Home Telugu అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహిస్తున్నపోలీసు హెడ్‌కానిస్టేబుల్‌

అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహిస్తున్నపోలీసు హెడ్‌కానిస్టేబుల్‌

0
SHARE

తెలిసిన వారికి సాయం చేయడం మంచితనం! తెలియని వారికీ సాయపడడం మానవత్వం!! మరి మరణించినది ఎవరైనా… మనవాళ్లే అనుకొని… అంతిమ సంస్కారం ఆత్మీయంగా చేయడం…? కచ్చితంగా కరుణాతత్త్వం! దేహం విడిచిన జీవిని అక్కున చేర్చుకునే అపర దైవత్వం.జీతాలు, ప్రాణాలు పెట్టి ఆ పని చేస్తున్న ఓ సామాన్య ప్రభుత్వ ఉద్యోగి, ఆయన కుటుంబం… నిజంగా దేవుళ్లే!

ఆయన మొబైల్‌ ఎక్కువగా చావు కబురే మోసుకొస్తుంది. పరుగున ఆయన అక్కడికి చేరుకుంటారు. పాడె సిద్ధం చేయిస్తారు. శవాన్ని దానిపై పడుకోబెట్టి పూలమాలలతో నింపేస్తారు. బండిపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్తారు. డప్పుల దరువుకు అనుగుణంగా శవం ముందు చిందేస్తారు. బాణాసంచా శబ్దాల నడుమ శ్మశానానికి చేరుకుని శాస్త్రోక్తంగా దింపుడు కళ్ళం నిర్వహిస్తారు. భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు పూర్తి చేసే ఆయనను చూస్తే, దగ్గరివాళ్ళెవరో పోయారని అనిపిస్తుంది. నిజానికి చనిపోయిన మనిషిని అంతకు మునుపు ఎన్నడూ ఆయన చూసి కూడా ఉండరు. అదొక బాధ్యత. అదొక ధర్మం. బతికి ఉన్నపుడు అండగా ఉండలేకపోయాం, కనీసం పోయాక అయినా అనాథగా ఎందుకు సాగనంపాలి అంటారు ఆయన. ఆయన పేరు కరుణాకరన. చిత్తూరు నగరంలో సాయుధ రిజర్వు పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.

ఏళ్ళ తరబడి చేస్తున్న సేవలతో కరుణాకరన పేరు చిత్తూరు నగర ప్రజలకు సుపరిచితం అయ్యింది. ‘అనాథ శవాల అంత్యక్రియల కోసం సంప్రదించండి’ అంటూ శ్మశానం గోడల మీద ఆయన మొబైల్‌ నంబరు ఉంటుంది. స్మశానంలో కర్మకాండలు జరుపుకునేందుకు ఆయన షెడ్‌ కూడా కట్టించారు. వంటల కోసం రెండు పొయ్యిలు, తాగునీటి వసతి కల్పించారు. వీటిని ఎవరైనా ఉచితంగా వాడుకోవచ్చు. అలాగే శవాల ‘దింపుడు కళ్ళం’ కోసం ప్రత్యేకంగా మరో షెడ్‌ కట్టించారు. దాని ముందు హరిశ్చంద్రుని విగ్రహం పెట్టి చిన్న గుడి కట్టించారు. శవాలను తీసుకెళ్ళేందుకు తోపుడు బండి తయారు చేయించారు. నగరంలోని తన స్వస్థలం సంతపేటలో నాగాలమ్మ గుడి కట్టించారు. ఈ గుణం ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది. చిత్తూరులోని సంతపేటలో ఆయన తండ్రి రాధాకృష్ణన టీ కొట్టు నడిపేవారు. డబ్బుకు పేదైనా ఎవరికి ఏ సాయం కావాల్సివచ్చినా చేయడానికి ముందుండేవారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎవరు చనిపోయినా ఆ ఇంటికెళ్ళి చేతనైన సాయం చేయమని కొడుక్కి పురమాయించేవారు. ఎందుకో ఏమిటో తెలియకపోయినా కరుణాకరన్‌ తండ్రి చెప్పినట్టే చేసేవారు. వయసు పెరిగే కొద్దీ చావుల సమయంలో ఆయా కుటుంబాలకు చేసే సాయం చిన్నదేమీ కాదని కరుణాకరన్‌కి అర్థమైంది. అదే జీవన మార్గంగా మారింది. విధి నిర్వహణలో కరుకుగా వుండే సాయుధ రిజర్వు పోలీసు ఉద్యోగం, ఆయన సేవా గుణంలో ఎటువంటి మార్పులూ తీసుకురాలేకపోయింది. పైగా డ్యూటీలో వున్నపుడు అనాథ శవాల సమాచారం వస్తే సహచరులు అతని స్థానంలో తాము డ్యూటీకి దిగి అతన్ని రిలీవ్‌ చేస్తుంటారు. అంత్యక్రియలకు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు.

కదిలించిన హిజ్రా మరణం

సంతపేటలో ఆనంద్‌ అనే హిజ్రా ఉండేవారు. పగలంతా పలు ఇళ్ళలో పాచి పనులు చేసి వారు పెట్టింది తిని రాత్రయితే ఓ పాడుబడిన సత్రంలో నిద్రించేవారు. 2008లో మధుమేహ వ్యాధితో చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. శవం ఆసుపత్రిలోనే వుండిపోయింది. డ్యూటీ నుంచీ ఇంటికొచ్చిన కరుణాకరన్‌కు వీధిలో గుంపుగా చేరిన ఆడవాళ్ళు కనిపించారు. ఆనంద్‌ మృతి గురించి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. భార్య దేవిని వెంట తీసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చనిపోయింది తన సోదరుడని రికార్డుల్లో రాయించి, సంతకాలు పెట్టి ఆనంద్‌ శవాన్ని సంతపేటకు తీసుకొచ్చారు. సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు చేశారు. ఇది చూసి వీధిలోని వారంతా కలసి వచ్చారు. శ్మశానానికి వెంట వెళ్ళారు. ఇది ఆయన తొలి అనాథ శవ సంస్కారం. ఇక నగరంలో ఏ అనాథ శవం కనిపించినా తన శక్తి మేరకు వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు చేస్తున్నారు. ఇప్పటి దాకా దాదాపు 150 అనాథ శవాలకు అంతిమయాత్ర జరిపారు. మృతి చెందినవారి కులం తెలిస్తే, వారి ఆచారాలకు అనుగుణంగానే అంత్యక్రియలు జరిపిస్తారు. ఆయన అంతిమ సంస్కారాలు జరిపించిన శవాలలో భిక్షగాళ్ళు, పిచ్చివాళ్ళ దగ్గర నుంచి శ్రీలంక రాజకుటుంబీకుల వారసుల వరకూ వున్నారు. శ్రీలంక రాజకుటుంబ వారసుడొకరు చిత్తూరు మండలం బీఎన్‌ఆర్‌ పేటలో అనాథగా ఉండి 2015లో చనిపోతే కరుణాకరనే దగ్గరుండి చేతనైనంత ఘనంగా శ్మశానానికి తరలించారు.

సంపాదనంతా సేవకే

ఏఆర్‌ హెడ్‌కానిస్టేబుల్‌గా కరుణాకరన్‌ జీతభత్యాలలో సింహభాగం సేవా కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్నారు. పాడె తయారీకి, పూలమాలలకు, డప్పులకు, గోతి తవ్వించేందుకు, ఇతర సామగ్రికి కనీసం మూడునాలుగు వేలు ఖర్చవుతుంది. ఒకే రోజు రెండు మూడు శవాలకు కూడా ఖనన క్రియలు జరిపిన ఉదంతాలున్నాయి. అయితే, స్నేహితులు, ఇతరులు సాయం చేయడానికి ముందుకు రావడంతో ఆయనకు కొంత వెసులుబాటుగా ఉంటోంది. ఇప్పుడు కరుణాకరన ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఒక సమూహంగా మారారు. ధనలక్ష్మి, మధుబాబు, రామభద్ర, రవీంద్రారెడ్డి, ఈశ్వర్‌, దైవ శిఖామణి వంటి ఎందరో ఆయన వెంట ఉంటున్నారు.

సంతపేటలో తగ్గిన రౌడీయిజం

ఒకప్పుడు చిత్తూరు సంతపేట రౌడీయిజానికి పేరుమోసింది. కరుణాకరన్ బృందం సేవా కార్యక్రమాలు ఆ ప్రాంతపు జీవనశైలిలోనే మార్పు తెచ్చాయి. రౌడీయిజం తగ్గుతూ వచ్చింది. సేవా కార్యక్రమాలను మరింతగా విస్తరించేందుకు ‘మాతృసేవా సమితి’ పేరిట స్వచ్చంద సంస్థను ఆయన ఏర్పాటు చేశారు. సంతపేటలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవలే అన్నదాన సత్రం మొదలైంది. కరుణాకరన్‌ కుటుంబ సభ్యులు భార్య దేవి, కుమార్తె జ్యోతిప్రియ, కుమారుడు సాయిధనుష్‌ కూడా ఆయన్నే అనుసరిస్తున్నారు. తండ్రికి వారసుడిగా అనాధ శవసంస్కారాలు నిర్వహించడానికి ఆయన కుమారుడు చిత్తూరులోనే ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కూతురు జీతం నుంచీ నెలనెలా కొంతమొత్తం ఇలాంటి పనులకు ఖర్చుపెట్టమని తండ్రికి పంపుతూ ఉంటుంది. ఓ చిరుద్యోగి అయిన కరుణాకరన్ పెద్ద బాధ్యతనే భుజానికెత్తుకుని విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

శివప్రసాద్‌, చిత్తూరు

(ఆంధ్ర జ్యోతి సౌజన్యం తో)