తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్మెంట్ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా అని తెలిపారు. నారద జయంతి నేపథ్యంలో సమాచార భారతి సంస్థ శుక్రవారం హైదరాబాదులో పాత్రికేయులకు అందించిన పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఐవైఆర్ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత జర్నలిజం పోకడే మారిపోయిందన్నారు. ఇందులో మంచి, చెడూ రెండూ వున్నాయని, అయితే ఫేక్ న్యూస్ బాగా ప్రచారం అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక మరోవైపు కమ్యూనిస్టులు చాలా పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని, జాతీయవాదులు పూర్తిగా సంఘటితం కావడం ద్వారానే దానిని తట్టుకోగలమని కృష్ణారావు పేర్కొన్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు చాలా ఉన్నాయని, వాటిపట్ల జాగ్రత్తగా వుండాలని హెచ్చరించారు. వాటిని కౌంటర్ చేయాలంటే జాతీయవాదశక్తులు ఏకం కావాల్సిందేనని నొక్కి చెప్పారు. నారద జయంతి వంటి కార్యక్రమాల ద్వారా ఈ పనిని సమాచార భారతి చేస్తోందని ప్రశంసించారు. ఇక అన్ని యుగాలలోనూ నారదుడు ఉన్నారని పేర్కొంటూ రావణాసురుడు, నరకాసురుడు వంటి రాక్షసుల దగ్గరకు కూడా వార్తలు చెప్పడానికి నారదుల వారు వెళ్లారన్నారు. అయితే ఆ రాక్షసుల నుంచి నారదునికి బెదిరింపులు వుండేవి కావని, అదే నేటి ఆధునిక యుగంలో తమకు అనుకూలంగా రాయాలంటూ పాత్రికేయులను బెదిరించే రోజులు వచ్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అత్యంత బలంగా జాతీయ భావాల వ్యాప్తి: గోపాల్ రెడ్డి
జాతీయవాదులు, జర్నలిస్టులందరి కోసం సమాచార భారతి నడుస్తోందని సంస్థ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి అన్నారు. గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ ప్రముఖులను గుర్తించి, వారిని సత్కరిస్తూ వస్తున్నామని తెలిపారు. జాతీయవాదాన్ని ప్రచారం చేయడానికి సమాచార భారతి పనిచేస్తోందంటూ గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ భావాలను పెంపొందించడానికి లోకహితం పత్రిక కూడా కృషి చేస్తోందన్నారు. పత్రిక చిన్నదే అయినా… జాతీయ భావాలను అత్యంత బలంగా వ్యాప్తిచేస్తున్నామని గోపాల్ రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో సినిమా రంగంలో వున్న యువత టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి మూడేళ్లకొకసారి కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని తెలియజేసారు. మంచి సందేశాలుగల లఘు చిత్రాలను బలంగా వ్యాప్తి చేయడానికి ఈ వేడుక పనిచేస్తోందన్నారు. అలాగే గోల్కొండ లిటరరీ ఫెస్టివల్ అనే కార్యక్రమం ద్వారా సాహిత్య వ్యాప్తికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇది సోషల్ మీడియా యుగం అయినందున సోషల్ మీడియా సంగమం పేరుతో మీడియా కార్యశాలలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సమాచార భారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలకు సమాజం మద్దతివ్వాలని గోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
నారద జయంతి కార్యక్రమంలో భాగంగా సమాచార భారతి నారద పురస్కారం అందుకున్న పాత్రికేయులు….
శ్రీ యాబలురి సీతారామ శర్మ, శ్రీ గుళ్ళపూడి శ్రీనివాస కుమార్, డాక్టర్ చిరువోలు పార్థసారథి, శ్రీ కందికట్టు దుర్గా నరసింహారావు, శ్రీమతి పొన్నపల్లి నాగవాణి, శ్రీ గంగం మహేష్ రెడ్డి. పురస్కార ప్రదానం, సన్మానం అందుకున్న తర్వాత సన్మాన గ్రహీతలందరూ తమ స్పందనను తెలియచేశారు. చివరగా జనగణమన గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది.