- దారుణ, అమానవీయ, అత్యంత పాశవిక దాడిగా పేర్కొన్న కోర్టు
- అత్యంత అరుదైన కేసుగా భావిస్తున్నామని స్పష్టీకరణ
- రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు దోషుల తరపు న్యాయవాదుల వెల్లడి
నిర్భయ ఘటన యావద్భారతాన్నీ షాక్‌కు గురిచేసింది. సమాజంపై నమ్మకాన్ని నాశనం చేసిన అత్యంత అరుదైన ఘటన. ఇలాంటి కేసులకు మరణశిక్ష తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. బాధితురాలు ఆసుపత్రిలో మాట్లాడలేని అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నా సైగల ద్వారానే వెల్లడించిన మరణ వాంగ్మూలంపై ఎలాంటి సందేహాల్లేవు. సుఖాన్నిచ్చే వస్తువుగా బాధితురాలితో వ్యవహరించడం అత్యంత పాపిష్టితనం. – సుప్రీం ధర్మాసనం
యావద్భారతావనిని ఆగ్రహావేశాలకు గురిచేసిన అత్యంత జుగుప్సాకరమైన నిర్భయకేసులో హంతకులకు శుక్రవారం సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా.. పాశవిక, అమానవీయ, అత్యంత దుర్మార్గమైన దాడిగా జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం అభివర్ణించింది. నాగరిక సమాజాన్ని నాశనం చేసే సునామీ తరహా షాక్‌గా ఈ నేరాన్ని పేర్కొంది.
డిసెంబర్ 16, 2012 అర్ధరాత్రి దేశరాజధాని వీధుల్లో నడుస్తున్న బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేయటంతోపాటు అత్యంత పాశవికంగా వ్యవహరించిన ఈ నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు, ట్రయల్ కోర్టు నిర్ణయాలను సమర్థిస్తూ.. త్రిసభ్య ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషులైన ముకేశ్ (29), పవన్ (22), వినయ్ శర్మ (23), అక్షయ్ కుమార్ సింగ్ (31), ఓ బాలనేరస్తుడు, రాంసింగ్ (తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు)లు ఉన్మాదంగా బాధితురాలిని సుఖాన్ని అనుభవించే వస్తువుగానే పరిగణించారని కోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ ఆరుగురిలో అత్యంత క్రూరంగా వ్యవహరించాడని గుర్తించిన బాలనేరస్తుడు మూడేళ్ల జైలుశిక్ష అనంతరం జువెనైల్ హోమ్ నుంచి విడుదలయ్యాడు.
అత్యంత కిరాతకం.. డిసెంబర్ 16, 2012 నాటి ఘటనలో దోషుల చేతిలో బాధితురాలు అనుభవించిన ప్రత్యక్ష నరకాన్ని.. రక్తంతో తడిచిన ప్రతి క్షణాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. సామూహిక అత్యాచారం తర్వాత ఆమె జననాంగంలోకి ఇనుపరాడ్డును చొప్పించి అత్యంత పాశవికంగా వ్యవహరించారని తీర్పులో పేర్కొంది. అనంతరం బాధితురాలిని, ఆమె మిత్రుడిని నడుస్తున్న బస్సులోనుంచి కిందికి తోసేశారని.. వారిపైనుంచి బస్సును తీసుకెళ్లేందుకు యత్నించారని గుర్తుచేసింది.
ఈ కేసుకు సంబంధించి మార్చి 27 వరకు ఇరు వర్గాల వాదనలు విన్న ఈ ధర్మాసనం తీర్పును మే 5కు రిజర్వ్ చేసింది. జస్టిస్ మిశ్రా, జస్టిస్ భూషణ్‌ల తీర్పును జస్టిస్ మిశ్రా చదవగా, జస్టిస్ భానుమతి వేరుగా తన తీర్పు వెలువరించారు. అయితే ఈ ముగ్గురూ ఏకాభిప్రాయాన్ని వెల్లడించారు. ఘటన జరిగిననాటి పరిస్థితులతో పోలిస్తే.. దోషుల ప్రస్తుత పరిస్థితి (పేద కుటుంబాలు, చిన్న వయసువారే కావటం, జైల్లో సత్ప్రవర్తన, అందరికీ వివాహాలు అయి చిన్న పిల్లలుండటం వంటి అంశాలు)ని దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాల్సిన అవసరం లేదని ధర్మాసనం ఏకగ్రీవంగా స్పష్టం చేసింది.
సాక్ష్యాలను రూపుమాపే ప్రయత్నం..: తీర్పును చదివి వినిపించిన జస్టిస్ మిశ్రా.. ఈ ఘటన యావద్భారతాన్నీ షాక్‌కు గురిచేసిందన్నారు. సమాజంపై నమ్మకాన్ని నాశనం చేసిన అంత్యత అరుదైన ఘటనగా దీన్ని పేర్కొంటూ.. ఇలాంటి కేసులకు మరణశిక్ష తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదన్నారు. బాధితురాలు ఆసుపత్రిలో మాట్లాడలేని అత్యంత దుర్భరమైన ఆరోగ్య పరిస్థితిలో ఉన్నా సైగల ద్వారానే వెల్లడించిన మరణ వాంగ్మూలంపై ఎలాంటి సందేహాల్లేవని.. ఆనాటి అమానుషమైన ఘటనను కళ్లకు కట్టినట్లు తెలిపిందని తీర్పు ప్రతిలో పేర్కొన్నారు. బాధితురాలితోపాటు దోషుల డీఎన్‌ఏ పరీక్షలు కూడా కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను, ఘటనాస్థలంలో ఏం జరిగిందనే అంశాలను తేటతెల్లం చేసిందని ధర్మాసనం పేర్కొంది.
సీసీటీవీ దృశ్యాలు కూడా దోషుల ఘాతుకానికి అద్దంపడుతున్నాయంది. అత్యాచారం, అమానుషంగా ఐరన్‌రాడ్డు వినియోగంతోపాటుగా.. సాక్ష్యాలను రూపుమాపేందుకు బాధితురాలు, ఆమె మిత్రుడిపైనుంచి బస్సును తీసుకెళ్లి చంపేసే ప్రయత్నం కూడా విచారణలో బట్టబయలైందని తెలిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడ్డ నిర్భయ మిత్రుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని తొలి ప్రాసిక్యూషన్ సాక్ష్యంగా కోర్టు అంగీకరించిందని దీనిపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేసింది.
కేవలం సుఖాన్నిచ్చే వస్తువుగానే బాధితురాలితో వ్యవహరించటం అత్యంత పాపిష్టితనమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దోషుల ప్రస్తుత పరిస్థితిని కారణంగా చూపి.. దారుణమైన ఘటనను మరిచిపోయేలా చేయలేరన్నారు. మరణశిక్షనుంచి తప్పించాలంటూ దోషులు చేసిన అప్పీలు.. దేశం మనస్సాక్షినే ఆశ్చర్యపోయేలా చేసిందన్నారు. మహిళలపై అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్భయ కేసు కనువిప్పుకానుందన్నారు.
మరణశిక్షే సరి.. పోలీసులు: శిక్ష తగ్గించాలంటూ దోషులు వేసిన పిటిషన్‌తోపాటుగా కింది కోర్టులు వేసిన శిక్షపైనా ఈ ధర్మాసనం విచారణ జరిపింది. అయితే.. నిర్భయ దోషులకు మరణశిక్షే సరైందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. కోర్టుకు అమికస్ క్యూరీగా వ్యవహరించిన న్యాయవాది సంజయ్ హెగ్డే.. ఘటన తీవ్రమైనదేనని అంగీకరిస్తూనే.. సాక్ష్యాల్లో యథార్థం లేనందున మరణశిక్షనుంచి తప్పించాలని సూచించారు.
వికృత మనఃస్థితి
‘ఆమెతో రాక్షసత్వంతో దోషులు వ్యవహరించిన తీరు, ఆమె అస్తిత్వం, గౌరవానికి తూట్లు పొడిచిన తీరు ఊహించేందుకే బాధాకరం. మానవత్వం, మంచితనం మచ్చుకైనా కనిపించని మరో ప్రపంచంలో జరిగిన కథలాగా తోస్తుందీ ఘటన. తీవ్ర లైంగిక వాంఛ, హింసాత్మక ధోరణి, ఉన్మాదంతో ఊగిపోయే పరిస్థితి ఏం చేయకూడదో ఆలోచించుకునేందుకు కూడా మనస్సాక్షికి సమయం ఇవ్వలేవు. వికృత మనఃస్థితి, అదుపులేని పశువాంఛ వారిని సభ్యసమాజాన్ని నివ్వెరపరిచే ఈ దారుణకృత్యానికి ఉసిగొల్పాయి.
ఈ ఘటన యావదర్భారతాన్నీ షాక్‌కు గురిచేసింది. మన సమాజవ్యవస్థలో విధ్వంసం సృష్టించింది. ఘటన జరిగిన నాటి దారుణమైన పరిస్థితులను బట్టి చూస్తే.. దోషులకు ఉపశమనం కల్గించాలనుకోవటం లేదు. అందుకే మేము (ముగ్గురు సభ్యుల ధర్మాసనం) ఏకగ్రీవంగా ఉపశమన చర్యలుండకూడదని నిర్ణయించాం. హైకోర్టు తీర్పుతో విభేదించే కారణాలేమీ కనిపించనందున ఆ నలుగురికి మరణశిక్షను ఖరారుచేస్తున్నాం’
రెండో ఆలోచనే లేదు
‘కిందికోర్టులు నిర్ణయించినట్లుగా దోషులకు మరణశిక్షనుంచి తప్పించటాన్ని సమర్థించేందుకు, వారి శిక్షను తగ్గించేందుకు నా దగ్గర కారణాలేమీ లేవు. అత్యంత కిరాకతంగా చేసిన ఈ నేరం మహాపరాధమే. మనుషుల్లో శృంగారవాంఛ రాక్షసత్వంగా మారకూడదు. దోషులు కరడుగట్టిన నేరస్తులు కాకపోవచ్చు. కానీ నిస్సహాయురాలిపై నడుస్తున్న బస్సులో సామూహికంగా అత్యాచారం చేయటమే కాకుండా.. బాధితురాలి జననాంగంలో ఇనుపరాడ్డును చొప్పించి కిరాతకంగా వ్యవహరించారు.
శీతాకాలంలో బాధితులిద్దరినీ నగ్నంగా బస్సులోంచి రోడ్డుపైకి విసిరేశారు. ఇది యావత్ భారత సమాజ మనస్సాక్షినే కుదిపేసింది. అందుకే ఇది అత్యంత అరుదైన ఘటన. ఇలాంటి కేసుల్లో శిక్ష విధించే విషయంలో రెండో ఆలోచనే ఉండకూడదు. సామూహిక అత్యాచారం చేయటం వంటివాటి కారణంగా కేసును అత్యంత అరుదైన కేటగిరిగా భావించలేమా? అందుకే ధర్మాసంలో మెజారిటీ సభ్యుల తీర్పుకు మద్దతు తెలుపుతున్నాను’
సమీక్ష కోరతాం!
యావద్దేశం ఒత్తిడికి సుప్రీంకోర్టు తలొగ్గి మరణశిక్ష తీర్పునిచ్చిందని దోషుల న్యాయవాదులు ఏపీ సింగ్, ఎంఎల్ శర్మ తెలిపారు. తీర్పుపై సమీక్షను కోరుతూ రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. ‘ఈ తీర్పు మానవహక్కులను కాలరాయటమే. అయినా మాకు సుప్రీంకోర్టుపై నమ్మకం ఉంది. ఈ నలుగురూ పేద కుటుంబాలనుంచి వచ్చిన వాళ్లే. వారికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు.
తీర్పుపై తుదిదాకా ఉత్కంఠ
కిక్కిరిసిన కోర్టు గది.. మధ్యాహ్నం 2.01 గంటలకు ముగ్గురు జడ్జీలు ధర్మాసనంపైకి చేరుకున్నారు. ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం.. ఇంతలో జస్టిస్ మిశ్రా మాట్లాడుతూ.. రెండు వేర్వేరు తీర్పులు వెలువరిస్తామని చెప్పడంతో తీర్పుపై ఉత్కంఠ మరింత పెరిగింది. జస్టిస్ భూషణ్ తీర్పును కూడా తానే చదువుతానని, జస్టిస్ భానుమతి వేరుగా తీర్పు ప్రకటిస్తారని జస్టిస్ మిశ్రా వెల్లడించారు. ఆయన తీర్పు చదువుతుండగా కోర్టులో గదిలో అందరూ ఊపిరి బిగబట్టారు. 17వ నిమిషంలో తీర్పులో కీలక అంశాన్ని జస్టిస్ మిశ్రా చదివి వినిపించారు.
ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ మరణశిక్షను ఖరారుచేస్తున్నట్లు ప్రకటించారు. హైకోర్టు సరిగానే మరణశిక్ష ఖరారుచేసిందని, ఆ తీర్పుతో విభేదించే కారణాలు ఏవీ కనిపించడం లేదని చెప్పగా కోర్టు రూంలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. మధ్యాహ్నం 2.18 గంటలకు జస్టిస్ మిశ్రా, జస్టిస్ భూషణ్‌లు 315 పేజీల తీర్పు కాపీలపై సంతకం చేశారు. అనంతరం జస్టిస్ ఆర్. భానుమతి తన ప్రత్యేక తీర్పును చదివి వినిపిస్తూ తీర్పుతో ఏకీభవించారు. జడ్జీలు లేచి వెళ్లిపోతుండగా… గ్యాలరీలో నుంచి ఒక మహిళ గట్టిగా అరుస్తూ… ముందుగా దోషుల జననాంగాల్ని తొలగించాలని నినాదాలు చేసింది.
ప్రశాంతంగా నిద్రపోతాం: నిర్భయ తల్లిదండ్రులు
నిర్భయ తల్లిదండ్రులు.. సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఐదేళ్లుగా దోషులకు మరణశిక్ష పడాలని కోరుకుంటున్నామని.. కాస్త ఆలస్యమైనా చివరకు న్యాయమే గెలిచిందన్నారు. కోర్టు తీర్పు వెలువరించగానే బయటకు వచ్చిన నిర్భయ తండ్రి బద్రీనాథ్ సింగ్ ‘నేను ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతా. తను (నిర్భయ) బతికుంటే మే 10న 28 ఏళ్లు పూర్తయ్యేవి. నేటి తీర్పు ఆమెకు కానుక’ అని తెలిపారు. నిర్భయ కేసులో తీర్పు బాధితులకు మనోధైర్యాన్ని కల్పిస్తాయని సింగ్ తెలిపారు. ఐదేళ్లలో తన కూతురిని తలచుకోలేని క్షణమే లేదని నిర్భయ తల్లి ఆశాదేవి గుర్తుచేసుకున్నారు.
‘నేను అలసిపోయి.. ఈ పోరాటాన్ని ఆపేద్దామనుకున్నపుడల్లా.. నా కూతురు గుర్తొచ్చి నా కర్తవ్యాన్ని గుర్తుచేసేది’ అని ఆమె తెలిపారు. సుదీర్ఘ విచారణల అనంతరం న్యాయమే గెలిచిందన్నారు. క్లిష్టపరిస్థితుల్లోనూ తమకు అండగా నిలిచిన అందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘కూతుర్ని కోల్పోయినప్పటికీ.. ఆమెతో కిరాతకంగా వ్యవహరించిన వారికి కోర్టు మరణశిక్ష విధించటం సంతోషంగా ఉంది’ అని ఆశాదేవి వెల్లడించారు.
కాగా, యూపీలోని నిర్భయ సొంత గ్రామం మేడావర్ కాలాలో గ్రామస్తులు సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తంచేస్తూ శివుడికి పూజలు నిర్వహించారు. కాగా, అత్యాచార కేసుల్లో బాధితుల అసలు పేరు, ఫొటో ప్రచురించకూడదని నిబంధలున్నాయి. కానీ నిర్భయ ఘటన తర్వాత బాధితురాలు పేరు, ఫొటో సామాజిక మాధ్యమంలో, పలు పేపర్లలో కనిపించింది. అయితే తన కూతురిని నిర్భయగా కాకుండా జ్యోతిపాండే అనే పిలవాలని ఆమె తల్లి ఆశాదేవి గతంలోనే పలుమార్లు కోరారు.
‘నిర్భయ’ కేసులో ఎప్పుడేం జరిగింది?
- 16 డిసెంబర్, 2012: ఢిల్లీలో కదులుతున్న ప్రైవేటు బస్సులో ఓ పారామెడికల్ విద్యార్థినిపై ఆరుగురు పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, తీవ్రంగా గాయపరిచారు. ఆమె స్నేహితుడిని కూడా కొట్టి, ఇద్దర్నీ బస్సులోంచి తోసేశారు. బాధితులను పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసత్పికి తరలించారు.
- 17, 18 డిసెంబర్, 2012: దుండుగులను శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా నిరసన. బస్సు డ్రైవర్ రామ్‌సింగ్, అతని సోదరుడు ముఖేశ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల అరెస్ట్
- 21–22 డిసెంబర్ 2012: మరో నిందితుడైన మైనర్ ఢిల్లీలో, ఆరో నిందితుడు అక్షయ్ ఠాకూర్ బిహార్‌లోని ఔరంగాబాద్‌లో అరెస్ట్
- 26 డిసెంబర్, 2012: బాధితురాలి పరిస్థితి విషమించడంతో సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ హాస్పిటల్‌కు తరలింపు
- 29 డిసెంబర్, 2012: బాధితురాలి మృతి. హత్యాభియోగాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు
- 2 జనవరి, 2013: కేసుపై త్వరితగతిన విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు(ఎఫ్‌టీసీ)ను ఏర్పాటు చేసిన సీజేఐ జస్టిస్ ఆల్తమస్ కబీర్
- 3 జనవరి, 2013: మైనర్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై హత్య, హత్యాయత్నం గ్యాంగ్‌రేప్, దోపిడీ తదితర నేరాల కింద చార్జిషీట్ దాఖలు
- 17 జనవరి, 2013: ఐదుగురిపై ఎఫ్‌టీసీలో విచారణ ప్రారంభం
- ఫిబ్రవరి 2013: ఐదుగురిపై ఎఫ్‌టీసీ కోర్టు, మైనర్‌పై జువెనైల్ జస్టిస్ బోర్డు అభియోగాల నమోదు
- 11 మార్చి, 2013: తీహార్ జైల్లో రాంసింగ్ ఆత్మహత్య
- 22 ఆగస్టు, 2013: రాంసింగ్ మినహా నలుగురు నిందితులపై ఎఫ్‌టీసీలో తుది వాదనలు ప్రారంభం
- 31 ఆగస్టు, 2013: గ్యాంగ్‌రేప్, హత్య అభియోగాలపై మైనర్‌ను దోషిగా తేల్చి, అతణ్ని దిద్దుబాటు కేంద్రంలో మూడేళ్లు ఉంచాలని ఆదేశించిన జేజేబీ
- 10 సెప్టెంబర్, 2013: ముఖేశ్, వినయ్, అక్షయ్, పవన్‌లను హత్య, గ్యాంగ్‌రేప్ తదితర 11 నేరాల కింద దోషులుగా తేల్చిన ఎఫ్‌టీసీ
- 13 సెప్టెంబర్, 2013: నలుగురు దోషులకూ మరణ
- శిక్ష విధించిన కోర్టు
- 13 మార్చి, 2014: మరణశిక్షను ఖరారు చేసిన ఢిల్లీ హైకోర్టు
- 15 మార్చి, 2014: ముఖేశ్, పవన్‌లకు శిక్ష అమలుపై కోర్టు స్టే. తర్వాత మిగతా ఇద్దరికి శిక్ష అమలుపైనా స్టే
- 15 ఏప్రిల్, 2014: బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని సమర్పించాలని పోలీసులకు సుప్రీం కోర్టు ఆదేశం
- 3 ఫిబ్రవరి, 2017: దోషులకు మరణశిక్షపై తాజాగా వాదనలు వింటామన్న కోర్టు
- 27 మార్చి, 2017: దోషుల అప్పీళ్లపై తీర్పు రిజర్వు
- 5 మే, 2017: నలుగురు దోషులకు మరణశిక్ష ఖరారు
అభియోగాలు
- హత్య
- సామూహిక అత్యాచారం
- హత్యాయత్నం
- కిడ్నాప్
- అసహజ నేరాలు
- దోపిడీ
- దోపిడీలో గాయపరచడం
- సాక్ష్యాల విధ్వంసం
- నేరపూరిత కుట్ర
- ఉమ్మడి నేర ఉద్దేశం
తీర్పుపై ఎవరేమన్నారు..
న్యాయం జరిగింది
మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషిచేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది. గౌరవం, మర్యాద, హుందాతనంతో జీవించే హక్కు ప్రతి భారత ఆడబిడ్డకు ఉంది. వాటిని ఆమె పొందేలా అందరూ చూడాలి. లైంగిక హింసపై పోరాడే ప్రతి మహిళకు నిర్భయ స్ఫూర్తిగా నిలుస్తారు . –కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ
ఉరిశిక్ష ఉన్నందుకు సంతోషం
తీర్పు న్యాయపాలన విజయం. దేశ న్యాయ వ్యవస్థలో ఈరోజు చాలా గొప్పది. ఈ కేసుపై ప్రజల్లో ఎంతో ఆందోళన, ఉత్కంఠ ఉండేవి. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించే చట్టాలు మన దేశంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.. – కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్
క్రూరత్వం ఒకేలా ఉన్నా.. తీర్పులో తేడా!
ఢిల్లీ గ్యాంగ్‌రేప్ కేసు నిందితులకు మరణశిక్షపై కొందరు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. మరణశిక్షను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సీనియర్ న్యాయవాది రెబెక్కా జాన్ మాట్లాడుతూ.. మరణశిక్షతో నేరాల్ని నివారించలేమన్నారు. నిర్భయ కేసు, గర్భవతి బిల్కిస్ బానో(గుజరాత్) కేసుల్లో న్యాయవ్యవస్థ అవలబించిన విధానాల్లో తేడాల్ని గమనించాలన్నారు. ‘బానో కేసులో తీవ్రతను తగ్గించే పరిస్థితులు ఏం ఉన్నాయి? ఆమె తన గర్భస్థ శిశువును కోల్పోయింది. రాయితో తలను ఛిద్రం చేశారు. కొన్ని నేరాల్లో క్రూరత్వం ఒకేలా ఉన్నా వేర్వేరుగా పరిగణించడం ఆందోళనకరం’ అని పేర్కొన్నారు.
బాలీవుడ్ హర్షం
తీర్పుపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందని, దోషులను బహిరంగంగా ఉరితీయాలని నటుడు రిషీ కపూర్ ట్వీట్ చేశారు. ఇకపై నిర్భయ తల్లికి కన్నీళ్లుండవని రవీనా టాండన్, తీర్పు మన సమాజంలోని మానవ మృగాలకు చెంపపెట్టని దియా మీర్జా అన్నారు.
(సాక్షి సౌజన్యంతో)