మనదేశానికి స్వాతంత్య్రం ఏ ఒక్కరివల్లో వచ్చింది కాదు…ఎందరో వీరుల ప్రాణత్యాగఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. . బ్రిటిష్ వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతే లేదు. అయితే బ్రిటీషర్లు పాలిస్తున్న ఆ కాలంలో అంటే 1880 నుంచి 1920 వరకు సుమారు నాలుగు దశాబ్దాల కాలంపాటు మనదేశంలో వారి అకృత్యాలకు సుమారుగా పదికోట్ల భారతీయులు మరణించారని ఓ అధ్యయనంలో తేల్చి చెప్పారు.
డైలాస్ సుల్లివన్, జాసన్ హికెల్ లు కలిసి ‘పెట్టుబడిదారీవిధానం, తీవ్రపేదరికం: 16వ శతాబ్దం నుంచి వేతనాలు మరియు మరణాల ప్రపంచ విశ్లేషణ’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు భారతీయులు ఎంతమంది చనిపోయారన్న విషయంపై కూడా వారు పరిశోధన చేశారు. వారి లెక్క ప్రకరారం సుమారు పదికోట్లమంది భారతీయులు బ్రిటిషర్లవల్ల మరణించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే మానవులు చేసిన అత్యంత దారుణమైన దమనకాండగా వారు పేర్కొన్నారు. `బ్రిటీష్ సామ్రాజ్యవాదం’…అనే శీర్షికతో వరల్డ్ డెవలప్మెంట్ జర్నల్ అనే పత్రికలో వారు ప్రచురించిన వ్యాసంలో ఈ అధ్యయనం గురించి ప్రస్తావించారు.
తీవ్రమైన పేదరికం, ఆర్థిక, సామాజిక సంక్షోభం బ్రిటిషర్ల వలసవాద కాలంలోనే ఉండేది. ఆ తర్వాత అంటే పదహారవ శతాబ్దం చివరలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిచెందడంతో జీతాలు జీవనాధార పరిస్థితులకంటే కూడా తక్కువయిపోయాయి. మానవుల ఎత్తు తగ్గిపోయింది. అకాల మరణాలు కూడా పెరిగాయని వారు తమ వ్యాసంలో వ్రాశారు. అప్పటికి దక్షిణాసియా, సబ్ సహారా, ఆప్రికా, లాటిన్ అమెరికాలంటి దేశాలలో ఇంకా అభివృద్ధి అనేదే లేదు. కేవలం ఇరవైయవ శతాబ్దం ప్రారంభం నుంచి ప్రజాస్వామ్య, వలసవాద వ్యతిరేక ఉద్యమాలు పెరగడంతో ఆ దేశాలు గణనీయంగా అభివృద్ధి చెందినట్లు ఈ నివేదిక చెబుతోంది.
ఇక 1880 నుంచి 1920 వరకు ఉన్న సమయంలో బ్రిటిష్ వారి వలసవాద పద్దతుల కారణంగా మరణించిన వ్యక్తుల సంఖ్యను, అప్పటి జనాభాలెక్కల సమాచారాన్ని ఉపయోగించి రచయితలు ఒక అంచనా వేశారు. భారతదేశంలో మరణాల రేటుపై వారు అంచనా వేసిన గణాంకాలు 1880 నాటివి. దీన్ని కనిష్ట ప్రమాణంగా తీసుకోవడం ద్వారా 1891 నుంచి 1920 మధ్యకాలంలో బ్రిటిష్ వలసవాదం వల్ల దాదాపు 5కోట్ల అధిక మరణాలు జరిగాయని వారు కనుక్కున్నారు. బ్రిటిషర్ల సమయంలో అభివృద్ధి జరిగిందని చెబుతూ, వారి పాలన బాగుంది అంటూ, వారే భారతీయులకు నాగరికత నేర్పారని చెబుతూ.. వారి మెప్పుకోసం తహతహలాడేవారు ఈ విషయాలపై మాత్రం స్పందించరు. కానీ ఇది చరిత్ర చెబుతున్న నిజం.
5కోట్ల అధిక మరణాలు అన్నది చాలా పెద్ద సంఖ్య. నామమాత్రంగా అంచనా వేస్తేనే ఇంతమంది చనిపోగా, ఇక వాస్తవ ఆదాయాలకు సంబంధించిన సమాచారం ప్రకారం వలసరాజ్యాల ప్రభావం వల్ల భారతదేశంలో జీవన ప్రమాణాలు 1880 నాటికంటే గణనీయంగా పడిపోయాయి. బ్రిటిష్ వారి వలసరాజ్యానికి ముందు భారతదేశంలో మరణాల రేటు 16, 17వ శతాబ్దాలలోని ఇంగ్లాండ్ తో పోల్చితే సుమారు వెయ్యిమందికి 27గా ఉండేవి. అదే 1881 నుంచి 1920 మధ్య భారతదేశంలో 16కోట్ల 50 లక్షల మంది చనిపోయారు.
ఈ భారీ ప్రాణనష్టానికి బ్రిటిషర్లు అవలంబించిన వివిధ విధానాలే కారణం. వ్యాపారం చేసుకుంటామని వచ్చిన వారు ఈ దేశాన్ని ఆక్రమించారు. ఇక్కడి పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అంతకు ముందు భారతదేశం ప్రపంచంలోనే ప్రముఖ ప్రధాన పారిశ్రామిక దేశంగా ఉంది. అయితే 1757 లో ఈస్టిండియా కంపెనీ భారతదేశానికి రావడంతో ఇక్కడ మార్పులు వచ్చాయి. వారు భారతీయ ఆర్థిక వ్యవస్థని, భారతీయ సమాజాన్ని నాశనం చేశారు.
అసలు వారి రాకకు పూర్వం దేశీయ మార్కెట్లపై సుంకాలు ఉండేవే కాదు. కానీ ఆ తర్వాత అత్యధిక సుంకాలు వసూలు చేసి మన మార్కెట్ వ్యవస్థను భ్రష్టుపట్టించారు. ఇక అత్యధిక పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నీలిమందు, ధాన్యం, పత్తి, నల్లమందులాంటి వస్తువులు కొనడానికి బ్రిటిషర్లు వాడారు. వాటిని వారి దేశానికి ఎగుమతి చేసుకునేవారు. దీనివల్ల భారతదేశంలో ఉత్పాదకత తగ్గిపోయింది. చివరికి ఆహార అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చారు.
19వ శతాబ్దం చివరలో వీరి చర్యల వల్ల సుమారు ఒక కోటి వరకు ఆకలి మరణాలు సంభవించాయని చరిత్రకారులు నిర్దారించారు. అంతేకాదు ఈ అధ్యయనం చేసిన రచయితలు అప్పుడు జరిగిన ఈ దారుణమైన మరణకాండకు నష్టపరిహారం కూడా బాధితులకు ఇవ్వాలని తమ నివేదికలో తేల్చి చెప్పారు. చరిత్రను తిరిగి రాయలేము, గుర్తులను చెరపలేము, బ్రిటీష్ వారు చేసిన నేరాలను సమర్థించలేమని తమ నివేదికలో స్పష్టంగా చెప్పారు.