( డిసెంబర్ 30 – భగవాన్ రమణ మహర్షి జయంతి )
మౌనవ్యాఖ్యానంతో ఆర్తుల సంశయాలను, సంతాపాన్ని తీర్చడం మహర్షుల విధానమైతే- ఈ యుగంలో ఆ కోవకు చెందిన దివ్య పురుషుడు రమణ మహర్షి. ఆధునిక యుగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుడాయన. తమిళనాడులో మదురై సమీపంలోని తిరుచ్చిళి గ్రామంలో అళగమ్మాళ్, సుందరయ్యర్ దంపతులకు 1879 డిసెంబర్ 30న జన్మించారు. తల్లిదండ్రులు ‘వెంకటరామన్’ అని పేరుపెట్టారు. ఆటపాటలతో అతడి బాల్యం గడిచిపోయింది. చదువుపై శ్రద్ధ తక్కువ. అల్లరి ఎక్కువ. మదురైలో మేనమామ ఇంట్లో ఉండి చదువుతుండగా ఒక బంధువు ద్వారా అరుణాచలం గురించి విన్నాడు. ఆ పేరు వినగానే అతడిలో ఏదో సమ్మోహన శక్తి ప్రసరించింది. అదే సమయంలో పెరియ పురాణం చదవడం తటస్థించింది. నయనార్లనే శివభక్తుల కథలు చదివి తాదాత్మ్యం చెందాడు. ఎప్పుడూ ఏదో ఆలోచనలతో నిమగ్నమై ఉండేవాడు. తరచుగా అరుణాచలం గుర్తుకొచ్చేది. ‘నేను అనేది ఆత్మ. అది శాశ్వతమైనది. దానికి నాశనం లేదు’ అనే అనుభూతి మెరుపులా మెరిసింది. ఆత్మ సాక్షాత్కారజ్ఞానం లభించింది. కొద్ది సాధనతోనే దేహాత్మ భావన తొలగిపోయింది. కళాశాలలో రుసుము చెల్లించడానికిచ్చిన అయిదు రూపా యల్లో మూడు రూపాయలు తీసుకొని 1896 ఆగస్టు 29న ఇల్లు విడిచి వెళ్ళారు.
అరుణాచలం వెళ్ళి సన్యాసి అయ్యారు. అశాశ్వతమైన దేహానికి ఆడంబరం ఎందుకని కౌపీన ధారణ చేసి సాధనలో మునిగిపోయారు. మౌనవ్రతం పాటించేవారు. ఈ యువ సన్యాసి పలువురిని ఆకర్షిం చారు. క్రమంగా ఆధ్యాత్మిక జిజ్ఞాసువులు ఆయన దగ్గరకు రావడం ప్రారంభించారు. ప్రఖ్యాత పండితులు వాసిష్ఠగణపతి ముని వీరి అలౌకిక గుణాలు చూసి ‘భగవాన్’ అని ‘మహర్షి’ అని సంబోధించారు. అప్పటినుంచి వెంకట్రామన్ ‘రమణ మహర్షి’ అయ్యారు.
‘నేను కష్టాల్లో ఉన్నాను నాకు ఇలా జరిగింది. అలా జరగలేదు’ అంటూ చెప్పేవారిని ‘నేను ఎవరండీ’ అని అడిగేవారు మహర్షి. ఈ ప్రశ్న రమణుల బ్రహ్మాస్త్రం. సామాన్య జనులు అనుకునే ‘నేను’ దేహమూ కాదు మనసూ కాదు, బుద్ధీ కాదు, అహంకారమూ కాదు, చిత్తమూ కాదు. ఇది వాటికి అతీతమైనది. అందరిలోనూ ఉన్నది. అన్ని జీవుల్లోనూ ఉన్నది. అంతటా ఉన్నది. దానినే ‘ఆత్మ’ అంటారు. అది అవిచ్ఛిన్నం. దాన్ని అన్వేషించి తెలుసుకున్న వారికి ఏ బంధం ఉండదు. ఏ బాధా ఉండదు. అతడు సచ్చిదానందమూర్తి. ఇదీ రమణుల భావన.
ఎంతటి నిగూఢమైన వేదాంత విషయాలనైనా క్లుప్తంగా సూటిగా సామాన్యమైన ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేటట్లు చెప్పడం భగవాన్ విశిష్టత. రమణులు తమ సాధనలో అన్నపానాలు, విశ్రాంతి పట్టించుకొనేవారు కాదు. శిష్యులు, భక్తులు చొరవ తీసుకొని తిరువణ్ణామలై కొండమీద రమణాశ్రమం నిర్మించారు. విదేశీయులు కూడా ఆయనకు శిష్యులయ్యారు. రమణమహర్షి సందేశాలను గణపతి ముని సేకరించి సంస్కృతంలో ‘రమణగీత్’గా రాశారు. ప్రసిద్ధ రచయిత, నాస్తికుడు చలం తన జీవితం చివరిదశ రమణాశ్రమంలోనే గడిపి అక్కడి అనుభవాలను గ్రంథస్థం చేశారు.
రమణులు దయార్ద్ర హృదయులు. పేదలకు, ఆశ్రమంలోని గోవులు, ఇతర ప్రాణులకు ఆహారం పెడితేనేగాని తాను భోజనానికి వచ్చేవారు కాదు. ఐశ్వర్యం, అధికారం, కీర్తి ఇవేవీ ఆయన పట్టించుకునేవారు కాదు. ఈ నిష్కామయోగి 1950 ఏప్రిల్ 14న దేహం విడిచిపెట్టారు.