భారతీయ మహిళా బాక్సర్లు చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలను సాధించి భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నీతూ ఘంఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75), సావీటీ బూరా (81 కేజీలు) దేశానికి స్వర్ణం సాధించారు. 65 దేశాలకు చెందిన 324 మంది బాక్సర్లు, పలువురు ఒలింపిక్ పతక విజేతలు, 12 వెయిట్ విభాగాల్లో పాల్గొన్నారు.
వియత్నాంకు చెందిన న్గుయెమ్ తి టామ్‌ను ఓడించిన నిఖత్ వరుసగా రెండో ఏడాది స్వర్ణం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన లోవ్లినా ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన కైట్లిన్ పార్కర్‌పై తన తొలి ప్రపంచ స్వర్ణం సాధించింది. 2022 కామన్‌వెల్త్ గేమ్స్ పతక విజేత నీతు ఘన్‌ఘాస్ మంగోలియాకు చెందిన లుత్‌సాయిఖాన్ అల్టాంట్‌సేట్‌సెగ్, మూడుసార్లు ఆసియా పతక విజేత సావీటీ బూరా చైనాకు చెందిన వాంగ్ లీనాపై తమ స్వర్ణాలను గెలుచుకున్నారు. విజేతలందరికీ లక్ష డాలర్లు (82.7లక్షలు) బహుమతి లభించింది.
విజేతలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. నీతూను అభినందిస్తూ మహిళల బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ప్రతిష్టాత్మకమైన బంగారు పతకాన్ని గెలుచుకోవడం దేశానికి గర్వ కారణం అన్నారు. సావీటీ బూరా ది అసాధారణమైన ప్రదర్శన అని, ఆమె విజయం రాబోయే ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందన్నారు. నిఖత్‌ను అభినందిస్తూ, ఆమె ఒక అత్యుత్తమ ఛాంపియన్, దీని విజయం భారతదేశాన్ని అనేక సందర్భాలలో గర్వించేలా చేసిందన్నారు. లోవ్లినా బోర్గోహైకి అభినందిస్తూ ఆమె గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఆమె స్వర్ణ పతకం సాధించడం భారత్‌కు ఆనందంగా ఉందని తెలిపారు.
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అజయ్ సింగ్ మాట్లాడుతూ బంగారు పతకాలతో చరిత్రను లిఖించిన మహిళా బాక్సర్ల పట్ల చాలా గర్వపడుతున్నామన్నారు. ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల ముందు స్వదేశంలో నాలుగు బంగారు పతకాలు సాధించడం అద్భుతమైన విజయం అని అన్నారు. ఈ బాక్సర్ల ప్రదర్శనలు దేశంలోని యువతులను పతకాలు గెలుచుకోవడానికి, భారతీయ బాక్సింగ్‌ను మరింత ఉన్నత స్థాయికి చేర్చడానికి ప్రేరేపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించడం భారత్‌కు ఇది రెండోసారి. 2006లో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ లాల్‌రెమ్లియాని, లేఖా కె.సి దేశానికి స్వర్ణం సాధించారు.