ఈ లోకంలో పేదలు మరింత పేదరికంలోకి జా రుకుంటున్నారని, ఉన్నవారు మరింత సంపన్నులవుతున్నారని మార్క్సిస్టుల, మావోయిస్టుల విశే్లషణ. ఈ రెండు వామపక్ష వర్గాల వారు పోత పోసినట్టు ఒకే ఆలోచనతో మాట్లాడతారు. ఇక్కడే వారు వాస్తవాన్ని విస్మరించి ‘తప్పులో’ కాలేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ రకమైన పొరపాటు పంథాలోనే వారు ప్రయాణిస్తున్నారు.
మార్క్సిజాన్ని విశ్వసించేవారి విశే్లషణ ఏమాత్రం సరైనది కాదని మన చుట్టూ ఉన్న వాతావరణమే తెలియజేస్తోంది. ఇటీవల వెలువడిన ‘సివిల్స్’ ఫలితాలలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణ జాతీయస్థాయిలో మూడవ ర్యాంక్ సాధించాడు. ఆయన తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. గోపాలకృష్ణ కటిక పేదరికం అనుభవిస్తూనే, తెలుగు మాధ్యమంలో చదువుకొనసాగిస్తూ ‘సివిల్స్’లో సత్తాచాటి జాతీయ స్థాయిలో సైతం అభినందనలు అందుకున్నాడు. అలాగే కొత్తమాసు దినేష్‌కుమార్ కూడా. ఈ పరిణామం దేన్ని సూచిస్తోంది? పేదలు మరింత పేదలుగా మారుతున్నారన్న మార్క్సిస్టుల, మావోల వాదనను బలపరుస్తోందా? కానే కాదు.. స్వాతంత్య్రం లభించాక గత 70 ఏళ్ళలో పేద కుటుంబాల నుంచి ఎందరో ఆణిముత్యాల్లాంటివారు రాష్ట్ర, జాతీయస్థాయిలో వివిధ రంగాలలో ఎదిగివచ్చారు. ఇది కాదనలేని సత్యం. మరి మార్క్సిస్టుల, మావోల విశే్లషణ సరైనది ఎలా అవుతుంది? అసలు వాస్తవం- జ్ఞానంలో, సమకాలీన సమాజ అధ్యయనంలో, అభివృద్ధి కాంక్షలో, నిరంతర శ్రమ, పట్టుదల, పైకి ఎదగాలన్న ఆకాంక్షలో ఇమిడి ఉందన్న విషయాన్ని విస్మరించి, దీనికి ‘వర్గ దృక్పథం’ అంటగట్టడం ఏమాత్రం సమంజసం కాదు. దశాబ్దాల క్రితం నాటి మాటేమోగాని ఈ ఆధునిక కాలంలో ‘వర్గం’ అన్న మాటకు మానవత లేదు. అయినా మావోయిస్టులు ఆ మాటనే ఇప్పటికీ ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. ఆ వెలుగులోనే తమ విధానాలను రూపొందిస్తున్నారు.
రోణంకి (రణం నుంచి వచ్చిన ఇంటి పేరు) గోపాలకృష్ణ ఏ జిల్లాకు చెందినవాడో, ఆ జిల్లాలో నక్సలైట్లు దాదాపు 50 ఏళ్ళ క్రితం గిరిజనుల తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఆ ఘర్షణ వెనుక వర్గ దృక్పథం బలంగా పనిచేసింది. ‘వర్గ శత్రు నిర్మూలన’’ పెద్దఎత్తున శ్రీకాకుళం ఏజెన్సీలో చోటుచేసుకుంది. మైదాన ప్రాంత యువకుల్ని పెద్దఎత్తున కదిలించారు. ప్రజలకు కమ్యూనిజం తప్ప మరో విధానం ప్రయోజనం చేకూర్చదని గట్టిగా ప్రచారం చేశారు. అంటే వర్గ దృక్పథాన్ని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళారు. కాని వాస్తవం ఏమిటి? గత 50 ఏళ్ళలో శ్రీకాకుళం జిల్లా పేద ప్రజల జీవితాలు అనూహ్యంగా మారిపోయాయి. ప్రపంచంతో పోటీపడేందుకు సిద్ధమవుతున్నారు. అన్ని రంగాలలో రాణిస్తున్నారు. తమ జీవన శైలిని మార్చుకున్నారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇదంతా వర్గ దృక్పథంతో సాధించింది కాదు. ఇది కేవలం శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్, ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఒడిశా లాంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనేగాక దేశం అంతటా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఉన్నత విద్య పట్ల మక్కువ పెంచుకుని, జీవితంలో మెట్లు ఎక్కడానికి యువకులు శ్రమిస్తున్నారు. నైపుణ్యాలను అందిపుచ్చుకుని, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే అమెరికా ప్రయాణమవుతున్నారు. ఇప్పుడు అమెరికాలో ఎంతమంది పేద ప్రజల బిడ్డలున్నారో ఎవరైనా ఊహించారా? అమెరికాలోని భారతీయుల్లో నూటికి 70శాతం మంది పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలుండడం గమనార్హం. ఇటీవల ఈ సంఖ్య మరింత పెరిగింది. మరి దీని అర్థమేమిటి? మావోయిస్టుల విశే్లషణ సరైనదిగా కనిపిస్తోందా?
దేశ ప్రధాని నరేంద్ర మోదీ చాయ్ అమ్ముకునే కుటుంబం నుంచి వచ్చాడంటే ఇది దేనికి సంకేతం? పెట్టుబడిదారీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ వెళ్ళూనుకు పోయింది.. వాళ్ళు పేద ప్రజలను పైకి ఎదగకుండా తొక్కిపెడుతున్నారన్న వాదనను బలపరుస్తోందా? లేదు. కొన్ని దశాబ్దాల క్రితం ఆమాటకు,వాదనకు కొంత విలువ ఉంటే ఉండింది, కాని ప్రస్తుతం ఆ వాదన పూర్తిగా నిరాధారమైనది. ఇందుకు రోణంకి గోపాలకృష్ణను, దినేష్‌కుమార్‌ను తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సివిల్స్‌లోనే గాక వివిధ గ్రూపు పరీక్షల్లో పేద వర్గాల నుంచి వచ్చినవారు సత్తాచాటుతున్నారు. వివిధ ప్రవేశపరీక్షల ఫలితాలు వెలువడినప్పుడు రాణించిన వారి ఇంటర్వ్యూలను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కూలినాలి చేసుకునే కుటుంబాల నుంచి వచ్చినవారు ప్రతిభను కనబరిచి, మేలైన ఫలితాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అయితే పేద పిల్లలంతా ఇంతటి ఘన విజయం సాధిస్తున్నారా? అంటే లేదనే చెప్పాలి. దానికి కారణం మాత్రం ‘వర్గం’ కాదు. అది వారి వారి ప్రయత్నం, జ్ఞాన బలిమి,ప్రోత్సాహం, మార్గదర్శనం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు అణగారిన వర్గాలపై ప్రేమగలవారు చేయవలసిందేమిటి? వారిని ‘గెరిల్లాలు’గా తీర్చిదిద్దాలనుకోవడమా? లేక సరైన జ్ఞాన మార్గం చూపడమా? ఇప్పుడు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో, సోషల్ మీడియాలో జ్ఞానదారుల జాడలు కనిపిస్తున్నాయి. అటువైపు నడిచేలా ప్రోత్సహించి, స్ఫూర్తిని కలిగించడంలోనే అర్థం, పరమార్థం ఉంది. అలా చేయూతను అందుకుని ఆర్థికంగా పైకి ఎదిగినవారు అనేకులున్నారు. అంతెందుకు..? స్వాతంత్య్రం వచ్చాక దేశంలో వంద కోట్లకు పైగా సంపదను కూడేసిన దళిత కోటీశ్వరులు వందలాది మంది ఉన్నారు. దళిత పారిశ్రామిక ఫెడరేషన్‌లో వారి సంఖ్య పెరుగుతూ ఉంది. కసితో వారు సంపదను పోగేస్తున్నారు. మరి దీన్ని మావోయిస్టులు ఏ రకంగా విశే్లషిస్తారు? దళితులు, పేదలు ఇంకా ఆర్థికంగా దిగజారిపోతున్నారని ఈ పరిణామం సూచిస్తోందా?
ఓ సంస్థలో గాని, పార్టీలో గాని అందరూ నాయకులుగా, బాస్‌లుగా ఎదగలేనట్టుగానే పేదలందరూ కోటీశ్వరులు కాకపోవచ్చు. ఆర్థికంగా పరిపుష్టిని సాధించలేకపోవచ్చు. అంతమాత్రాన వారితో సైన్యం ఏర్పాటుచేసి పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునివ్వడం అంత ఆరోగ్యకరమైనది కాదు. తమకు రాజ్యాధికారం దక్కితే మొత్తం స్వర్గం పేదల ముంగిట్లోకి వస్తుందని మావోలు భ్రమలు కల్పించడం దారుణం. ఉత్పత్తి అయిన సంపదపైనే పంపిణీ ఆధారపడి ఉంటుంది తప్ప ఉత్పత్తికి, పంపిణీకి సంబంధం లేదన్నట్టుగా ప్రజల్లో అపోహ కలిగించడం సరైనది కాదు.
సోషలిస్టు దేశాల్లో ఎదురైన చేదు అనుభవం తరువాత కూడా మార్క్సిజం ఆధారంగా మావోయిస్టులు ఇలాంటి ప్రకటనలు చేయడం విడ్డూరం. ప్రజల జ్ఞానస్థాయిని, వారి ఉత్పత్తి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరచడం మాని సాయుధ పోరాట భాష, దాడుల గ్రామర్, ప్రతీకారం, కసి, ద్వేషం నింపే పాటల వల్ల పేదల బతుకులు బాగుపడవని అనుభవంలో తేలింది. మావోయిస్టుల- సాధారణ ప్రజల జ్ఞాన స్థాయిలోని అంతరం పూడ్చినప్పుడే ఫలితాలు దక్కుతాయి తప్ప జ్ఞాన అంతరాలను అలాగే కొనసాగిస్తూ విప్లవం కోసం సమాయత్తం చేయడంవల్ల పేద ప్రజలకు, వారి వారసులకు ఒరిగేది ఏమీ ఉండదు.
– వుప్పల నరసింహం
(ఆంధ్రభూమి సౌజన్యం తో)