Home News దేశ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు ఎవరూ బలికావద్దు

దేశ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు ఎవరూ బలికావద్దు

0
SHARE

– కరీంనగర్ RDO కుందారపు మహేశ్వర్

ఘనమైన సంస్కృతీ వారసత్వాలను కలిగి ఉన్న భారతదేశ నిజమైన చరిత్రను ప్రతి ఒక్కరు అధ్యయనం చేయాలని కరీంనగర్ జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి కుందారపు మహేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరినగర్ లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ప్రజ్ఞాభారతి, జాతీయ సాహిత్య పరిషత్, సమాచార భారతి సంయుక్తంగా నిర్వహించిన “గంగలో విషనాగులు” పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజీవ్ మల్హోత్రా, విజయ విశ్వనాథన్ సంయుక్తంగా రాసిన “స్నేక్స్ ఇన్ ది గంగ” గ్రంథాన్ని డా.బొమ్మరాజు సారంగపాణి తెలుగులో ‘గంగలో విషనాగులు’ పేరుతో ప్రభావవంతంగా అనువదించారని, ఇది ప్రతి భారతీయుడు చదువదగ్గ పుస్తకమన్నారు.

భారత జాతిని బలహీనపరచడానికి జాతీయంగాను, అంతర్జాతీయంగాను దేశ వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రల గురించి ఈ పుస్తకంలో పొందుపర్చారని ఆయన వివరించారు. అటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ భారతజాతి అప్రమత్తంగా, సమైక్యంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

గ్రంథ రచయిత భారతదేశ చరిత్రలోని అనేక అంశాలను సాధికారికంగా నిరూపించారని ప్రశంసించారు.
‘గంగలో విషనాగులు’ పుస్తక రచయిత డా. బొమ్మరాజు సారంగపాణి మాట్లాడుతూ గంగ భారతదేశానికి ప్రతీక అని, విషనాగులు అంటే విచ్ఛిన్నకర శక్తులు అని, ఆ విచ్ఛిన్నకర శక్తులు మన సంస్కృతి మూలాలను దెబ్బతీసి, పరమ పావనమైన భారతదేశాన్ని విషతుల్యం చేయాలని చేస్తున్న ప్రయత్నాలను మనం బలంగా తిప్పికొట్టాలన్నారు.

భారతదేశంలో చోటుచేసుకుంటున్న ప్రతి చిన్న అంశం శల్య పరీక్షకు గురి చేస్తున్న దుర్మార్గాలు నిరంతరం జరుగుతున్నాయన్నారు. భారతదేశంపై సంస్కృతి పరంగాను, సైద్ధాంతిక పరంగాను అంతర్జాతీయ విచ్ఛిన్నకర శక్తులు దాడి చేస్తున్నాయని, దేశానికి వ్యతిరేకంగా అతి పెద్ద యంత్రాంగం పనిచేస్తున్నదని, సామాన్యులకు ఈ విషయం తెలియదని, గంగలో విషనాగులు పుస్తకంలో ఈ విషయాలు సాధికారికంగా వివరించబడ్డాయన్నారు.

భారతీయులను కులాలపరంగా మరింతగా విభజించి దేశాన్ని అనైక్యం చేసే సిద్ధాంతాలు వెలవడుతున్నాయని, వీటిని బలపర్చడానికి శత్రుదేశాలు నిధులు కూడా సమకూరుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా లాంటి దేశాల్లో రేసిజం సిద్ధాంతాన్ని ముందు పెడుతూ, దానికి మూలంగా భారతదేశంలోని కుల వ్యవస్థను చూపిస్తూ హిందూ మతాన్ని రూపు మాపడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

ప్రజ్ఞాభారతి చైర్మన్ డా.ఎల్. రాజభాస్కర్ రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మహిళా డిగ్రీ కళాశాల పూర్వ ప్రధానాచార్యుల బూర్ల దక్షిణామూర్తి, ప్రాంత కార్యకారిణి సదస్యులు వడ్డి విజయ సారథి గారు మాట్లాడారు. తదనంతరం నవయుగ భారతి బాధ్యులు రాంపల్లి మల్లికార్జున్ గారు రచించిన జాతి పునర్నిర్మాణ రథసారథులు పుస్తకాన్ని ఆర్. డి . వో కుందారపు మహేశ్వర్ గారు ఆవిష్కరించారు. మల్లిఖార్జున్ గారు పుస్తకం గురించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి ప్రధాన కార్యదర్శి మందల నగేశ్ రెడ్డి,, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు గాజుల రవీందర్, సమాచార భారతి బాధ్యులు తడిగొప్పల శంకరయ్య, జె.సత్యనారాయణ  రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.