేశారని, 1920లో డా బి.ఆర్ అంబేద్కర్ 18 కులాల ప్రజలతో సామూహిక భోజనం చేసి, సమతను చాటారని తెలిపారు. ‘శూద్రులు ఎవరు’ అను పుస్తకంలో ఆర్య ద్రావిడ సిద్ధాంతం అబద్దమని తేల్చి చెప్పార‌ని గుర్తు చేశారు. ‘అస్పృష్యులు ఎవరు’ అను పుస్తకాన్ని మహాత్మా ఫూలే కి అంకితమిచ్చి, బ్రాహ్మణులైనా, శూద్రులైనా ఒకే సంస్కృతికి చెందిన వారని ధ్రువీకరించారు, “థాట్స్ ఆన్ పాకిస్తాన్ ” అను పుస్తకాన్ని భార్య రమాబాయికి అంకిత మిచ్చి ఇస్లాంలోని సోదర భావం కేవలం ఆ మతానికి చెందిన వారికే పరిమితమని పేర్కొన్నారు. అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడని చెప్పే ఉన్నత తత్వం హిందూ ధర్మంలో ఉందని చెప్తూ, కుల వివక్షత, అంటరాని తనం పేరుతో తోటి హిందువులను దూరంగా ఉంచే దురాచారం తొలగితేనే హిందూ సమాజం ప్రగతి చెందుతుందని స‌మాజానికి దిశానిర్ధేశం చేసి ఆ దిశలోనే కఠోర పరిశ్రమ చేసిన అంబేద్కర్ మ‌నందరికీ ఆదర్శ పురుషుడని అప్పాల ప్రసాద్ జి అన్నారు.

అనంత‌రం డా వంశ తిలక్ మాట్లాడుతూ కార్మికుల కోసం అంబేద్కర్ ఎన్నో ఆర్థిక అవకాశాలు రాజ్యాంగంలో కల్పించారని, లింగ, కుల, వర్గ భేదం లేకుండా అందరికి రాజ్యాంగ ఫలాలు అందించే చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. మారేడు మోహన్ మాట్లాడుతూ మతం మారిన వారికి రిజర్వేషన్ లు ఇవ్వకూడదని, నిజమైన దళితులకే ఇవ్వాలని డా అంబేద్కర్ నిర్ణయించారని బాలకృష్ణ కమిషన్ కి దళితులు దరఖాస్తు ఇస్తున్నట్లు చెప్పారు. న్యాయవాది సంజయ్ కుమార్ సభను సంచాలనం చేశారు.