ఆగస్ట్ 9 విశ్వ మూలనివాసీ దివస్
జనాభాలో 8 శాతం ఉన్నప్పటికీ వనవాసీల గురించి ఈ దేశంలో పెద్దగా చర్చ జరగదు. వాళ్ల సమస్యల గురించీ పట్టదు. మతం మారిన వారికి రిజర్వేషన్ వర్తింప చేయాలా వద్దా? ఈ సౌకర్యం ఎవరికి ఇచ్చారు? వంటి విషయాలు ఇప్పటికీ తేలకుండానే ఉన్నాయి. మూలవాసీ దివస్ జరపడం గిరిజనులను గౌరవించుకునే చర్య అవుతుందా? వనవాసీ సముదాయానికి సంబంధించి ఇలాంటి కొన్ని మౌలిక అంశాలను గురించి గత 30 సంవత్సరాలుగా వనవాసీ ఉంటూ దేశవ్యాప్తంగా ఉన్న వనవాసులు గురించి పని చేస్తున్న పొన్నపల్లి సోమయాజులు గారు చెప్పారు. ఆయన వనవాసీ కళ్యాణ పరిషత్ అఖిల భారత మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. గిరిజనుల సమస్యల మీద, వారి ఆవేదన మీద సోమయాజులు గారికి పూర్తి అవగాహన ఉంది. ఆయనతో సీనియర్ జర్నలిస్ట్ రాకాసుధాకర్ గారి ముఖాముఖి…
వనవాసీ, ఆదివాసీ, గిరివాసీ- ఇట్లాంటి పదాలు వాడుతుంటారు. ఇంగ్లిష్‌లో ట్రైబల్ అంటారు. దీనిలో షెడ్యూల్ ట్రైబ్స్ (ఎస్‌టి) అని ప్రభుత్వం చెపుతుందో దానికి ఏ పదం ఉపయోగించడం సరైనది?
వనవాసీ శబ్దం ప్రారంభం నుంచి ఈ దేశంలో వినిపించిన శబ్దం. మన ఇతిహాసాలు, గ్రంథాలు వనంలో ఉండేవారిని వనవాసీ అన్నాయి. అదే కొన సాగుతూ వచ్చింది.రాములవారు 14 సంవత్సరాలు వనవాసం చేయడం వలన వనవాసీ రాముడైనాడు. ఆదివాసి రాముడు కాలేదు. ఎప్పుడైతే ఆంగ్లేయులు పాలన వచ్చిందో, అప్పుడు వారు కొత్త శబ్దాన్ని తీసుకొచ్చారు- అది ఆదివాసి. వనంలో ఉండేవారిని ఆదివాసీలుగా పిలవడం ప్రారంభించారు. ఆదికాలం నుండి ఈ దేశంలో మీరు ఉంటున్నారు, మిగతా వారంతా తరువాత వచ్చారన్న భావన కలిగించారు. ఆ మిగతావారూ మీకు శత్రువులు అనే భావన కూడా కలిగిస్తూ ఆదివాసి శబ్దాన్ని స్థిరపరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి ‘వనవాసి’ సరైన శబ్దం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ సమాజానికి (వనవాసి) ఏ పేరు ఉంటే బాగుంటదో అన్న చర్చ రాజ్యాంగ పరిషత్‌లో జరిగింది. డా।। అంబేడ్కర్ అనుసూచిత జనజాతి అనే శబ్దాన్ని ఉపయోగించారు. ఎవరైతే షెడ్యూల్డ్ లిస్ట్‌లో ఉంటారో వాళ్లంతా ఈ సూచిలో ఉంటారని చెప్పారు. ఆదివాసీ శబ్దాన్ని డా. అంబేడ్కర్ స్వీకరించ లేదు. రాజ్యాంగం ప్రకారం అనుసూచిత జనజాతి శబ్దం సరైన శబ్దం.
వనవాసీ, ఆదివాసీ అనే పదాల వెనుక ఆర్యద్రావిడ సిద్ధాంతం ఛాయ ఏదైనా ఉందని మీకు అని పిస్తుందా?
ఆదివాసీలు మొదటి నుండి ఇక్కడ ఉన్నారు.. ద్రావిడులు బయట నుంచి వచ్చారు, వారు సంఘర్షిం చారు. ఆర్యులు వచ్చారు.. ద్రవిడులను దక్షిణానికి తరిమేసి, మిమ్మల్ని అరణ్యాలకు గెంటేశారు.. కాబట్టి ఆర్యద్రవిడ సిద్ధాంతాన్ని చొప్పించడం కూడా ప్రారంభించారు. అంటే మీరే ఆదివాసీలు అని వారిని నమ్మింపచేయడానికి, రుజువు అన్నట్టు ఆర్య ద్రవిడ అనే కొత్త సిద్ధాంతాన్ని దేశంలోకి తీసుకొచ్చారు.
చరిత్ర చూస్తే వనవాసులకూ, నగరవాసులకూ మధ్య పెద్ద తేడా లేదని, వారు నివసించే ప్రాంతం వేరన్నది వదిలేస్తే వీరిద్దరి పరంపరలు, పూజా విధానం, జీవన విధానం దాదాపుగా సమానంగా ఉంటూ వచ్చింది.
వాస్తవానికి భారతీయ సంస్కృతిని అరణ్య సంస్కృతి అంటారు. మన సంస్కృతి, జీవన పద్ధతి అంతా అరణ్యం నుంచి మైదానాలకు వచ్చింది. కాబట్టి అరణ్యంలో ఏదైతే పాటిస్తున్నారో అదే మనందరం పాటిస్తున్నాం. రెండోది వనంలో లేదా, నగరంలో ఉంటున్నా అనేక విషయాలలో సమాంతరంగా కనిపిస్తాయి. ఉదాహరణకు మన షోడశ సంస్కారాలు. ఈ పదహారు సంస్కారాలు వనవాసులలోనూ, నగరవాసులలోనూ కూడా ఉన్నాయి. ఇది నా అనుభవం. ఝార్ఖండ్‌లో పనిచేస్తు న్నప్పుడు నేను, కార్యకర్తలందరం జీపులో వెళుతూ ఒక కార్యకర్త ఇంటి ముందు ఆపాం, ఛాయ్ తాగి వెళ్దాంఅని. అక్కడ నేను కొత్తవాడిని. ఆయన లోపలికి రమ్మన్నాడు. చర్చించుకుంటున్నాం. ఆ కార్యకర్త మంచి నీళ్లు అడగలేదు. మా కార్యకర్త, ఛాయ్ తాగిస్తే తాగించండి అన్నాడు. క్షమించండి అన్నాడా కార్యకర్త. పత్తా (టీ పొడి) లేదా? లేక పాలు లేవా అని అడిగాం. అలా కాదు, మా కోడలు ప్రసవించింది. పిల్లగాడు పుట్టాడు. మాకు సూతకం వచ్చింది. కాబట్టి తాగించ లేమని చెప్పాడు. చెవులు కుట్టించడం, నామ కరణోత్సవం, అన్నప్రాశన, పెళ్లిలో మంటపాలు కచ్చితంగా ఉంటాయి. ఎవరైనా చనిపోతే శిరో ముండనం చేయిస్తారు. భోజనాలు పెడతారు. అన్నీ మైదానప్రాంతాల వారివలే చేస్తారు. రెండో భాగం- అందరూ భగవంతుడు ఉన్నాడనే నమ్ముతారు. మన రాష్ట్రపతి గౌ।। ద్రౌపది ముర్ము ఐఏఎస్‌కు ఎంపికైన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఒక అనుభవం చెప్పారు, ‘నా చిన్నప్పుడు నాన్నతో అరణ్యానికి వెళ్తుండేదానిని. చెట్టు నుంచి పుల్లలు విరచాలనుకున్నప్పుడు నాన్నగారు మొట్టమొదటగా చెట్టుకు నమస్కారం పెట్టేవారు. పుల్లలు సేకరించిన తరువాత కూడా నమస్కారం పెట్టేవారు. నేను ఎందుకు నాన్న అని అడిగాను. ఆయన, ఈ చెట్టు మన దేవుడు, మన జీవనానికి ఆధారం.ఈయనే పరమాత్మ అన్నారు. నేను కూడా ఆ చెట్టుకు నమస్కా రించాను. జలాశయం కనిపిస్తే కూడా నమస్కారం చేశారు.’ అందరిలో దైవత్వం ఉన్నది. మనం కూడా ఆత్మవత్ సర్వభూతాని అంటాం. వారూ అదే పాటిస్తారు.
గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య ధార్మికంగా గానీ, సామాజికంగాగానీ ఎక్కడా, ఏమీ తేడా లేదా?
ఇక్కడ అందరూ తూర్పు తిరిగి పూజ చేస్తాం. అంతా ఈ భూమిని తల్లిగా భావిస్తాం. అదే విధంగా వారూ భావిస్తారు. అందరూ పూజకు నీటిని ఉపయో గిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే నైవేద్యం విషయం వేరు. ఎపుడైతే మహమ్మదీయులు ఆక్రమణకు వచ్చారో వాళ్లందరు కూడా శత్రువులుగా భావించి తీవ్రంగా సంఘర్షించారు. ఆంగ్లేయులతో కూడా తీవ్రంగా సంఘర్షణ చేశారు. కాబట్టి ధార్మిక, సామాజిక అంశాలు మనకీ వారికీ వేర్వేరు కావు, ఒకటే.
మిగిలిన సమాజంతో వనవాసీల సంబంధాలు ఆనాడు ఎలా ఉన్నాయి?
బ్రిటిష్ వాళ్ల కంటే ముందు మహమ్మదీయులు వచ్చారు. గిరివాసులకు వారితోటీ సంఘర్షణ జరి గింది. అక్బర్ సైన్యంతో రాణాప్రతాప్ పోరాట మప్పుడు భిల్ సమాజం పెద్ద ఎత్తున సహకరించింది. హల్దీఘాట్ యుద్ధం అయిపోయిన తరువాత రాణాప్రతాప్ వెళ్లి పోవలసి వచ్చింది. అక్బర్ సైనికులు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మొత్తం బిల్ సమాజం రాణా ప్రతాప్‌ని అరణ్యానికి తీసుకెళ్లి జాగ్రత్త కాపాడింది. కుంజా భిల్ సేనాపతికి రాణా కుంజ్ భిల్ అని బిరుదు ఇచ్చారు కూడా. శివాజీ మహారాజ్ సైనికులలో ఎక్కువమంది గిరిజనులే. అఫ్జల్‌ఖాన్‌ను కలవడానికి వెళ్లినపుడు శివాజీ జనజాతి కుర్రాడు జీవమాలాని తీసుకు వెళ్లాడు. ఆయన వల్ల శివాజీ బ్రతికాడని చెపుతారు. మొగలులతో రాణి దుర్గావతి పోరాటం చరిత్రాత్మకం. భర్తను కోల్పోయాక రాజ్యాన్ని పాలించింది. రెండుసార్లు అక్బర్‌ను ఓడించింది. మూడోసారి ఓడించడం కష్టమని భావించి, తాను ముస్లిం చేతిలో చనిపోకూడదనుకొని, ఒక సైనికుని అడిగింది, నా తల నరకమని. ఆ సైనికుడు ధైర్యం చేయలేకపోయాడు. స్వయంగా తాను నరుక్కుంది. ఇవేకాదు, ఆ రోజుల్లో ఉత్తర ఈశాన్య రాష్ట్రంలోకి ఒక ముస్లిం కూడా ప్రవేశించలేకపోయాడు. ఈ విధంగా మొగలులతో గిరిజనులు చాలా పోరాడారు. ఆ రోజుల్లో ఏ ఒక్క గిరిజనుడు ముస్లింల దగ్గర తలవంచలేదు. ఇది చాలా గొప్ప విషయం. ఈ ఇతిహాసం అంతా కూడా ఆంగ్లేయులు గిరిజనుల విషయంపై ఒక్క గౌరవమైన విషయం కూడా రాయలేదు. ఎందుకంటే మీకు చరిత్ర తెలియదనే అభిప్రాయం కలిగించటానికి ఒక అపోహను తీసుకువచ్చారు.
మూల నివాసీ దివస్, ఆదివాసీ దివస్ ఈ భావన వెనుక ఏముంది? ఇది ఎలా వచ్చింది?
1982లో మొట్టమొదటిసారిగా ఇండిజీనిస్ వార్షిక సంచికను ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ ఇండీజీనిస్ వెలువరించాలని ఆగష్టు 9న చర్చిం చారు. తరువాత ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ డిసెంబర్ 23,1994న ప్రతి దేశంలో ఇండీజీనిస్ పీపుల్ ఎవరు ఉన్నారో ప్రకటించాలని కోరారు. అప్పుడు పీ•వీ.నరసింహరావు ప్రధాని. వనవాసీ కల్యాణాశ్రమ సంస్థాపకులు బాలాసాహెబ్ దేశపాండేజీ ఒక మెమో రాండం పీవీకి ఇచ్చారు. ఈ దేశంలో ప్రత్యేకంగా మూలవాసులు ఎవరూ లేరు, అందరూ మూలనివాసులే అన్నదే దాని సారాంశం. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రతినిధి సభకు కూడా ఆయన వెళ్లారు. అక్కడా స్పష్టంగా ఇదే చెప్పారు. అయితే ప్రపంచంలో కొన్ని దేశాలను బలహీనపరచడానికి కొందరు ప్రయత్నం ప్రారంభించారు. ఇక్కడ ఉండే గిరి జనులు, మూలవాసులను వేరు చేసి దేశాన్ని బలహీన పరచి, వేరు చేసే ప్రయత్నం అందులో భాగమే.
విదేశాలలో మూలనివాసులు అంటే వేరే అర్థం. ఎక్కడి నుంచో తెల్లవాడు వెళ్లాడు. దోచుకున్నాడు. జాతిని సమూలంగా నాశనం చేశాడు. మన దేశంలో అలా జరగలేదు. ఇక్కడి మైదాన ప్రాంతవాసులు, వనవాసుల, గిరివాసుల మధ్య మొదటి నుంచి సంబంధాలున్నాయి. కాబట్టి మూలనివాసీ డే (ఆగస్ట్ 9 ఇండీజినస్ పీపుల్ డే) మనకు వర్తిస్తుందా? చాలామంది జరుపుకుంటున్నారు. ఈ మధ్య గిరిజన సంస్థలు ఉపయోగిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి?
విశ్వమహిళా దివస్, విశ్వయోగా దివస్, విశ్వ మూలనివాస్ దివస్ ఇవన్నీ ఉన్నాయి. విశ్వ మూల నివాస్ దివస్ చేయవచ్చు. మేము కొన్నిచోట్ల కార్య క్రమాలుచేశాం. విశ్వమూలనివాస్ దివస్ సందర్భంగా ప్రపంచంలో ఏ దేశంలోనైతే మూల నివాసులపై అత్యాచారాలు జరిగాయో దాన్ని ఖండించాలి. అక్కడున్న ప్రజల్ని చూడాలి. మనం ఆ విధంగా చెప్పాం. మన దేశంలో ఆ విధంగా జరగలేదు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. ఐరోపా వారు చెబుతున్నట్టు ఇక్కడ పెద్ద ద్వీపం ఉంది. పెద్ద ఎత్తున నావికులు, సైనికులు అక్కడ అత్యాచారాలు చేశారు. లక్షలమందిని చంపేశారు. అనేకమంది క్రైస్తవంలోకి మార్చార••. వారు ఆగస్ట్ 9న ఆ విధమైన విజయం సాధించారు. ఇలాంటి నేపథ్యాన్ని బట్టే ఈనాటికి ఆగస్ట్ 9న విశ్వమూల నివాస్ దివస్ నిర్వహించడానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. 2006లో ఇంటర్నేషనల్ ఫోరమ్ ఫర్ ఇండీజినస్ సంస్థ జెనివాలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దానికి సుప్రీంకోర్టు జస్టిస్ శబరివాలాను పిలిచారు. ప్రపంచంలో ఏయే దేశాలలో మూలనివాసుల మీద అత్యాచారాలు జరిగాయో చెప్పి, వాటిని ఖండిస్తూ ప్రసంగించారు. అయితే భారత్ విషయం వేరు. రెండోది గిరిజనులు అనేక ప్రాంతాలకు మారుతుంటారు. అక్కడి సమాజంతో కలిసిపోతుంటారు. కాబట్టి మాకు కూడా సభ్యత, సంస్కృతి ఒకే విధంగా ఉంటాయి అని శబరి వాలా చెప్పారు. యు.ఎన్.ఓ ఇండీజినస్ డెవలప్ మెంట్ కోసం 18 పాయింట్లు ఇచ్చారు. ఎవర్నైతే మీరు ఇండీజినస్ అంటున్నారో వాళ్ల వికాసం కోసం ఆ18 పాయింట్ల కంటే ఎక్కువ చేస్తున్నామని చెప్పారు కూడా. ప్రభుత్వ విధానం అప్పటికీ ఇప్పటికీ స్పష్టంగానే ఉంది.
మూలవాసుల దినోత్సవం వెనుక ఇంత విషాదం ఉన్నా కొన్ని సంస్థలు దేశంలో కూడా ఆ కార్యక్రమం జరుపుతున్నాయి. దీని వెనుక కుట్ర ఏమిటి?
ఆంగ్లేయులది విభజించి పాలించే విధానం. వనవాసీ సమాజాన్ని విభజించటానికి ఆదివాసీ శబ్దాన్ని ఉపయోగించారు. మీరందరూ ఆదివాసీలు. మీరెవరూ హిందువులు కానే కారు. హిందువులు విగ్రహాన్ని పూజిస్తారు. మీరు ప్రకృతిని పూజిస్తారు. మీరు ప్రకృతి ఆరాధకులు అని చెప్పారు. మూడవది మీకు ఇతిహాసం ఏమీ లేదు. ముక్కులు, చేతులు కడుక్కోవడం చేతకాదు. సంస్కార విహీనులు అని ఈసడిస్తూ న్యూనతా భావం నింపే ప్రయత్నం జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా సమాజాన్ని విభజించాలన్న ధ్యేయంతో ఇదే భావాన్ని సమాజంలోకి తీసుకువెళ్లటానికి ప్రయత్నం చేశారు, చేస్తున్నారు. ఆదివాసీలు హిందువులు కారని ప్రచారం అలాంటిదే. ఇంకా కొన్ని భ్రమలను కూడా నిర్మాణం చేయడానికి కొంతమంది మనం రావణాసురుల వారసులం. రాముడు మన వ్యతిరేకి. కాబట్టి విజయ దశమికి రావణ దహనం చేయడానికి వీల్లేదని అభ్యంతరాలు లేవనెత్తడం ఆరంభించారు. కొంత మంది మహిషాసురుల వంశజులం, దుర్గ మాకు శత్రువు అంటూ మొదలుపెట్టారు. అలాగే మనం ఆదివాసీలం, అధికారం కోసం పోరాడాలి, ఈ దేశం మీద హక్కు మనదే అన్న భావనను కూడా గిరిజన సమాజంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే వనవాసీ కల్యాణాశ్రమం ఈ రకంగా గిరిజనుల గౌరవార్ధం ఒక ప్రత్యేక సందర్భాన్ని, లేదా దినాన్ని గుర్తించిందా?
బిర్సా ముండా జయంతిని-నవంబర్ 15ను జనజాతి (వనవాసి) గౌరవదివస్‌గా ప్రారంభించాం. చాలా అదృష్టం. ప్రభుత్వం కూడా ఆలోచించింది. రెండు సంవత్సరాల క్రింద కేంద్ర ప్రభుత్వం సాను కూలంగా స్పందించి ఈ నిర్ణయాన్ని సమర్ధించింది. నవంబర్ 15 జనజాతి గౌరవ దివస్‌గా ప్రకటిం చింది. ఆ సందర్భాన్ని ప్రభుత్వం, ప్రజలు కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సంగతిని ప్రకటించినప్పుడు నేను ఈశాన్య భారతంలో ఉన్నాను. వారు చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా ఒక జాతీయ పండుగ వచ్చిందని చెప్పారు. ఇంతవరకు ఆగస్ట్ 9 తరహా కార్యక్రమాలకే అంతా వెళ్లేవారు. విని వచ్చేవారు. దీనికి మించి ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన నుంచే నవంబర్ 15ఉత్సవం జనించింది. మనం కూడా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. విశ్వమూలనివాస్ దివస్ ఆశయం చెబుదాం. ప్రపంచంలో ఎక్కడ మూల నివాసుల మీద అత్యాచారం జరుగుతున్నదో గుర్తించి ఖండిద్దాం. దాంతోపాటు ఆ దేశ ప్రజల్ని చైతన్య వంతం చేయాలని అనుకున్నాం. మన దేశంలో గిరిజన వికాసం ఏం జరుగుతున్నదో ప్రజలకు తెలియజేస్తే బాగుంటుందని అనుకున్నాం. నవంబర్ 15 ను గుర్తించే సమయంలో మరొక విషయం దృష్టిలోకి వచ్చింది. షెడ్యూల్ కులాల వారు బాబా సాహెబ్ అంబేడ్కర్ జన్మదినాన్ని పండుగగా జరుపు కుంటారు. గిరిజనులలో చాలామంది దేశభక్తులు ఉన్నారు. సంఘర్షణ చేశారు. కాని ఎవరి జన్మదినం కూడా జాతీయ పండుగగా చేసుకోవటంలేదు. జనజాతికోసం పోరాడి, త్యాగం చేసిన చరిత్ర పురుషుని స్మరించుకుంటే బాగుంటుందని బీర్సాను గుర్తు చేసుకున్నాం. జనజాతీయుల కోసం పనిచేసిన వారిని స్మరించుకుంటే వాళ్ల అడుగుజాడలలో నడవాలన్న భావన కలుగుతుంది.
షెడ్యూల్డ్ కాస్ట్ (అనుసూచిత) వారు మతం మారితే రిజర్వేషన్లు పోతాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు ఆ పరిస్థితి లేదు. దీని విషయంలో వనవాసీ కల్యాణాశ్రమం గానీ, లేకపోతే మిగతా వనవాసీ జాతీయవాద సంస్థల వైఖరి ఏమిటి?
ఉపేక్షిత వర్గాలను ముందుకు తీసుకుపోయే సౌకర్యాలను కల్పించే ఆలోచన వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్‌కు షెడ్యూల్డు క్యాస్ట్, షెడ్యూల్డు ట్రైబ్స్ రెండు దృష్టిలోకి వచ్చాయి. షెడ్యూల్డు క్యాస్ట్ విషయం వచ్చేసరికి చదువులో, ఉద్యోగాలు, రాజ కీయంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయిం చారు. డా.అంబేడ్కర్‌ని అడిగారు మతం మారితే ఏమిటని? అంబేడ్కర్ స్పష్టంగా చెప్పారు, మా వాళ్లు ఎవరైనా సరే మతంమారితే వారు మా వాళ్లు కాదు అని. కాబట్టి రాష్ట్రపతి ఆదేశం మేరకు వీరికి రిజర్వేషన్ ఉంటుంది. ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్లకి ఇది వర్తించదని ఆదేశం వచ్చింది. జనజాతి సమాజం కూడా చాలా వెనుక బడినదే. వారిది సంకోచ స్వభావం. కానీ పరంపర సంస్కృతి విశిష్టమైనవి. వాటిని కాపాడాలి. కాబట్టి వాళ్లకు కూడా రిజర్వేషన్లు అవసరమని నిర్ణ యించారు. అయితే అంబేడ్కర్ లాంటి నాయకుడు జనజాతీయులలో లేరు. అపుడు జార్ఖండ్‌లోని ఒక వ్యక్తిని అడిగారు. ఆయన క్రైస్తవంలోకి మారిన హిందువు. మతం మారినవారికి రిజర్వేషన్లు ఉంటే మీకెట్లా అనిపిస్తుంది అని అడిగారు. ఆయన మాకు ధర్మం ఏమీ లేదు, గిరిజనులుగా ఉంటామని అన్నారు. రాష్ట్ర ఆదేశంతో ఇందుకు సంబంధించిన నిబంధన ఎత్తివేశారు. కార్తి ఓరామ్ అనే జార్ఖండ్ ప్రాంతీయుడు, మాజీ కేంద్రమంత్రి. విదేశాలలో చదువుకున్నారు. అక్కడ పనిచేస్తుండేవారు. నెహ్రూ గారితో పరిచయమైతే భారతదేశానికి తీసుకొచ్చి హెచ్.ఈ.సీ కంపెనీ పటియాలలో చీఫ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇచ్చారు. కాంగ్రెస్‌పార్టీలో చేర్చుకున్నారు. దాంతో ఎంపీగా ఎంపికైనారు. అలా మంత్రి కూడా అయ్యారు. తర్వాత గిరిజనులలో ఎంతమందికి రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందో గణాంకాలు కావాలని ప్రభుత్వాన్ని అడిగారు. కానీ అందులో 90శాతం క్రైస్తవులు. ఓరామ్‌కు బాధ కలి గింది. ఈ పరంపరను కాపాడేది మేం. పరంపరలో ఉన్నవారం మేం. ధర్మాన్ని పాటించేవాళ్లం మేం. కానీ మాకేమీ లేదు. మతం మారిన వారికి అన్నీ సౌకర్యాలు పోతున్నాయి. ఇది అన్యాయమని ప్రకటించారు. తరువాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. ఈ విషయంలో వారి దగ్గరికి వెళ్లి మాట్లాడారు. అపుడు ఇందిరాగాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వినతిపత్రం ఇమ్మని చెప్పారు. 250 మంది ఎంపీల సంతకంతో ఆయన ఇచ్చారు. కమిటీలో 33 మంది సభ్యులున్నారు. చర్చించినపుడు ఒక వ్యక్తి మాత్రమే వ్యతిరేకించాడు. మిగతావారు చర్చించాలని, బిల్ తీసుకురావాలని అన్నారు. 1970 డిసెంబర్‌లో దీనిమీద చర్చ ప్రారంభం కావాలి. అపుడు మరలా ఇంకో వినతి పత్రం ఇచ్చారు. అందులో 300పైన ఎంపీల సంతకం పెట్టారు. అపుడు అంతా అయిపోయింది. కానీ ఆ సమయంలో కొంతమంది క్రైస్తవులు ఇందిరా గాంధీ మీద వత్తిడి తీసుకొచ్చారు. ఆమె భయపడింది. పక్కనపెట్టింది. ఈ విషయంమీద కార్తీ ఓరావ్ కన్నీటితో పార్లమెంటులో 40 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చారు. నిన్న మా స్థితి ఏమిటి, నేడు మేం ఎట్లా ఉన్నాం, రేపు మేం ఏమైపోతామో అని బాధపడ్డారు. ఓరామ్ మరణించారు. అయినా జనజాతి సమాజంలో చైతన్యం కలగలేదు. చైతన్యం తెచ్చేవారు లేరు. తర్వాత వనవాస కల్యాణాశ్రమం ఆవిర్భవిం చింది. 2006లో జనజాతి సురక్షామంచ్ వేదిక ఏర్పా టయింది. ఎవరైతే మతం మార్చుకున్నారో వాళ్లని సూచీనీ నుంచి తొలగించాలని కోరింది. ఆ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఒకటి కేరళకు సంబంధించినది, రెండోది మేఘాలయ జడ్జిమెంట్. రెండు జడ్జిమెంట్లో కూడా సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జి మెంట్ ఇచ్చింది. గిరిజనులలో ఎవరైతే మతం మార్చుకుంటారో, రీతి రివాజు పరంపర పాటించక పోతే సూచీలో ఉండరని స్పష్టం చేసింది. పరంపర మారితే రిజర్వేషన్ సౌకర్యం వర్తించదని చెప్పాయి. బైబిల్ ప్రకారం కూడా మతం మార్చుకుంటే మిగతా వారు దేవుళ్లు కారు. వాళ్లను సైతాన్లు అంటారు. ప్రసాదం కూడా తీసుకోరు. కాబట్టి వారు మతం మారిన సంగతి రుజువు చేయవలసిన అవసరంలేదు. వీరికి రిజర్వేషన్ ఉండకూడదని నినదిస్తున్నాం. సంస్థ ఇప్పుడు ఉధృతంగా పనిచేస్తుంది.
2009లో గిరిజనులలో చైతన్యం కలిగించాలని సంతకాలసేకరణ చేపట్టాం. 28లక్షల మంది గిరిజన ఓటర్లు సంతకం పెట్టారు. అప్పుడు ప్రతిభా పాటిల్ రాష్ట్రపతి. వారిని కలవడానికి వెళితే ఆవిడ కూడా మతం మారిన వారికి రిజర్వేషన్లు ఉన్నాయా అని ఆశ్చ్యపోయారు. ఈ విషయం ఎవరికీ తెలి యదు. గిరిజనులలో ఎక్కువ చైతన్యం తేవడానికి ప్రయత్నం జరిగింది. మూడు సంవత్సరాల లోపల మొత్తం వనవాసీ జిల్లాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి కలెక్టర్ ద్వారా ప్రధానమంత్రికి, రాష్ట్రపతి గారికి ఒక వినతిపత్రం పంపించాం. గిరిజన జిల్లా లలో ప్రదర్శనలు నిర్వహించాం. వాటితో ప్రజలలో చాలా చైతన్యం కలిగింది. ఈ ఉద్యమమంతా నడిపిన వారు గిరిజనులు. కార్తీ ఓరామ్ తరువాత ఎవరూ ముందుకురాలేదు. ఇప్పుడు మొత్తం గిరిజన సమాజం ముందుకు వచ్చింది. గౌహతి నుంచి 60 వేలమంది వచ్చారు. ఆదిలాబాద్ 13 వేల మంది, పాడేరునుంచి 16వేలమంది వెళ్లారు. వీరంతా ఎవరైతే మన దేవుళ్లను నమ్మరో వారు మావాళ్లు కాదని చెప్పారు.
మణిపూర్‌లో గిరిజనులకు, గిరిజనేతరులకు ఘర్షణ జరుగుతున్నది. వనవాసీ కల్యాణాశ్రమం ద్వారా మీరు ఏమి చెబుతారు?
ఈ సంఘర్షణకు రకరకాల కారణాలు. అవి ఎలా ఉన్నా రెండు వర్గాల మధ్య వైషమ్యం మంచిది కాదు. ఇళ్లు తగులబెట్టుకుంటున్నారు, మనుషులను చంపుకుంటున్నారు. ఇది సబబు కాదు. దాని గురించి మా అఖిల భారతీయ అధ్యక్షులు ఒక విజ్ఞప్తి చేశారు. ఉద్రిక్తతలను చల్లార్చడానికి మేధావులు, ప్రజలలో పలుకుబడి ఉన్నవారి సహకారమడిగారు. మీ తరపున నుంచి ఒక స్టేట్‌మెంట్‌ఇస్తే దానిని అక్కడ వైరల్ చేస్తామనీ, ఈ స్టేట్‌మెంట్‌ను రాష్ట్రపతికి పంపిస్తామనీ చెప్పారు. చాలామంది మేధావులను కలసి ఇలాంటి ప్రకటనలు తీసుకున్నారు. రాష్ట్రపతికి పంపించారు. బాధితులకు సేవాకార్యక్రమాలు, సహాయసహకారాలు అందిస్తున్నాం. తొందరగా వారి మధ్య వైషమ్యాలు తొలగి అందరూ కలిసిమెలసి ఉండే వాతావరణం నెకొనాలని కోరుతున్నాను.
జాగృతి సౌజన్యంతో…