Home News శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్

శ్రీ కె. ఎస్. సుదర్శన్ జీ – తత్వవేత్త అయిన ఫీల్డ్ మార్షల్

0
SHARE

-అనంత్ సేథ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 5వ సర్ సంఘచాలక్ శ్రీ కుప్పహళ్లి సీతారామయ్య సుదర్శన్ జీ ఆషాఢ శుద్ధ తృతీయ, 18 జూన్ 1931 నాడు రాయ్ పూర్ లో జన్మించారు. వారు 9 సం|| వయస్సు నుండే ఆర్‌ఎస్‌ఎస్ శాఖకు వెళ్ళటం ప్రారంభించారు. వారు 6 దశాబ్దాలు సంఘ ప్రచారక్ గా సేవచేసి, ప్రొఫెసర్ రాజేంద్ర సింహ్ జీ తర్వాత 2000 సం|| లో సర్ సంఘచాలక్ బాధ్యతలు స్వీకరించారు. చదువు రీత్యా ఇంజనీర్ అయిన వారు, శారీరిక దార్ఢ్యత మరియు మేధో చురుకుదనం ఆవశ్యకత గురించి నొక్కి వక్కాణించేవారు. ఆయన స్నేహితుల బృందంలో స్వదేశీనిష్ఠ, అభిమానం గల దౌత్యవేత్తలు, శాస్త్రజ్ఞులు, వేద పండితులు,పర్యావరణవేత్తలు, ఇంకా ఆర్థిక శాస్త్రవేత్తలు ఉండేవారు.

ప్రముఖ రచయిత, టి‌వి ఛానెల్స్ చర్చలలో పాల్గొనే శ్రీ రతన్ శార్దా గారు, తన గ్రంథం RSS: Evolution from an Organization to a Movementలో,శ్రీ సుదర్శన్ జీ గురించి వ్రాస్తూ–“ఆయన అందరూ మంచి శరీరసౌష్ఠవం, మేధస్సులో ముందంజ కలిగి ఉండాలని కోరుకొనేవారు”. శ్రీ రతన్ శార్దా గారు తన ఇంకొక గ్రంథం Secrets of RSS: Demystifying The Sanghలో –“శ్రీ సుదర్శన్ జీ ఒక చురుకైన మేధోసంపత్తి గల, నిర్మొహమాటంగా ఉండే బహుభాషా కోవిదుడు, ఆయనకు ఉన్నతమైన, స్పష్టమైన భావాలు ఉన్నాయి. ఆయన స్వీయనిలకడ ఉండే గ్రామీణ ఆర్థికవ్యవస్థ, స్థిరమైన వినియోగం,శాస్త్రీయత ఆధారమైన హిందూ వ్యక్తిగత, సామాజిక మరియు జాతీయ జీవన విధానం ఉండాలని పరితపించేవారు”. శ్రీ శార్దా గారు ఇంకా ఇలా చెప్తారు –“క్షమాపణ లేని, సహేతుకమైన హిందూతత్వాన్ని తిరిగి జీవింపజేసేందుకు సంజ్ఞా సహకారం శ్రీ సుదర్శన్ జీ అందించారు. వారు హిందుత్వాన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ప్రతిపాదించారు, హిందుత్వం ఒక్కటే భారత్ మరియు ప్రపంచం మొత్తం ఎదుర్కొనే పర్యావరణ అధోకరణం, నాగరీకృతమైన గొడవలు, సంబంధిత సమస్యలకు పరిష్కారాన్ని చూపగలదని వివరించారు.”

శ్రీ సుదర్శన్ జీకి ఆదర్శం పూర్వ జ్యేష్ఠ ప్రచారక్ శ్రీ ఏకనాథ్ జీ రానడే. వారి స్ఫూర్తి వలన సుదర్శన్ జీ తన ఇంజనీరింగ్ పూర్తికాగానే,23 జూన్ 1954న ప్రచారక్ గా నియుక్తి అయ్యారు. వారు హిందూధర్మవైభవాన్ని పునరుజ్జీవింప జేయాలనే జీవితాశయంతో పనిచేసేవారు. వారు చెప్పేవారు –“హిందూ సమాజం ఈ వలసవాద బానిస సంకెళ్ళను త్రెంచుకొని,పరస్పర ప్రయోజనాలకోసం ఏర్పడిన రాజ్యాల కూటమిలో ప్రముఖ స్థానం పొందగలదు.”

చిత్రనిర్మాత శ్రీ లలిత్ వాచానీ గారి The Men in the Treeఅనే డాక్యుమెంటరీలో,బాల/యువ స్వయంసేవకులను చేర్చుకోవటంలోని ప్రాముఖ్యతను వివరిస్తూ, ఇలా అన్నారు –“ పిల్లల ప్రవృత్తి, వారి వారి అలవాట్లను తయారు చేసుకొనేందుకు వీలుగా ఉంటుంది. వాళ్ళు బాల్యంలో,తమ తమ చుట్టుప్రక్కల ఉన్న పరిసరాల వాతావరణం చేత ప్రభావితులౌతారు. వారు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో రూపుదిద్దుకుంటారు. పిల్లలు శిశుస్థాయి నుండి బాల్యం వరకు, సున్నితమైన మనస్తత్వం కలిగి, మంచి అలవాట్లను నేర్చుకోవటంలో శ్రద్ధ చూపుతారు. అప్పుడు వారికి మనం ఏం చెప్పినా ఆకళింపు చేసుకొంటారు కాబట్టి, వాళ్ళ మనసులపై ఒక శాశ్వతమైన ప్రభావం పడుతుంది. అందుకే మనం, వారిని బాల్యం నుండే శాఖలకు తీసుకువస్తుంటాము. ”

వారు ఇప్పటి రాజకీయరంగంలో తిరిగి ప్రభావం చూపనున్న మూడు కీలకాంశాలకు సిద్ధాంతపరమైన పునాదులు వేసి ఉంచారు, అవేమిటంటే – పౌరసత్వ సవరణ చట్టం (సి‌ఏ‌ఏ), ఆత్మనిర్భర భారత్, సులభంగా పనిచేసే విధానం (Act-Ease Policy). ఇప్పటి భారత ప్రభుత్వం చేత ప్రతిబింబించబడే  ఆత్మనిర్భరభారత్ నినాదం, శ్రీ సుదర్శన్ జీ,స్వదేశీ జాగరణ్ మంచ్ సహవ్యవస్థాపకులైన జ్యేష్ఠప్రచారక్ శ్రీ దత్తోపంత్ ఠేఙ్గడేజీతో కలిసి స్వదేశీ ఆర్థికనమూనాను ప్రతిపాదించారు. జ్యేష్ఠ సంఘమేధావి, శ్రీ సుదర్శన్ జీకి ఒకప్పటి సహచరులు అయిన శ్రీ దేవేంద్ర స్వరూప్ గారి మాటల్లో చెప్పాలంటే – “శ్రీ సుదర్శన్ జీ స్వయంగా స్వదేశీ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక శాస్త్రాలను దేశంలో ప్రతిచోటా పర్యటించి, చాలా దగ్గరగా అధ్యయనం చేశారు. ”

వారు ఈశాన్యభారత్‌లో ప్రచారక్ గా పనిచేస్తూ, బెంగాలీ, అస్సామీ భాషలు చక్కగా నేర్చుకున్నారు. వారు చర్చిల వివిధ కార్యకలాపాలు చాలా నిశితంగా పరిశీలించి, వాటిని బహిర్గతం చేశారు. వారు అస్సాం ప్రాంతంలో, భారత్ సరిహద్దులు దాటిన, బంగ్లాదేశీ ముస్లింల చొరబాటుదారుల అక్రమ ప్రవేశం అనే దాడిని,ముస్లిం జన జిహాద్‌గా హెచ్చరించారు. శ్రీ సుదర్శన్ జీ యే భారత ప్రజలకు, ముఖ్యంగా అస్సాం వాసులకు, బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చే ముస్లింలు అక్రమవలసదారులనీ, అదే సమయంలో అక్కడి నుండి వచ్చే హిందువులు శరణార్ధులనీ మనం గ్రహించాలని, చెప్పారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమవలసదారులను నిరోధించేందుకు ఏర్పాటైన, అప్పటి ఉద్యమకారుల సంస్థ  అయిన అసోమ్ గణపరిషత్ వారిని, బెంగాలీ హిందువులను తిరిగి పంపకూడదని, వాళ్ళకు అర్థం అయ్యేట్లు నచ్చచెప్పి, అలా వారిని ఇక్కడే ఉంచటంలో కీలకపాత్ర పోషించారు.

శ్రీ సుదర్శన్ జీ యే స్వయంగా సర్ సంఘచాలక్ బాధ్యతను ప్రస్తుత సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్ గారికి 2009 లో అప్పగించారు. వారు 81 సం|| వయస్సులో 15 సెప్టెంబర్ 2012 నాడు స్వర్గస్తులయ్యారు.

అనువాదం: సత్యనారాయణ మూర్తి