రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గత 99 సంవత్సరాల నుండి సామాజిక సంస్థగా క్రియాశీలకంగా పని చేస్తోంది. 2025 విజయదశమి నాటికి వంద సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS)లో శతాబ్ది సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలపై చర్చించనుంది. ఈ సంవత్సరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక అఖిల భారతీయ ప్రతినిధి సభ నాగ్‌పూర్‌లోని రేషింబాగ్‌లో స్మృతి భవన్ ప్రాంగణంలో మార్చి 15, 16, 17 తేదీల్లో నిర్వహించనుంది.
ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ జీ మాట్లాడుతూ ఈ సమావేశాలు ముఖ్యంగా శాఖలకు సంబంధించిన పనులను సమీక్షిస్తుందని పేర్కొన్నారు. శతాబ్ది సంవత్సరంలో శాఖల సంఖ్యను లక్షకు తీసుకెళ్లాలని ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.
2018 తర్వాత దాదాపు 6 ఏళ్ల తర్వాత నాగ్‌పూర్‌లో ఈ ప్రతినిధి సభలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి 1529 మంది ప్రతినిధులు పాల్గొంటారు. 32 సంఘ ప్రేరేపిత సంస్థలప్రతినిధులు కూడా పాల్గొంటారు. వీరిలో రాష్ట్ర సేవికా సమితి ప్రధాన సంచాలకులు శాంతక్కా, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అలోక్ కుమార్ తదితరులు హాజరవుతారు.
అన్ని సంస్థలు దేశవ్యాప్తంగా జరుగుతున్న తమ కార్యక్రమాల గురించి, ఆయా ప్రాంతాల్లోని వివిధ సమస్యలు, వాటి పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాల గురించి తెలియజేస్తాయి. ఈ అంశాలపై చర్చ కూడా జరుగుతుంది.
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగడం వల్ల దేశవ్యాప్తంగా ఉత్సాహం, ఆనంద వాతావరణం నెలకొంది. ఈ చారిత్రక సంఘటన భారతీయ దృక్పథంలో చాలా ముఖ్యమైనది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రతినిధుల సభలో తీసుకురానున్నారు. ఈ అఖిల భారతీయ ప్రతినిధి సభలో మాననీయ సర్ కార్యవాహ (2024-2027) ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. దానికి ముందు పదకొండు క్షేత్ర సంఘచాలక్ ఎన్నికల ప్రక్రియ కూడా జరుగుతుందని అంబేకర్ జీ వివరించారు.
అదే విధంగా పూజనీయ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ దేశవ్యాప్త పర్యటన ప్రణాళిక కూడా ఖరారు చేస్తారు. దీనితో పాటు సమాజ ప్రయోజనాల దృష్ట్యా శాశ్వత మార్పుల కోసం చేపట్టిన సామాజిక సమరసతా, కుటుంబ ప్రభోదన్, పర్యావరణం, ‘స్వదేశీ’, పౌరుల విధులు వంటి అయిదు అంశాలతో కూడిన ‘పంచ పరివర్తన్’ కార్యక్రమంపై చర్చలు జరుగుతాయి.
ఈ సంవత్సరం అహల్యాబాయి హోల్కర్ (1725-2025) జన్మ త్రిశతాబ్ది ఉత్సవాలను మే 2024 నుండి ఏప్రిల్ 2025 వరకు నిర్వహించనున్నారు. అలాగే నూతన అంశాలతో నిర్వహించే సంఘ శిక్షా వర్గలపై కూడా ప్రతినిధుల సభలో చర్చించనున్నారు. సహా ప్రచార ప్రముఖ్ లు నరేంద్రకుమార్, అలోక్ కుమార్ కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.