Home Telugu గోవును వధిస్తే నాన్‌బెయిల్‌బుల్ కేసు

గోవును వధిస్తే నాన్‌బెయిల్‌బుల్ కేసు

హై కోర్ట్ సంచలన ఆదేశాలు; ఐపిసి సెక్షన్ సవరణకు తెలుగు రాష్ట్రాలకు నెల గడువు

0
SHARE

గోవులు, పశుగణాలను వధించినా, గాయపరిచినా నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్ 429కు సవరణలు చేయాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. ఐపిసి సెక్షన్‌కు సవరణలు చేసే విధంగా ఒక నెల రోజులు గడువు ఇచ్చింది. జూలై 7వ తేదీలోగా రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించాలని కోరింది.

ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు 2014 సెప్టెంబర్‌లోనే గోవధ, పశువులను వధించిన కేసులో నిందితులపై నాన్‌బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయాలని, ఐపిసి 429కు సవరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోవధకు సంబంధించి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో ఆరోగ్యకరమైన ఆవు అనారోగ్యకరంగా ఉందని తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన వెటర్నరీ వైద్యులపైన కూడా క్రిమినల్ కేసులు, నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసే విధంగా ఏపి గోవధ నిషేధం చట్టం 1977 సెక్షన్ 10నిబంధను చేర్చాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో ఎటువంటి పురోగతి కనపడడంలేదని హైకోర్టు పేర్కొంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను ఉదహరిస్తూ, గోవులు తల్లితో సమానం, తల్లి పాలు అనేక కారణాల వల్ల బిడ్డకు లభించని పరిస్ధితుల్లో గోపాలను పసిపిల్లలకు ఇస్తారు. ఈ పాలు శిశువులకు బలమైన పౌష్టికాహారం.

గోవు పాలను తాగనంత మాత్రాన, కేవలం భుజించడం కోసమని పవిత్రమైన తల్లితో సమానమైన గోమాతను చంపడాన్ని ఎలా సమర్ధిస్తామని హైకోర్టు పేర్కొంది. వేదాలు కూడా ఎటువంటి పరిస్ధితుల్లో గోవులను వధించడం, భుజించడాన్ని అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది.

క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్ కూడా గోవధను అనుమతించలేదన్నారు. ఈ కేసుపై హైకోర్టు ఆదేశాలను మార్చి 1వ తేదీ జారీ చేసి జూన్ 5వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ ఆదేశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అందించాలని కోర్టు పేర్కొంది. కాగా మరింత గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శుక్రవారం కోరగా, జూలై 7వ తేదీ వరకు హైకోర్టు ఇచ్చింది.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)