పుస్తకాలు పంపండి
(అసెంబ్లీ బాంబు కేసులో అరెస్టు అయిన తర్వాత ఢిల్లీ జైలునుంచి భగత్ సింగ్, తండ్రి సర్దార్ కిషన్ సింగ్ కు రాసిన లేఖ-లాహోరు చిరునామాకి)
————————-
పూజ్య పితాజీ మహరాజ్ కి – వందేమాతరం
మేం ఏప్రిల్ 22వ తేదీన పోలీసు కస్టడీ నుంచి ఢిల్లీ జైలుకి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మేం ఢిల్లీ జైలులోనే వుంటున్నాం. కేసు విచారణ మే 7న జైలులోనే జరుగుతుంది. బహుశా ఓ నెలలోపునే ఈ డ్రామా ముగుస్తుంది. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇక్కడికి వచ్చారని, వకీలు వగయిరాలతో సంప్రదించి నన్ను కలుసుకొనే ప్రయత్నం చేశారని, అయితే అన్ని ఏర్పాట్లూ జరగలేకపోయాయని తెలిసింది. బట్టలు నాకు మొన్న అందాయి. మీరెప్పుడు వస్తే, అప్పుడు నన్ను కలుసుకోవచ్చు. వకీలు ప్రత్యేకించి అవసరంలేదు. గాని, అయితే ఒకటి రెండు అంశాల మీద సలహా తీసుకోవాలనుకుంటున్నాను. అయినా ఇవేవీ అంత ముఖ్యమయినవి కావసుకోండి. మీరు అనవసరంగా హైరానా పడకండి. నన్ను కలవదలిస్తే ఒక్కరే రండి. వాల్డా సాహిబా (అమ్మగారిని) తోడు తీసుకు రాకండి. ఆమె ఊరికినే ఏడ్చేస్తారు. నా మనసుకీ కష్టం అనిపిస్తుంది. ఇంటి సంగతులూ అవీ మీరు కలిసాకనే తెలుస్తాయి.
వీలయితే గీతా రహస్యం, నెపోలియన్ జీవిత చరిత్ర-నా పుస్తకాల షెల్ప్ వుంటాయి, తీసుకురండి. అలాగే కొన్ని మంచి ఇంగ్లీషు నవలలు కూడా. వాలదా సాహిబా, మాతాజీ (నాయనమ్మ), పిన్నిగారి చరణాలకు నా నమస్కారాలు తెలియ జేయండి. రణవీర్ సింగ్, కులకార్ సింగ్ కి నమస్కారాలు. బాపూజీ (తాతగారికి) చరణాలకి నా నమస్కారాలని మనవి చేయండి. పోలీసు కస్టడీలోనూ, ఢిల్లీ జైలులో కూడా మాతో సజావుగానే ప్రవర్తిస్తున్నారు. మీరెలాంటి చింకా పెట్టుకోకండి. మీ చిరునామా తెలీకపోవడంవల్ల ఈ చిరునామాకి (కాంగ్రెసు ఆఫీసుకి) రాస్తున్నానీ ఉత్తరం
మీ సేవకుడు,
భగత్ సింగ్.