Home News స్వావలంబన స్వాప్నికుడు

స్వావలంబన స్వాప్నికుడు

0
SHARE

కొద్దిరోజుల కిందట మదన్ దాస్ దేవిగారి మరణ వార్త విన్నపుడు నాతోపాటు లక్షలాది కార్యకర్తలు మాటల్లో చెప్పలేనంత వేదనకు గురయ్యాం. మదన్ దాస్ వంటి ప్రభావశీల వ్యక్తిత్వం గలవారు ఇకపై మన మధ్య కనిపించరన్నది హృదయాన్ని మెలిపెట్టే, భరించక తప్పని వాస్తవం. అయితే, మనపై ఆయన ప్రభావం కొనసాగుతుందనే సత్యమే మనను ఓదారుస్తుంది. అలాగే మనం ముందుకు సాగడంలో ఆయన ప్రబోధాలు, సిద్ధాంతాలు మనకు స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేస్తాయి.

మదన్‌ దాస్‌ గారితో చాలా ఏళ్ల పాటు కలసి పనిచేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన సరళ స్వభావం, మృదు భాషణాలను నేను చాలా సన్నిహితంగా గమనిస్తూ వచ్చాను. ఆయన అత్యుత్తమ సంస్థా నిర్వహణశీలత గల వ్యక్తి, కాబట్టి ఆయన సాన్నిహిత్యంలో నేను సంస్థాగత కార్యకలాపాల్లో గణనీయ సమయం వెచ్చించేవాణ్ణి. కాబట్టి, కార్యకర్తల సంస్థాగత అభివృద్ధి, ఎదుగుదల సంబంధిత అంశాలు మా సంభాషణలలో క్రమం తప్పకుండా దొర్లడం సహజం. అలాంటి సంభాషణల్లో భాగంగా ఒకసారి ఆయన అసలు ఏ ప్రాంతానికి చెందినవారో చెప్పాలని నేను కోరాను. అప్పుడాయన– మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో గల ఒక గ్రామం నుంచి వచ్చానని, తమ పూర్వీకులు మాత్రం గుజరాత్ వాసులని నాతో చెప్పారు. అయితే, గుజరాత్‌లో ఏ ప్రాంతం నుంచి వారు వచ్చారో ఆయనకు తెలియదు. అప్పుడు నేను ఆయనకు బదులిస్తూ ‘దేవి’ అనే ఇంటి పేరున్న ఉపాధ్యాయుడు ఉండేవారని, ఆయన విస్‌నగర్‌కు చెందినవారని చెప్పాను. ఆ తర్వాత ఆయన విస్‌నగర్‌, వాద్‌నగర్‌లను కూడా సందర్శించారు. అటుపైన మా మధ్య సంభాషణ కూడా గుజరాతీలోనే జరుగుతూ వచ్చింది.

సంభాషణల వెనుకగల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మదన్ దాస్‌కి గల అనేక ప్రత్యేకతలలో ఒకటి. ఎంతో మృదుస్వభావి అయిన ఆయన, సదా చిరునవ్వుతో గంటల తరబడి సాగిన చర్చల సారాన్ని కేవలం కొన్ని వాక్యాల్లోనే సంగ్రహించగలరు. ‘వ్యష్టి’ అనే పదాన్ని వెనక్కునెట్టి, ‘సమష్టి’ అనే పదానికి మనం ప్రాధాన్యం ఇచ్చినపుడు ఎన్ని అద్భుతాలను సాధించగలమో మదన్ దాస్ గారి జీవన యానాన్ని పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సుశిక్షిత చార్టర్డ్ అకౌంటెంటుగా ఆయన ఎలాంటి లోటుపాట్లు లేని జీవితాన్ని అనుభవించగలిగేవారు. కానీ, ఆయన హృదయం మాత్రం– యువతను తీర్చిదిద్దడంలో, భారత దేశాభివృద్ధికి కృషి చేయడంపైనా నిమగ్నమై ఉండేది.

మదన్ దాస్ గారికి భారత యువతపై అచంచల విశ్వాసం ఉండేది. దేశవ్యాప్తంగా గల యువతరంతో ఆయన సులువుగా సంధానం కాగలరు. ఆ మేరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ను (ఎబివిపి) బలోపేతం చేయడంలో ఆయన తలమునకలయ్యారంటే ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ ప్రయాణంలో ఆయన వల్ల ప్రభావితులైన ముఖ్యమైన వ్యక్తులలో యశ్వంతరావు కేల్కర్ ఒకరు. మదన్‌ దాస్‌ నుంచి ఎనలేని స్ఫూర్తి పొందిన నేపథ్యంలో ఆయన గురించి తరచూ మాట్లాడేవారు. ‘ఎబివిపి’ కార్యకలాపాల్లో విద్యార్థినులను ఎక్కువగా నిమగ్నం చేయాలని మదన్ దాస్‌ సదా నొక్కిచెప్పేవారు. సామాజిక సంక్షేమానికి దోహదపడే వేదిక ద్వారా వారికి సాధికారత కల్పించాలని ఉద్ఘాటించేవారు. ఏదైనా సమష్టి కృషిలో విద్యార్థినులు పాలుపంచుకుంటే అది సదా సున్నితంగా ఉంటుందని ఆయన తరచూ చెప్పేవారు. మదన్ దాస్ గారికి విద్యార్ధులంటే ఎంతో మక్కువ. ఆయన ఎల్లప్పుడూ వారి మధ్యనే కనిపించేవారు. అయితే, నీటిలోని కమలం తరహాలో ఉండేవారు తప్ప, ఎప్పుడూ విశ్వవిద్యాలయ రాజకీయాలలో క్రియాశీల పాత్ర పోషించింది లేదు.

చిన్నతనంలో మదన్ దాస్ గారి సాన్నిహిత్యం, మార్గనిర్దేశం ద్వారా ప్రజా జీవితంలో ఎదిగి, ఆయనకు రుణపడి ఉన్న చాలామంది నాయకుల గురించి నేను చెప్పగలను. కానీ, వారి ఎదుగుదలలో తన ప్రమేయం గురించి గొప్పలు చెప్పుకోవడం ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం. ఈ రోజుల్లో జనాన్ని, ప్రతిభను, నైపుణ్యాన్ని నిర్వహించే సామర్థ్యం చాలా ప్రాచుర్యం పొందింది. అయితే, వ్యక్తులను అర్థం చేసుకోవడంలో, వారి నైపుణ్యాలను గుర్తించి సంస్థాగత లక్ష్యాలవైపు మళ్లించడంలో మదన్ దాస్ ఎంతో నిపుణులు. ఆయన తన చుట్టూ ఉన్నవారి సామర్థ్యాలను చక్కగా అవగతం చేసుకుని, వాటి ప్రాతిపదికగా కర్తవ్య నిర్దేశం చేసేవారు. అంతేగానీ, ఆయా అవసరాలకు తగినట్లు వ్యక్తులను మనం మలచుకోవాలనే వాదనకు ఆయన ఎన్నడూ కట్టుబడలేదు. అందుకే, ఏ యువ కార్యకర్త చక్కని ఆలోచనను తనతో పంచుకున్నా, దాన్ని చాటి చెప్పడంలో ఆయన ముందుండేవారు. ఈ కారణంగానే ఆయనతో పనిచేసిన వారు స్వీయ ప్రేరణతో సామర్థ్య ప్రదర్శన ద్వారా తమదైన ముద్ర వేయగలిగేలా ఉండేవారు. అందుకే ఆయా సంస్థలు ఆయన నాయకత్వంలో భారీస్థాయిలో అభివృద్ధి చెందాయి. అంతేకాకుండా స్థాయి–పరిధి పరంగా పెద్దవిగా రూపొందినప్పటికీ వాటి మధ్య సమన్వయం, ప్రభావం చక్కగా ఉండేవి.

మదన్ దాస్ ప్రయాణ కార్యక్రమం ఎన్నడూ ఖాళీగా ఉండేది కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన విధులకు మించి, ప్రజలతో కలవడంపై తగు సమయం నిర్ణయించుకుని, తగువిధంగా సన్నద్ధమై వచ్చేవారు. కానీ, ఆయన కార్యక్రమాలు ఎప్పుడూ సరళమైనవే తప్ప కార్యకర్తలపై భారం మోపేటంత భారీ స్థాయిలో ఉండేవి కావు. ఆయనలోని ఈ విశిష్ట లక్షణం జీవితాంతం కొనసాగింది. దీర్ఘకాలిక వ్యాధులు బాధించినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వాటి గురించి నేను వాకబు చేసినా, పదేపదే అడిగితే తప్ప స్పందించేవారు కాదు. శారీరకంగా బాధపడుతున్నా దాన్ని బయటకు కనిపించనివ్వరు. అనారోగ్యం పాలైనప్పటికీ దేశానికి, సమాజానికి ఇంకా చేయగలిగిన దానిగురించి సదా ఆలోచించేవారు.

విద్యార్థిగా మదన్ దాస్ అద్భుత ప్రతిభావంతులు. నిర్దిష్ట లక్ష్యం కోసం కఠోర శ్రమకోర్చే ఆయన పని విధానానికి పునాది ఇదే. ఆయనొక పుస్తకాల పురుగు… ఏదైనా మంచి డల్లా దానిని సంబంధిత రంగంలో పుస్తకం చదివినప్పుడల్లా దానిని సంబంధిత రంగంలో పని చేస్తున్న వ్యక్తికి పంపేవారు. ఆ క్రమంలో ఇలాంటి పుస్తకాలు చాలా తరచుగా అందుకోవడం నా అదృష్టం. ఆర్థిక శాస్త్రంతోపాటు విధానాంశాలపైనా చక్కని అవగాహన ఆయన సొంతం. ఏ వ్యక్తీ ఇతరులపై ఆధారపడని, ప్రతి ఒక్కరూ సొంత కాళ్లపై నిలబడగలిగే భారతదేశాన్ని ఆయన స్వప్నించారు. ఆ మేరకు స్వీయ ప్రగతికి, వృద్ధికిగల అవకాశాలతో సాధికారత పొందాలని అభిలషించేవారు. పరస్పర గౌరవం, సాధికారత, ఉమ్మడి శ్రేయస్సు సూత్రాలతో పాదుకున్న సమాజంలో ప్రతి పౌరునికీ స్వావలంబన కేవలం ఒక లక్ష్యంగా మాత్రమేగాక జీవన వాస్తవంగా వర్ధిల్లే భారతదేశాన్ని మదన్ దాస్ కలలుగన్నారు. ఈ నేపథ్యంలో నేడు భారతదేశం వివిధ రంగాల్లో మరింత ఎక్కువగా స్వావలంబన సాధిస్తున్నందున ఆయనకన్నా సంతోషించే వ్యక్తులు మరెవరూ ఉండరంటే అతిశయోక్తి కాబోదు!

నేడు మన ప్రజాస్వామ్యం శక్తిమంతంగా రూపొందుతూ, ఆత్మవిశ్వాసం నిండిన యువతరంతో, ముందుచూపుగల సమాజంతో, దేశవాసుల ఆకాంక్షలు ఆశావాదంతో పొంగిపొర్లుతున్న నేపథ్యంలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా తమ జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేసిన మదన్ దాస్ దేవి వంటివారిని స్మరించుకోవడం ఎంతో అవసరం.

– నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి