Home News వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి

వీరనారి ఝాన్సీ ల‌క్ష్మీబాయి

0
SHARE

భారతదేశం ఎందరో వీరులను వీర మాతలను కన్న తల్లి. 18వ శతాబ్దంలో మాతృభూమి దాస్య శృంఖలాలు ఛేదించడం కోసం అనేక మంది వీరులు వీర మాతలు ఈ గడ్డ పై జన్మించారు. స్వతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను తృణపాయంగా ఎంచి తల్లిభారతి పాదాల చెంత సమ్పర్పించారు. తల్లి భారతి కిరీటంలో ఒక్కో మణిలా వెలిగారు. అందులో అగ్రగణ్యులారు ‘మణి’ కర్ణిక… మన రాణి ఝాన్సీ లక్ష్మీ భాయి.

ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనను అడ్డుకున్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల 19న మహారాష్ట్రకు చెందిన సతారలో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో విక్రమ నామ సంవత్సరం బహుళ పంచమీ నాడు జన్మించింది.ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భాగీరథీబాయిలు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనదీ, ఆధ్యాత్మిక ధోరణి మెండుగా కలది.

1842 లో ఝాన్సీ రాజు గంగాధర్ తో వివాహం జరిగింది. వారసుడు లేకుండానే కొద్దీ కాలానికే రాజు గంగాధర్ మరణించాడు. మహారాజు చివరి కోరిక మేరకు దామోదర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంది. దత్తత స్వీకారం చెల్లదని ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి కపట నీతి అయిన రాజ్య సంక్రమణ సిద్ధాంత ప్రకారం ఝాన్సీ రాజ్యాన్ని తము కలిపేసుకుంటాము మేము విసిరి వేసే ఎంగిలి మెతుకు లు తిని బ్రతుకు అంటే లక్ష్మీ భాయి కి తన భర్త మాటలు గుర్తుకొచ్చాయి ‘‘నిన్ను ప్రేమించడాని కన్నా ముందు నేను నా దేశాన్ని ప్రేమించాను లక్ష్మీ’.. భర్త చివరి మాటలు గుర్తుకున్నాయి రాణి లక్ష్మీబాయ్‌కి. ‘నేనున్నా, పోయినా, నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ.. నా దేశం మిగలాలి లక్ష్మీ’’. ఎదురుతిరిగింది ఝాన్సీ రాజ్య రక్షణ కొరకు యుద్ధం చెయ్యడానికి సిద్ధపడింది.

ఒకటే నిశ్చయించుకుంది చేతిలో పదునైన ఖడ్గం ఉండాలి. తన్నుకుపోవ డానికి కిందికి వాలబోతున్న డేగల కంఠాల్ని సర్రున తెగ్గొట్టేయాలి. అప్పుడే ఝాన్సీకి బతుకు. అప్పుడే ఝాన్సీ ప్రజలకు బ్రతుకు మెతుకు. మణికర్ణిక వచ్చింది. మ..ణి..క..ర్ణి..క! ఆమెలా ఎవరూ ఉండరు. ఆమెలా ఎవరూ అశ్వాన్ని పరుగులు తీయించలేరు. ఆమెలా ఎవ్వరూ ఖడ్గాన్ని తిప్పలేరు. ఝాన్సీని రక్షించేందుకు లేచి నిబడింది కదా. లేచి నడుము బిగించింది కదా. ఒరలోకి కత్తిని దోపుకుంది కదా. జవనాశ్వాన్ని ఎక్కింది కదా. ఖడ్గాన్ని తీసి గగనంలో నెత్తురు కక్కుతున్న ఆకలి కళ్లవైపు చూపింది కదా. అయితే వారసురాలే. ఝాన్సీ పౌరురాలు కాదు. అయినా వారసురాలే. ఝాన్సీకి ఆమె కోడలు. ఝాన్సీ సంస్థానం ఇక కోడి పిల్ల కాదు. పదిహేడవ శతాబ్దపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కల కూడా అదే. స్వరాజ్యం. ఆయన కలను కూడా ఒక కత్తిలా చేతికి తీసుకుంది లక్ష్మీబాయి. ‘లక్ష్మీబాయి అనే నేను.. చివరి రక్తపు బొట్టు వరకు, ఝాన్సీకి అత్యంత విధేయురాలినై, ఝాన్సీ ప్రజల సేవకు, ఈ సంస్థాన రక్షణకు, సంరక్షణకు నిలుస్తాను..’ అంటూ లక్ష్మీబాయి ప్రమాణ స్వీకారం చేసింది. డేగలు కళ్లెర్ర చేశాయి. ఝాన్సీ నుంచి వెళ్లిపొమ్మని వర్తమానం పంపాయి. కానీ అలా వెళ్లిపోవడం, ఏం జరుగుతున్నా మిన్నకుండిపోవడం దేశద్రోహం. శత్రువును మిగల్చదలచుకోలేదు లక్ష్మీబాయి. స్వభాషా, స్వభూష, స్వ సంస్కృతి రక్షణ కోసం ఝాన్సీ లక్ష్మీభాయి నిలబడింది.

‘నీకు ఝాన్సీ కావాలి. నాకూ ఝాన్సీ కావాలి. ఒకటే తేడా. నీకు పాలన కావాలి. నాకు ప్రజలు కావాలి’’.. శత్రువుతో లక్ష్మీబాయి. ‘‘నీకు నా శిరస్సు కావాలి, నాకూ నీ శిరస్సు కావాలి. ఒకటే తేడా. ఝాన్సీ కోట గుమ్మం ముందు వేలాడగట్టేందుకు నీకు నా శిరస్సు కావాలి. ఎవరికీ తలొంచే పని లేదని నా ప్రజలకు నేను చెప్పేందుకు నీ శిరస్సు నాకు కావాలి’’బ్రిటిష్‌ ఫిరంగులు ఝాన్సీలో చొరబడ్డాయి. ఝాన్సీని మరుభూమిగా మార్చివేశాయి. లక్ష్మీబాయి, ఆమె అశ్వం, ఆమె చేతిలోని ఖడ్గం.. పోరాటం ఆపలేదు. ‘‘దేశంపై ప్రేమ.. ఓటమిని అంగీకరించనివ్వదు. దేశాన్ని శత్రువుకు వదిలి పెట్టనివ్వదు ’’..

‘. నడుముకు తన దత్తపుత్రుడు ని కట్టుకుని యుద్ధరంగమున దూకింది. శత్రువు ముట్టడి ఎక్కువయ్యే సరికి తన గుర్రంతో 50 అడుగుల కోట గోడ దూకి శత్రువును చిక్కకుండా తప్పించుకుంది. గ్వాలియర్ చేరుకుని స్వతంత్ర పోరాటం లో తన సహచరులైన నానాసాహెబ్ పీష్వా తదితరులను కలుసుకుంది. అయితే అక్కడ కూడా శత్రువు దాడి చెయ్యడంతో పోరాటం లో తీవ్రంగా గాయపడింది. శత్రువు చేతికి చిక్కకూడదు అని రణరంగం నుండి రక్తం కారుతున్న గాయాలతో బాబా గంగదాస్ ఆశ్రమం చేరుకున్నది. ‘బ్రిటిష్ వాళ్లకు నా శవం కూడా చిక్కకూడదు’ అని స్వామీ జీ తో చెప్పి చితి పేర్పించుకుని స్వాతంత్ర సమారాగ్ని జ్వాల లకు ఆహుతి అయ్యింది వీరనారి రాణి ఝాన్సీ లక్ష్మీభాయి .రాణి లక్ష్మీబాయి కర్తృత్వం , నేతృత్వం మాతృత్వం ల తో కలబోసి న వీరనారిమని . ‘మేరీ ఝాన్సీ నహీ దూంగీ’ అంటూ బొబ్బిలిలా గర్జించింది తల తెగిన సరే నా ఝాన్సీ తల వంచదు అని ఖడ్గం ఝుళిపించి బ్రిటిష్ వాళ్ళ వెన్ను లో వణుకు పుట్టించిన ధీర వనిత మన ఝాన్సీ రాణి. అసమాన ధైర్యసాహసాలు, అజేయమైన పోరాటం, ఆమె ప్రాణత్యాగం మాతృభూమి రక్షణ పట్ల అకుంఠిత దీక్ష ఎవరూ,ఎన్నటికీ మర్చిపోలేనివి. ఆ స్ఫూర్తితోనే నేతాజీ ఇండియన్ నేషనల్ ఆర్మీలో మహిళావిభాగానికి ఝాన్సీ రెజిమెంట్ గా పేరుపెట్టాడు.

లక్ష్మిరహల్య చెన్నమ్మ రుద్రమాంబ సువిక్రమా… ఝాన్సీ రాణే కాదు అహల్యాబాయి హోల్కర్, రాణీ దుర్గావతి, చెన్నమ్మ, రుద్రమ దేవి అబ్బక్క వంటి వీరనారులెందరో వంశపారంపర్య అధికారాన్ని అనుభవించడం మాత్రమే కాదు అసమాన ధైర్య సాహసాలతో వాళ్లేంటో నిరూపించుకున్నారు. ఇంతటి ఘనచరిత్ర భారత నారిది. ప్రముఖ మరాఠా కవి బి ఆర్ తాంబే లక్ష్మీభాయి గురించి ఒక గీతం రాశారు అందులో ” ఇక్కడే ఝాన్సీ లక్ష్మీ భాయి పరాక్రమ జ్వాల ఆరిపోయింది, బ్రిటిష్ సేనలు ఆమెను అక్కడే ముట్టడించాయి. ఇప్పుడు ఆమె ఇక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. ఆగి రెండు కన్నీటి బొట్లు జారవిడువండి.

– సంధ్య