Home Telugu దక్షిణ ఆసియా దేశాలకు భారత్‌ కానుక గా జీశాట్‌-9 ఉపగ్రహం

దక్షిణ ఆసియా దేశాలకు భారత్‌ కానుక గా జీశాట్‌-9 ఉపగ్రహం

0
SHARE
  • సఫలమైన జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం
  • కక్ష్యలోకి చేరిన జీశాట్‌-9 ఉపగ్రహం
  • 12 ఏళ్లపాటు సార్క్‌ దేశాలకు సేవలు
  • నెరవేరిన నరేంద్ర మోదీ కోరిక
  • శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్‌, ప్రధాని, సోనియా అభినందనలు

అంతరిక్ష ప్రయోగాల్లో భారీ విజయంతో భారత ఘనకీర్తి మరోసారి రెపరెపలాడింది. పొరుగుదేశాలతో సహకారాన్ని మరింత బలోపేతం చేసే చిరస్మరణీయ ఘట్టం ఆవిష్కృతమైంది. అంతరిక్ష దౌత్యంలో నూతన అధ్యాయం ఆరంభమైంది. పొరుగుకు పెద్ద పీట అన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్ష సాకారమైంది. ఏడు దక్షిణాసియా దేశాలకు విస్తృత ప్రయోజనం చేకూర్చే జీశాట్‌-9 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం విజయవంతంగా ప్రయోగించింది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 వాహక నౌక(రాకెట్‌) ద్వారా ఈ ఉపగ్రహాన్ని దిగ్విజయంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ ఇందుకు వేదిక అయింది. గురువారం మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ 28 గంటల పాటు విజయవంతంగా కొనసాగింది. శుక్రవారం సాయంత్రం 4.57 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌09 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఇది 2,230 కిలోల బరువుగల జీశాట్‌-9 ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. జీఎస్‌ఎల్‌వీ వరుసలో ఇది 11వది. ఇందులో దేశీయంగా అభివృద్ధి పరిచిన క్రయోజెనిక్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఉపగ్రహం భారత్‌తో పాటు పొరుగు దేశాలకు సమాచార(కమ్యూనికేషన్‌) సేవలందించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో దీనికి రూపకల్పన చేసింది. ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ‘‘దక్షిణాసియా ఉపగ్రహాన్ని(జీశాట్‌-09) విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోలోని మీకు, మీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. తాజా ప్రయోగం ద్వారా దక్షిణాసియా దేశాల్లో సమాచార, ప్రసార రంగాల్లో అందుబాటులోకి వచ్చే విస్తృత సేవలు ఆయా దేశాల అభివృద్ధి అవసరాలను అందుకోవడానికి బాటలు పరుస్తాయి. ఈ ప్రాజెక్టుతో భారత్‌, దాని పొరుగుదేశాల మధ్య స్నేహం, సహకారం మరింత బలోపేతమవుతాయని నా ప్రగాఢ విశ్వాసం. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతికవేత్తలు, ప్రాజెక్టులో భాగస్వాములైన అందరికి నా శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరాల్లో ఇస్రో తన విజయపరంపరను కొనసాగించాలి’’ అని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇస్రో ఛైర్మన్‌ ఏ ఎస్‌ కిరణ్‌కుమార్‌కు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ‘‘తాజా ప్రయోగం పొరుగు దేశాలతో చరిత్రాత్మక బంధాలను బలోపేతం చేస్తుంది. సాంకేతిక, సమాచార రంగాల్లో సహకారానికి కొత్త దారులను తెరుస్తుంది’’అని సోనియా తన సందేశంలో తెలిపారు.

దక్షిణాసియా ఉపగ్రహం ప్రత్యేకతలు

  • జీశాట్‌-9 ఉపగ్రహంలో 12 కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి.
  • జీవితకాలం 12 ఏళ్లు. బరువు 2,230 కిలోలు.
  • ఉపగ్రహానికి రూ.235 కోట్లు వ్యయం చేశారు.
  • ఇలాంటి ఉపగ్రహాలను కేవలం జీఎస్‌ఎల్‌వీ వంటి రాకెట్లే భూ స్థిర కక్ష్యలోకి మోసుకెళ్తాయి.
  • సార్క్‌ ఉపగ్రహ సేవలను భారత్‌, అఫ్గానిస్థాన్‌ బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, మాల్దీవులు, శ్రీలంక దేశాలు అందుకోనున్నాయి.
  • పొరుగు దేశాలకు టెలికమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల్లో(టెలివిజన్‌, డీటీహెచ్‌, వీశాట్‌, టెలి ఎడ్యుకేషన్‌, టెలి మెడిసిన్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) ఈ ఉపగ్రహ సేవలు ఎంతోగానో ఉపయోగ పడనున్నాయి.
  • ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు ఇస్రో జీశాట్‌-9 ఉపగ్రహానికి రూపకల్పన చేసింది.

ప్రథమంగా విద్యుత్‌ చోదక వ్యవస్థ

ఇస్రో మొదటిసారిగా జీశాట్‌-9 ఉపగ్రహంలో విద్యుత్‌ చోదక వ్యవస్థ(ఎలక్ట్రికల్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌)ను వినియోగించింది. దీనివల్ల కక్ష్యలో ఉపగ్రహ స్థానాన్ని మార్చే అవకాశం ఉంటుంది. ఇది 75 మిల్లీ న్యూటన్ల శక్తిని ఉత్పత్తి చేయనుంది. జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం కవరేజీకి ఈ దఫా మీడియా ప్రతినిధులకు అవకాశం ఇవ్వలేదు.

(ఈనాడు సౌజన్యం తో )