Home News ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ సంస్థపై నిషేధం

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ సంస్థపై నిషేధం

0
SHARE

ముస్లింలీగ్‌ జమ్మూకశ్మీర్‌ (మసరత్‌ ఆలం భట్‌ వర్గం) సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ వేటు వేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెల్లడించారు.

‘ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్‌ను ఉపా చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటిస్తున్నాం. ఈ సంస్థ సభ్యులు కశ్మీర్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదానికి మద్దతు అందిస్తుండటమే గాక.. జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్‌ పాలనను ఏర్పాటు చేసేందుకు ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, సమగ్రతకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. అలాంటి వారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

కేంద్ర హోంశాఖ కూడా దీనిపై ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థ పాక్‌ అనుకూల ప్రచారం చేస్తోందని, ఆ సంస్థ ఛైర్మన్‌ మసరత్‌ ఆలం.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. అందువల్ల ఈ సంస్థపై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్‌ (మసరత్‌ ఆలం వర్గం) సంస్థకు మసరత్‌ ఆలం భట్‌ నేతృత్వం వహిస్తున్నాడు. ఇతడే అతివాద ‘ఆల్‌ ఇండియా హురియత్‌ కాన్ఫరెన్స్‌’ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 2010 నాటి జమ్మూ కశ్మీర్‌ అల్లర్లతో మసరత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేశాడన్న అభియోగంతో 2019లో ఎన్‌ఐఏ అతడిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ప్రస్తుతం అతడు తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.