Home News రక్తదాహం తీరని దాయాది దేశం

రక్తదాహం తీరని దాయాది దేశం

0
SHARE

‘ఇస్లామిక్ రాజ్యం’గా ఏర్పడ్డ పాకిస్తాన్ అదే మతధర్మ సూత్రాలకు, మానవతా విలువలకు భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రపంచానికే మాయనిమచ్చగా మిగిలిపోతోంది. ‘షరియా’ (ఇస్లామిక్ న్యాయ వ్యవస్థ) ఆధారంగా ఆ మత సంప్రదాయాలు, విధి విధానాలు జరుగుతాయి. ‘ఉలేమా’ (ఇస్లాం మత పెద్దలు) ప్రవచించిన ‘్ఫఖ్’ (ఇస్లామిక్ న్యాయ మీమాంస) ఆధారంగా షరియా కొనసాగుతున్నది. దీని ఆధారంగానే ‘ఇస్లామిక్ వార్ జ్యురిస్‌ప్రుడెన్స్’ (ఇస్లామిక్ యుద్ధ న్యాయ మీమాంస) ఏర్పడింది. యుద్ధ సమయాల్లో ముస్లింలు అనుసరించాల్సిన విధి విధానాలను ఇందులో తెలియజేస్తారు. మదీనాలో తొలి ఇస్లామిక్ రాజ్యం ఏర్పడినప్పుడు మహ్మద్ ప్రవక్త మొదటిసారిగా యుద్ధనీతిని ప్రకటించాడు. ‘ఖురాన్‌‘ (ఇస్లాం పవిత్ర మతగ్రంధం) ‘హదిత్’ (సంప్రదాయాలు, మతప్రవక్త ఉపదేశాల ఆధారంగా ఏర్పడ్డ సంకలనం) ల్లో ఈ యుద్ధనీతిని నిర్దేశించారు.

ఆత్మరక్షణ కోసమే యుద్ధం చేయాలి. ఎటువంటి సమయాల్లో కూడా క్షమించే గుణాన్ని ప్రదర్శించాలి. మహ్మద్ ప్రవక్త యుద్ధ సమయాల్లో అనసరించాల్సిన విధి విధానాలను మొదటి ఖలీఫా అబూబకర్ సంకలనం చేశాడు. మస్లింల సైన్యానికి మహ్మద్ ప్రవక్త పది ఆదేశాలను ఇచ్చాడు. యుద్ధ సమయాల్లో లూటీలు,ద్రోహం, మోసాలు చేయకూడదు. ధర్మమార్గం విడననాడరాదు. మృతుల శరీరాల నుండి తలలు వేరు చేయరాదు. పసిపిల్లలను, ఆడవారిని, వృద్ధులను సంహరించరాదు. వృక్షాలను ముఖ్యంగా పండ్లు ఇచ్చే చెట్లను నాశనం చేయకూడదు. ప్రత్యర్థుల పశుపక్ష్యాదులను చంపరాదు. ఆధ్యాత్మిక చింతనతో కాలం వెళ్లబుచ్చుతున్న వారి జోలికి వెళ్లరాదు. యుద్ధ సమయాల్లో శత్రుసైన్యాలకు మంచినీళ్లు అందకుండా చూడడాన్ని ఇస్లాం అంగీకరించదని స్పష్టంగా పేర్కొన్నారు.

ఖురాన్ ప్రకారం ముస్లింలు ప్రకటిత యుద్ధం మాత్రమే చేయాలి. యుద్ధ సన్నాహాలకు ముందుగానే యుద్ధ ప్రకటన చేయాలి. ఆకస్మిక దాడులు, దొంగదాడులు ఇస్లాంకు వ్యతిరేకం. యుద్ధసమయాల్లో అనివార్యమైన పరిస్థితుల్లో తప్ప శత్రువులను తగలబెట్టడం, నీటిలో ముంచడం వంటివి చేయరాదు. ఎట్టి పరిస్థితుల్లోను మృతుల శరీరాలను ఖండించరాదు. జన నివాసాలపై దాడులు జరపడం ఇస్లాంకు వ్యతిరేకం. యుద్ధ ఖైదీలు ఏ మత ఆరాధకులైనప్పటికీ వారిని చంపరాదు. ఖురాన్‌లో చెప్పిన ధర్మసూత్రాలన్నింటినీ పాకిస్తాన్ పాలకులు ఉల్లంఘించారు. ఇదంతా ఇస్లాం మత ఉద్ధరణకేనని ప్రపంచాన్ని నమ్మబలికే ప్రయత్నం చేయడం ప్రజలందరినీ మోసం చేయడమే.

జమ్ము- కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణఘాటి సెక్టార్‌లో పాకిస్తాన్ సైనికులు చేసిన దుశ్చర్యలు మానవత్వానికే కళంకం తెస్తున్నాయి. పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం (బిఏటి) దళాలు సరిహద్దులు దాటి మన దేశంలోకి చొరబడి సిఖ్ రెజిమెంట్‌కు చెందిన 42 ఏళ్ల నాయబ్ సుబేదార్ పరంజిత్ సింగ్, సరిహద్దు భద్రతా దళానికి చెందిన 45 ఏళ్ల ప్రేమ్ సాగర్‌ను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి చంపివేశారు. మన వీరజవాన్ల తలలు కోసి తమ వెంట తీసుకువెళ్లారు. పాకిస్తాన్ ప్రభుత్వం తమ సైన్యంతో, పైశాచిక ప్రవృత్తి కలిగిన వారితోపాటు తాలిబాన్, జిహాదీ తీవ్రవాదులను కొంతమందిని కలగలిపి బోర్డర్ యాక్షన్ టీంను తయారుచేసింది. రెండు ప్రధాన లక్ష్యాలతో ఇది పనిచేస్తోంది. భారత్‌లోకి చొరబాట్లను ప్రోత్సహించడం, ఆ చొరబాటుదార్లకు రక్షణ వలయాలు ఏర్పాటు చేయడం. జిహాదీ ముష్కరులను భారత్‌లోకి ప్రవేశపెట్టడం, వారు మన సైనిక స్థావరాలు, సామాన్య జనాలపై దాడి జరిపిన తరువాత తిరిగివెనక్కు రప్పించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం. గుంపులు గుంపులుగా మన అడ్వాన్స్‌డ్ పోస్టులపై దాడి చేసి, మన సైనికులను ఎత్తుకెళ్లి చిత్రహింసలకు గురి చేసి చంపివేయడం, మన ఆయుధాలను ఎత్తుకెళ్లడం వంటి కిరాతక చర్యలను పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహిస్తోంది. కృష్ణఘాటి ఘటనను పాక్ సైనికుల దుందుడుకు చర్యగా భావించరాదు. ఆ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే భారత్‌పై చేస్తున్న ప్రత్యక్ష యుద్ధంగానే దీన్ని పరిగణించాలి.

పాక్ సైనికులతోపాటు ముజాహిదీన్ల దళం ఒకటి భారత్‌లోకి దాదాపు 250 మీటర్లు చొచ్చుకువచ్చింది. ఈ చొరబాట్లు జరుగుతున్న వేళ మిగిలిన పాకిస్తాన్ సైనికులు పెద్దఎత్తున కాల్పులు జరిపారు. ఒక అంచనా ప్రకారం పాకిస్తాన్ సైనికులు దాదాపు 50 రాకెట్లను, పెద్దఎత్తున మోర్టార్లతోపాటు దట్టమైన పొగ వలయాలను కూడా ప్రయోగించారు. దాడి పూర్తయ్యాక ఆ సైనికులు పూంచ్ సెక్టార్‌ను వదిలిపెట్టారు. వెడుతూ వెడుతూ భారత జవాన్ల తలలను బహుమతులుగా తీసుకువెళ్లారు. ఇలాంటి దాడులకు పాక్ సైనికాధికారి జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా ముందుగానే ఆమోదం తెలిపాడు. బాజ్వా ఏప్రిల్ 30న హాజీపీర్ ప్రాంతంలో పర్యటించి ఈ దాడులకు పచ్చజెండా ఊపాడు. 17 ఏప్రిల్ 2017న భారత సైనికులు జరిపిన ఆత్మరక్షణ కాల్పుల్లో 7 నుంచి 10 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఇందుకు ప్రతీకారంగా కృష్ణఘాటిలో దాడులు జరపాలని పాక్ ఆర్మీ చీఫ్ ఆదేశించాడు. దొరికిన భారతీయులను చిత్రహింసల పాలు చేసి, హతమార్చాక ఖండిత శరీరాలను అప్పగించడం పాకిస్తాన్‌కు అలవాటు చర్యగా మారిపోయింది. గతంలోనూ పాక్ సైనికులు మన సైనికులను చంపి వారి కళ్లు, మర్మాంగాలను పెరికి, కుత్తుకలు కోసి తమ పైశాచికతత్వాన్ని చాటుకున్నారు.

21 అక్టోబర్ 1950న యుద్ధ ఖైదీల విషయమై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో ఒక తీర్మానాన్ని ప్రపంచ దేశాలు ఆమోదించాయి. యుద్ధ ఖైదీలకు గౌరవ మర్యాదలు, హక్కుల విషయమై వారిని బందీలుగా పట్టుకున్న దేశాలు అనుసరించాల్సిన విధి విధానాల గురించి క్షుణ్ణంగా ఇందులో పేర్కొన్నారు. యుద్ధ ఖైదీలకు ఎటువంటి అమర్యాద జరిగినా అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తందని స్పష్టం చేసారు. ఇదే తీర్మానంలో యుద్ధ ఖైదీలకు రక్షణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరిని మానవతా దృక్పథంతో చూడాలని, ప్రాణహాని జరగకుండా శరీరానికి గాయాలు కాకుండా చూడాలని ప్రపంచ దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తమ అధీనంలో బందీకి ప్రాణహాని జరిగినా గాయాలు ఏర్పడినా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టే. బందీలకు అవయవ లోపం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేశాలదే. వీరిని ఎటువంటి శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు వినియోగించకూడదు. వీరిపై హింసాత్మక చర్యలు జరపడం, అవమానించడం, వేధింపులు, ఒత్తిడులకు గురి చేయడం కుదరదు. యుద్ధ ఖైదీల భద్రతకు తగిన వాతావరణాన్ని ఆయా ప్రభుత్వాలే ఏర్పాటు చేయాలి. ఇటువంటి అంతర్జాతీయ తీర్మానాలను, సంప్రదాయాలను పాకిస్తాన్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. భారత్‌పై ఏకపక్ష యుద్ధాన్ని ప్రకటించింది. భారత్ నుండి ఎటువంటి దాడులు లేకున్నా, కవ్వింపు చర్యలకు పాల్పడి దొంగచాటు దెబ్బలు తీస్తూ మన సైనికులను ఎత్తుకెళ్లింది. రాతియుగం నాటి అనాగరిక చర్యలకు దిగజారి తను హింసోన్మాదాన్ని తీర్చుకోవడానికి భారత సైనికులను వాడుకోవడం సహించరాని చర్య.

పెద్దనోట్లను రద్దు చేస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 నవంబర్‌లో తీసుకున్న నిర్ణయం తీవ్రవాదులతోపాటు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసింది. భారత కరెన్సీ దొంగనోట్ల ముద్రణ, సరఫరా ద్వారా పాక్ ప్రభుత్వం గణనీయంగా ఆదాయం పొందేది. ఇలా సంపాదించే ధనాన్ని తీవ్రవాద కార్యక్రమాలకు ఖర్చుపెడుతూ మన దేశాన్ని అన్ని రంగాల్లోను అస్థిరత్వం చేసేందుకు ప్రయత్నించింది. మన దేశంలో పెద్దనోట్లు రద్దు కావడంతో తీవ్రవాదులకు నిధుల సరఫరా ఆగిపోయింది. కాశ్మీర్ లోయలో మన సైనికులపై రాళ్లు విసిరిన వారికి 500 రూపాయల చొప్పున రోజుకూలి చెల్లించేవారు. తీవ్రవాదులపై ఎన్‌కౌంటర్లు జరుపుతున్నప్పుడు మన బలగాలను నిరోధించేవారికి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు అందేవి. పెద్దనోట్ల రద్దు తర్వాత నిధులు అందక కొంత కాలంపాటు కాశ్మీర్ లోయలో రాళ్ల దాడులు ఆగిపోయాయి. పాకిస్తాన్ సంరక్షణలో పని చేస్తున్న తీవ్రవాద సంస్థలు దిక్కుతోచని స్థితిలో డబ్బుల కోసం వెంపర్లాడవలసిన పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో తీవ్రవాదులు కాశ్మీర్ లోయలో బ్యాంక్ దోపిడీలు మొదలుపెట్టారు. లోయలో ఆయుధాలు ఎత్తుకెళ్లడం కొత్తేమీ కాదు. ఇప్పుడు కొత్తగా బ్యాంక్ దోపిడీలు మొదలుపెట్టారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు తీవ్రవాదులు తొమ్మిది బ్యాంకులు లూటీ చేసి దాదాపు 50 లక్షల రూపాయల కొత్త కరెన్సీని దోచుకున్నారు. గత ఏడాది నవంబర్ 21న బద్గాం జిల్లా చరారే షరీఫ్ బ్యాంక్ లూటీ సంఘటనలో లష్కర్ ఏ తోయిబా తీవ్రవాద సంస్థ చెందిన నలుగురు పట్టుబడ్డారు. తీవ్రవాదులకు మద్దతుగా పనిచేస్తున్న వారి ఖర్చుల నిమిత్తం, వాహనాలు, దుస్తులు ఇతరత్రా అవసరాల కోసం డబ్బులు అవసరం. ఇప్పటివరకూ పాకిస్తాన్ ఈ అవసరాలు తీరుస్తూ వచ్చేది. పెద్దనోట్ల రద్దు తరువాత డబ్బు సరఫరా ఆగిపోవడంతో పాక్ ప్రేరిత తీవ్రవాద సంస్థలు మన బ్యాంకులనే లూటీ చేసి మన దేశంపైనే యుద్ధం ప్రకటిస్తున్నాయి.

ఏయే పనులైతే ప్రపంచ శాంతికి భంగం చేస్తాయో, ఏ చర్యల కారణంగా మానవాళి సిగ్గుతో తలదించుకుంటుందో- అలాంటి చర్యలను, పనులకు పాక్ చేస్తోంది. తీవ్రవాదులను అండగా చేసుకుని అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నది. తీవ్రవాదానికి నిధులు సమకూర్చేందుకు అన్నిరకాల సమాజ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నది. మత్తుమందుల రవాణా, అక్రమ ఆయుధ వ్యాపారం, అమ్మాయిల అమ్మకం, దొంగనోట్ల ముద్రణ, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, మాఫియా, అరాచక శక్తులను ప్రోత్సహించడం, తీవ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసి సాయుధ శిక్షణ ఇవ్వడం లాంటి అమానవీయ చర్యలను నిస్గిగ్గుగా , అధికారికంగా నిర్వహిస్తూ దానికి ‘ఇస్లాం రంగు’ పులుముతోంది. ఆ చర్యల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రపంచ శాంతికి, సమృద్ధికి విఘాతంగామారిన జిహాదీ తీవ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిన పాకిస్తాన్ ఇప్పటికే ప్రపంచ దేశాల మధ్య ఏకాకిగా మారింది. భారత జవాన్లను కిరాతకంగా హత్య చేసిన తరువాత ప్రపంచ దేశాలు పాకిస్తాన్ పట్ల మరింత కఠిన వైఖరిని చూపిస్తున్నాయి. భారత జవాన్ల త్యాగాలు పాకిస్తాన్‌ను నియంత్రించి, ప్రపంచశాంతికి సోపానాలుగా మారతాయి.

కామర్సు బాలసుబ్రహ్మణ్యం, సెల్: 09899 331113

(ఆంధ్రభూమి సౌజన్యంతో)