సంక్రాంతి అంటే మార్పు చెందడం, మారడం, గమనాన్ని మార్చుకోవడం, ప్రవేశించడం అని అర్థాలు వస్తాయి. ప్రకృతి ఆరాధన, కళాతృష్ణ, ఆరోగ్యం, సంఘటితం చేయడం వంటి ఎన్నో కోణాలు ఉన్న అందమైన పండుగ సంక్రాంతి. మరొక సామాజిక కోణం- ఇది సేద్యంతో ముడిపడి ఉన్న వేడుక. సంక్రాంతి లేదా సంక్రమణం అనే సంస్కృత పదానికి వివరణ:
సం – ఉపసర్గ పూర్వక క్రముధాతోః నిష్పన్నః- సంక్రాంతిః
క్రము అంటే గమనం.
భాస్కరస్య యథా తేజో మకరస్తస్య వర్ధతే।
తదైవ భవతాం తేజో వర్ధతామితి కామయే।।
ఏ విధంగానైతే సూర్యుడు అధిక తేజస్సు (వెలుగు), ఎక్కువ పగటికాలం ఉండే విధంగా మకరరాశిలోకి ప్రవేశిస్తాడో, అదేవిధంగా మా ఆరోగ్యం, సంపదలు వృద్ధినొందుగాక!
ఖగోళశాస్త్రం: జగత్తును వెలిగిస్తూ సకల జీవకోటిని ప్రదీప్తం చేస్తున్న సూర్యభగవానుని సంచారగతిని అనుసరించి నిర్ణయించిన సశాస్త్రీయ సామాజిక, సాంస్కృతిక, సాంఘిక, వ్యవసాయ, ఆర్థిక, కళలతో కూడిన పండగే సంక్రాంతి. మన పండుగలన్నీ తిథుల ప్రాతిపదికగా ఏర్పడినవే. కాని తిథి ప్రాతిపదికగా జరుపుకోనిది సంక్రాంతి. మిగిలిన పండుగలు చాంద్రమానం ప్రకారం, సంక్రాంతి సౌరమానం ప్రకారం జరుపుకోవడం మరొక విశేషం. ప్రకృతినీ పర్యావరణాన్నీ అనుసరిస్తూ జీవనం సాగించాలనే సర్వోత్తమ సనాతన ధర్మం హిందూత్వం.
ఏటా జనవరి 12-15 తేదీల మధ్య (గ్రెగేరియన్ కాలండర్) దేశ వ్యాప్తంగా చేసుకునే అతిపెద్ద పండుగ మకర సంక్రాంతి. ఆకాశంలో సూర్యుడు ప్రయాణం చేస్తున్నట్టు కనబడే మార్గానికి అటు ఇటూ సుమారు 16 డిగ్రీల మేర వ్యాపించి ఉండే మండలాన్ని రాశిచక్రం అంటారు. దీనిని 12 భాగాలుగా విభజించారు. అవే 12 రాశులు్గ (Zodiac). అవి- మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.
సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. పన్నెండు రాశులలో కలిపి 27 ప్రసిద్ధ నక్షత్రాలు (అశ్వని-రేవతి) ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున 108 (27×4) పాదాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క రాశిలో 9 పాదాలు (108 పాదాలు/12 రాశులు = 9 పాదాలు/1 రాశికి) ఉంటాయి.
సూర్యుడు రాశి మారినప్పుడల్లా సంక్రాంతి లేదా సంక్రమణ వస్తుంది.
గోళాకారంలో ఉన్న భూమికి భూమధ్య రేఖ (Equator)పైన ఉత్తరార్ధ గోళం(Northern hemisphere) క్రింద దక్షిణార్థ గోళం (Southern hemisphere) ఉంటాయి. సూర్యుడు తన గమనం ఒక్కొక్క రాశి నుండి మార్చుకుంటూ సుమారుగా డిసెంబరు 16న ధనురాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యకిరణాలు దక్షిణార్ధ గోళంపై ప్రసరిస్తాయి. జనవరి 15న (పుష్యమాసం) అంటే జనవరి 14 అర్ధరాత్రి 2 గంటల 6 ని.లకు మకరరాశిలోకి ప్రవేశించడం ద్వారా (సంక్రమణం) తన గమనాన్ని దక్షిణం నుండి ఉత్తరం వైపునకు మార్చుకొంటాడు.
ఉత్తరాత్రయం(2)- శ్రవణం (4)-ధనిష్టార్థం(2) – మకరః అని మన పూర్వికులు నిర్వచించారు. ధనురాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2వ పాదంలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం లేదా మకర (మొసలి ఆకారంలో ఉండే నక్షత్ర సముదాయం) సంక్రాంతి. ఈ విధంగా సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయి. కానీ వీటిలో భూమి అక్షం సూర్యుడి వైపు ఉండే కోణం, దూరాన్ని బట్టి ఉత్తరం వైపునకు (ఉత్తరాయణ) మారే సంక్రాంతికే ప్రాధాన్యం. మకర సంక్రమణం వెలుగుదారి. పగలు ఎక్కువ రాత్రి తక్కువ ఉండే దిశగా సూర్యకిరణాల ప్రసారం ప్రారంభమవుతుంది. మన దేశం ఉత్తరార్థ గోళంలో కర్కాటకరేఖ (Tropic of Cancer)కు దగ్గరగా ఉంది. చలికాలం నుండి వేసవికాలం వైపు ప్రయాణం ప్రారంభం అవుతుంది. భగవద్గీతలో చెప్పినట్లుగా దేవతలు మేల్కొనే కాలం ఉత్తరాయణం.
అగ్నిర్జ్యోతి రహః శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్
తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మ విదో జనాః (8-24)
ఆరునెలల ఉత్తరాయణ పుణ్యకాలం మోక్ష మార్గం. ఈ ఆరుమాసాల కాలంలో వేడి, వెలుగు, శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచివెళ్లిన వారు పునర్జన్మలేని పరమపదాన్ని (మోక్షం) పొందుతారు. భీష్ముడు ఉత్తరాయణ కాలంలోనే మోక్షాన్ని పొందాడు (భీష్మఏకాదశి).
ఎటువంటి ఖగోళ దూరదర్శినులు (Telescopes) లేని ఆ కాలంలో వేలకోట్ల మైళ్ల దూరంలో సూర్య, నక్షత్ర, చంద్ర భూగమనాలను పరిశీలించి, పరిశోధించి కచ్చితంగా మన పూర్వికులు (శాస్త్రవేత్తలు) ఎలా లెక్క కట్టారో ఈనాటి ఆధునిక శాస్త్రవేత్తలే పరిశోధించాలి.
ఉత్తరాయణ, సంక్రాంతి, తిల్‌సక్రాయిట్, మఘ, మేల, మాఘి, భోగి, పొంగల్ పేర్లతో సంక్రాంతి పండుగను దేశం యావత్తు జాతీయ సమైక్యతకు ప్రతిబింబంగా స్థానిక సంస్కృతులను, గ్రామ దేవతలను, ఆచార వ్యవహారాలను తరతరాలకు ఎన్నో తరాలకు అందించే విధంగా వ్యవస్థీకరించడం విస్మయం కలుగజేస్తుంది.
భోగి : మకర సంక్రాంతి ముందురోజు వచ్చే పండుగే భోగి. ఎన్నో ఆధ్యాత్మిక వైజ్ఞానిక, సృజనాత్మక, వినోదాత్మక అంశాలతో కూడినదే భోగి.
ఆధ్యాత్మిక భోగాలను అనుభవించమని ప్రబోధించే పర్వదినం భోగి. భోగి అంటే భోగం సౌఖ్యం, భోగాన్ని అనుభవించేవాడు. పరమాత్మ పంచభూతాత్మకమయిన భోగస్వరూపమయిన ప్రకృతిని సృష్టించి, ఆ సృష్టిలోని భోగాలను ఎలా అనుభవించాలో విజ్ఞాన రూపంగా అందించిన రోజే భోగి.
గోదాదేవి (ఆండాళ్) ధనుర్మాసం నెలరోజులు మార్గళీ వ్రతాన్ని ఆచరించి తిరుప్పావై (శ్రీ-వ్రతం) పాశురాలతో (ఛందోబద్ధంగా ఉన్న పాటలు) రంగనాథ స్వామిని కీర్తించి పరమాత్మ అనుగ్రహం పొంది భోగినాడు రంగనాథ స్వామిని వివాహం చేసుకొని పరమ ఉత్తమమయిన ఆధ్యాత్మిక ఆనందాన్ని (భోగాన్ని) పొందింది. అందుకే భోగి రోజున శ్రీ గోదారంగనాథస్వామి కల్యాణం జరిపించడం సంప్రదాయం.
ఇది పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేరోజు. ఆదిశంకరులు సన్యసించిన రోజు. శబరిమలైలో మకరవిలక్కు వద్ద అయ్యప్పస్వామి భక్తులు మకరజ్యోతిని దర్శించుకునే రోజు.
విష్ణుమూర్తినీ, ఇంద్రుడినీ పూజించి ఈ ప్రకృతిని మన కోసం సృష్టించిన దేవతలకు కృతజ్ఞతలు ప్రకటించుకొనే రోజు. సూర్యారాధనను కచ్చితంగా చేయవలసిన రోజు.
ప్రయాగలో మకర సంక్రాంతి రోజు జరిగే కుంభమేళా గంగానదీ స్నానాలు ప్రపంచ విదితమే.
భోగిమంటలు
మనం అగ్ని ఆరాధకులం. రుగ్వేదం కూడా ‘అగ్నిమిళే పురోహితం’ అంటూ అగ్ని ఆరాధనతో వేదఘోష ప్రారంభమయింది. అసలైన భోగాన్ని కలిగించమని, అమంగళాలు తొలగించాలని ప్రార్థిస్తూ అగ్నిహోత్రునికి పూజలు చేస్తాం. బాధ కలిగించే అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను కోపతాపాలను అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడం భోగిమంట పరమార్థం.
పనికిరాని భౌతిక పదార్థాలను కాల్చినట్లుగా మన మనసులోని వికారాలనూ కాల్చేయాలి అన్న తత్త్వంతో ఏర్పాటు చేసినవే భోగిమంటలు. చెత్తను వదిలించుకొని కొత్తదనాన్ని కోరుకోవడం. భోగిమంటలలో ఆవుపేడ పిడకలు, సమిధలు, కర్పూరం వేయడం వలన వచ్చే పొగ వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించడంతో చలి వెళ్లిపోతోంది, సూర్యునిలోని తేజస్సు ఈ రోజు నుండి వృద్ధి (వేసవి) అవుతుంది అనే భావనతో భోగిమంటలు వేస్తారు.
భోగిపళ్లు
ఎన్నో ఔషధగుణాలున్న రేగుపళ్లు, పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలు, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలు, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలు, వక్కలు, శుభాలు కలిగించే చామంతి, గులాబీ, బంతిపూల రేకులు, అక్షతలు, చిల్లర నాణేలను కలిపి చిన్నపిల్లల తలపై పోసే పేరంటమే భోగిపళ్ల పోయడమంటే. దృష్టిదోషం పరిహరించడం, చెడు సోకకూడదని కోరుకోవడం, శుభం కలగాలనీ కోరుకునే సామాజిక సంబరం.
వ్యవసాయం : భారత్ వ్యవసాయ ప్రధానమైన దేశం. పంటలు చేతికొచ్చి ఫలసాయం అంది నందువల్ల దానిని పదిమందికి పంచుతూ ఆనందాన్ని పొందడం మన సనాతన ధర్మం. ప్రకృతి ప్రసాదించిన ధాన్యాన్ని ధాన్యలక్ష్మీ స్వరూపంతో అర్చించి ఇంటికి ఆహ్వానించే రోజు సంక్రాంతి. సేద్యంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యులుగా భావించి పండుగ రోజు వాటితో ఏ పని చేయించకుండా కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జెలు, మెడలో పూలదండలతో అలంకరించి పూజలు చేస్తారు. రైతుల దగ్గరలోని అడవిలో చెట్ల ఆకులు, బెరడులు, పూలు, వేర్లు, గడ్డలు, కాండాలు (మద్ది, మాను, యోదున, నల్లేరు, మారేడు) సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో దంచి ఓ మిశ్రమాన్ని తయారుచేస్తారు. అత్యంత ఘాటైన వాసనతో తయారుచేసిన ఈ మిశ్రమాన్ని ఉప్పు చెక్క అంటారు. దీనిని అన్ని పశువులకు తినిపిస్తారు. ఈ ఔషధ గుణాలున్న ఉప్పు చెక్క సర్వరోగ నివారిణిగా పనిచేసి పశువులు అనారోగ్యం పాలవకుండా కాపాడుతుంది. పక్షులను కూడా ఆదరించడం కోసం ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేలాడదీ స్తారు. వీటి కోసం చేరిన పక్షుల కిలకిలరావాలతో ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కనుమ రోజు మినుము తినాలని సామెత. ఆ పేరుతో దేహానికి అవసర మయిన వేడిని, ఇనుప ధాతువును గారెల రూపంలో తినడం సంప్రదాయం. అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, సకినాలు, జంతికలతో అంతా ఒకచోట చేరి అరమరికలు మరచి ఆనందించేది సంక్రాంతి.
ప్రతి ఊర్లో కాటమరాజును ప్రతిష్టించడం, పొంగలి సమర్పించడం, చిట్లా కుప్ప వేయడం, ఆ ఊరి చాకలి తళిగ (పొంగలి కుప్ప)లను వేయడం, పోలిగాళ్ల సందడి, పొలి (అన్నంకుప్ప)ని పొలాల్లో, చెరువుల్లో పొలో… పొలి అని అరుస్తూ చల్లుతూ కాటమరాజుకు మొక్కడం తరతరాలుగా ప్రతి గ్రామంలో జరిగే సందడి.
హరిదాసులు : భక్తుల కోసం శ్రీహరే (విష్ణు మూర్తి) హరిదాసుగా వస్తాడని నమ్మకం. తలమీద గుమ్మడికాయ ఆకారంలో ఉండే పాత్ర భూమికి సంకేతం, ఆ భూమిని నేనే ఉద్ధరిస్తానని అందరూ సమానమే అంటూ ఇంటి ఇంటికి ‘హరిలో రంగ హరి’ అంటూ గానంచేస్తూ తిరిగే సన్నివేశం ఓ మధురానుభూతి. ఇక అయ్యగారికి- దండంపెట్టు- అమ్మగారికి దండంపెట్టు అంటూ తిరిగే గంగి రెద్దులు, శివలింగాకృతిని గుర్తుకు తెచ్చేవిధంగా ఎత్తైన మూపురంతో శివునితో సహా సంక్రాంతి పండుగకు మీ ఇంటికే వచ్చానని సందడి చేసే బసవన్నను మర్చిపోగలమా! ఇంతకంటే సామాజిక సమరసత ఏముంటుంది?
గొబ్బిళ్లు-పాటలు
రంగురంగుల ముగ్గుల మధ్య ఆవుపేడతో చేసిన గొబ్బిళ్లు అమర్చి గౌరీదేవిగా భావించి పసుపు కుంకుమ అర్పించి కన్నెపిల్లలు చేసే సందడి ఓ దృశ్య కావ్యం. పురాణేతిహాసాలలోని ముఖ్యఘట్టాలను పాటల రూపంలో అందిస్తూ జానపద సాహిత్యాన్ని, పాటల పక్రియను సజీవంగా తరతరాలకు అందించే ఓ అద్భుతమయిన వినోదాత్మక సాహిత్య పక్రియ.
‘‘కొలని దోపరికి గొబ్బిళ్లో యదు కులము స్వామికిని గొబ్బిళ్లో’’ అంటూ అన్నమయ్య గొబ్బి పాటల ద్వారా శ్రీకృష్ణ లీలలను అందరికి తెలియచేయడం, అత్తా కోడళ్లు, మామ అల్లుళ్లు, వియ్యపురాళ్లు, అక్కాచెల్లెళ్ల సంబంధాలను ప్రస్తావిస్తూ సాగే ఈ పాటలను విని తీరాల్సిందే.
గంగమ్మ, గౌరమ్మ అప్ప సెల్లెండ్రు – గొబ్బియళ్లో
ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు – గొబ్బియళ్లో అంటూ కన్నె పిల్లల చేత పాటల రూపంలో కుటుంబ వ్యవస్థను, అందరు కలిసి ఉండాలనే సమానత్వ భావనను తరతరాలకు అందించే సామాజిక పేరంటం.
గాలిపటాలు
వాతాటః వాయురజ్జ భ్యాం
ఆకాశం ప్రతి గచ్ఛతి
జీవాత్మ గురువృత్తి భ్యాం
ఊర్ధ్యం గచ్ఛత్య సుంశయయ్।।
తాడు, గాలి సహాయంతో గాలిపటం ఎలా ఆకాశంలోకి వెళ్తుందో అదేరకంగా మనలోని ఆత్మ గురుబోధనల వల్ల ఊర్ధ్వలోకాలకు చేరుతుంది అనే ఆధ్యాత్మిక కోణం ఈ గాలిపటంలో కనిపిస్తుంది.
అప్పటిదాక చలికాలం వలన వచ్చిన చర్మ వ్యాధులు, జలుబు, దగ్గులకు ముగింపు పలికే శక్తి సూర్య కిరణాలకు ఉంటుంది. ఎక్కువసేపు విశాలమయిన ప్రదేశంలో పిల్లలు, పెద్దలు అందరిని ఓ చోట చేర్చి సూర్య కిరణ స్పర్శతో మన శరీరానికి కావల్సిన విటమిన్ ‘డి’ను తయారు చేసుకునే విధంగా ఈ గాలిపటాల పక్రియను మన పూర్వికులు ఆలోచన చేసారు.
6 నెలల నిద్ర తర్వాత (దక్షిణాయనం) దేవతలు ఈ మకర సంక్రాంతి రోజు (ఉత్తరాయణం) నిద్ర లేస్తారని, మనకోసం ఇంత అద్భుతమయిన ప్రకృతిని ప్రసాదించిన దేవతలకు గాలిపటాలతో స్వాగతించి కృతజ్ఞతలు తెలుపుకోవడం గాలిపటాల పరమార్ధం.
నువ్వులు-బెల్లం (తిల్‌గుల్)
తిలవ స్నేహ మాదస్య గుడవాన్ మధురం వద!
నువ్వులతో శక్తి అనే స్నేహాన్ని పంచు. మధుర పదార్థమయిన బెల్లంలాగా మధురంగా మాట్లాడు. సంక్రాంతి పర్వదినాన నువ్వులు బెల్లం కలిపి తయారుచేసిన పదార్థాన్ని తినడం ద్వారా 6 నెలలకు అవసరమైన శక్తి లభిస్తుందని ఆరోగ్య సూత్రం.
క్వీన్ ఆఫ్ ఆయిల్ సీడ్స్‌గా పిలిచే నువ్వులలో 50% ఉండే తైలం ఎల్‌డీఎల్ కొలెస్టరల్‌ను, ట్రైగ్లి సెరైడ్స్‌ను తగ్గించి హృదయ ఆరోగ్యాన్ని కాపాడు తుంది. బెల్లంలో ఉండే పొటాషియం, ఐరన్, మాంగనీస్ విటమిన్ బి జీర్ణ పక్రియకు అవసరమైన ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తుంది.
నువ్వులు, బెల్లంతో చేసిన మధుర పదార్థాన్ని తిని ఆరు బయట గాలిపటాలను ఎగురవేసే సమయంలో మన శరీరంలో తయారైన కొలి కాల్సిఫెరాల్ చర్మంలోకి చేరి సూర్యకిరణాల తాకిడికి 1,25 కొలికాల్సిఫెరాల్ (విటమిన్ డి)గా తయారు అవుతుంది. ఎక్కువ రోజులు శక్తిని నిల్వ చేసుకునే గుణం నువ్వులలో ఉందని మన పూర్వికులు ఎలా కనిపెట్టారో నేటి ఆధునికులే తేల్చాలి మరి?
దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖలలో జరుపుకునే సంక్రాంతి ఉత్సవంలో అందరూ నువ్వులు, బెల్లంతో చేసిన మధుర పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించి దేహాన్ని, దేశాన్ని సంఘటితం చేసే ఉదాత్త ఆలోచనలు కల్గించే శుభప్రద మహోత్సవం.
సంక్రాంతి – ముగ్గులు
ఇంటిముందు పేడతో కల్లాపి జల్లి – సున్నం పిండి, బియ్యం పిండి కలిపి గీతలు, చుక్కలు, లతలతో అనేక రకాలుగా భూమిని అలంకరించడం.
తజ్యామితీయ ఆకృతులలో (Geometrical Slapes), సౌష్టవంగా (Symmetry) మెదడు (Brain)లోని ఎడమ, కుడి భాగాలను సమన్వయం చేసుకొంటూ చేతివేళ్ల సందుల నుండి ముగ్గును వదులుతూ మెదడులో న్యూరోట్రాన్సి మీటర్లను ఉత్తేజపరుస్తూ వేసే విజ్ఞానాత్మక, వినోదాత్మక కళాతోరణాలే ముగ్గులు. రంగవల్లి (రంగోలి) పేరుతో ప్రతి ఇంటిముందు వేసే ముగ్గులు అనేక ఆధ్యాత్మిక, సామాజిక, శాస్త్రీయ అంశాలను తెలియపరుస్తాయి. నించుని వేసే, కూర్చుని వేసే, తిరుగుతూ వేసే ముగ్గుల వలన తెలీకుండానే మహిళల్ని యోగాస నాలు వేయించడం కూడా ఇందులో భాగం. ముగ్గు ఉన్న ఇంటిలో ఆనందం, ధనాత్మక శక్తి, జీవకళ ఉట్టి పడుతుందని, ఆ విధంగా ఇంటిలోని వారి మానసిక శక్తి పెరుగుతుందని పరిశోధనలలో తేలిన నిజం. పంటలు సంక్రాంతికి ఇంటికి వచ్చే సమయం అవడం వలన గాలిలో ఎగిరే కీటకాలు గొబ్బిళ్లకు అతుక్కోవడం, నేలపై పాకే క్రిములు ముగ్గుల పిండి దగ్గరే ఆగిపోవడం వలన ఇంటిలోని పంటకు రక్షణ ఉంటుందనే శాస్త్రీయ దృక్పధంతో మనిషిలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మక శక్తి (Creativity)ని వెలికి తీసే అత్యద్భుత కళ (Art)లే రంగవల్లులు, బొమ్మల కొలువులు. చివరిరోజు పండుగను ఘనంగా వీడ్కోలు పలకడానికీ వేసే ముగ్గు తాడును మరొక ఇంటివారి ముగ్గుతో కలుపుతూ సామాజిక సమరసతను చాటుతూ సంఘేశక్తిః కలౌయుగే అనే తారక మంత్రాన్ని తెలియపర్చే ముగ్గును చూసి తీరవలసిందే.
ఉత్సవ ప్రియో హిలోకః
బొమ్మల కొలువులలో వాడే పురాణ, ఇతిహాస, చారిత్రక, వినోదాత్మక వైజ్ఞానిక బొమ్మల మార్కెట్, రకరకాల కొత్త బట్టలతో సందడి చేసే వస్త్ర దుకాణాలు, రంగోళిలలో వాడే పసుపు, కుంకుమ పిండి అమ్మే అంగళ్లు, కోడిపందాలు, గుండాట, బండ్ల లాగుడు, కబడ్టీ పోటీలు నిర్వహించే బరులు, బంతి, చామంతి, గులాబి, జాజిపూల తోటలు, యజ్ఞయాగాది వైదిక క్రతువుల కోసం ఉపయోగించే ద్రవ్యాలు అమ్మే పూజా సామాగ్రి సెంటర్లు, రకరకాల ఆకృతులతో, రంగులతో అంబరాన్ని తాకే గాలి పటాల మార్కెట్టులతో కొన్ని వేలకోట్ల రూపాయల వ్యాపారం జరగడం, దానివల్ల దేశం ఆర్థికంగా ముందంజలో ఉండడం (Economics), ప్రగతి బాటలో నడవడం మన పండుగల ప్రత్యేకత. సాంప్ర దాయ పండుగలు సంపదను సృష్టించి ఎంతోమందికి జీవనోపాధిని స్వయంగా (Start-up) వారే కల్పించుకొనే విధంగా పండుగలను రూపకల్పన చేసిన మన పూర్వికులకు, సనాతన హిందూ ధర్మానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం!
– ఉపద్రష్ట లక్ష్మణసూరి, భారతీయ విజ్ఞాన మండలి సభ్యులు, ఏపీ
జాగృతి సౌజన్యంతో…