Home Telugu Articles తగవులమారి చైనా

తగవులమారి చైనా

0
SHARE

భారత్‌, చైనాల మధ్య సరిహద్దు వివాదం మళ్లీ రగులుతోంది… డోక్‌లామ్‌ వద్ద సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. సిక్కిం వద్ద భారత్‌ మరిన్ని బలగాలను మోహరించడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ప్రాచీన నాగరికత ఉన్న రెండు దేశాల మధ్య కొన్ని శతాబ్దాల పాటు సాంస్కృతిక సంబంధాలు కొనసాగాయి. కానీ ఆధునిక కాలంలో రెండింటి మధ్య సంబంధాలు స్నేహపూరితంగా లేవు. డోక్‌లామ్‌ వివాదంతో పాటు భారత్‌, చైనా మధ్య ఇంకా పలు విభేదాలున్నాయి. చాలా విషయాల్లో భారత్‌ వాదనను చైనా బేఖాతరు చేస్తోంది. ఉగ్రవాదం, ఎన్‌ఎస్‌జీ వంటి అంశాల్లో భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తున్నా చైనా మొండి వైఖరితో భారత్‌ వాదనను తోసిపుచ్చుతోంది. నేపాల్‌, భూటాన్‌కు మన దేశం చేయూతనివ్వడమూ ఆ దేశానికి కంటగింపుగానే ఉంది.

సరిహద్దు విభేదాలు

రెండు దేశాల మధ్య 3,488 కి.మీ. పొడవునా సరిహద్దు ఉంది. ఈ సరిహద్దును పూర్తిస్థాయిలో నిర్ధారించుకోలేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 90వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతం తమదేనని చైనా ఇప్పటికీ మొండిగా వాదిస్తోంది. ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంటోంది. ఉత్తరాఖండ్‌లోని పదివేల చదరపు కిలోమీటర్ల ప్రాంతమూ తమదేనంటోంది. రెండు దేశాలూ సరిహద్దులో చివరి మైలు వరకు మౌలిక సదుపాయాలను నిర్మించాలనుకోవడం చొరబాట్లకు కారణమవుతోంది. సైనిక పరంగా రెండూ బలమైనవి కావడంతో సమస్య మరింత క్లిష్టమవుతోంది. పలుమార్లు మధ్య చర్చలు జరిగినా సరిహద్దు వివాదం అపరిష్కృతంగానే ఉంది.

కాగితాలపై వీసాలు

చైనా సందర్శించాలనుకునే అరుణాచల్‌ప్రదేశ్‌, జమ్ముకశ్మీరు ప్రజలకు ఆ దేశం కాగితాల వీసా మంజూరు చేస్తోంది. పాస్‌పోర్టుపై స్టాంపింగ్‌ ఉండదు. అంటే ఒకరకంగా వారు భారత పౌరులు కాదని చైనా చెప్పడం. ఈ వైఖరిని భారత్‌ తీవ్రంగా నిరసిస్తోంది. 2011లో జమ్ము, కశ్మీరు ప్రజలకు ఈ పద్ధతిని నిలిపేసిన చైనా.. అరుణాచల్‌ప్రదేశ్‌వాసులకు మాత్రం కొనసాగిస్తోంది.

భూటాన్‌, నేపాల్‌

భూటాన్‌, నేపాల్‌తో సంబంధాలపై భారత్‌ పాత్రపట్ల చైనా విమర్శనాత్మకంగా ఉంది. భూటాన్‌ సరిహద్దుల రక్షణ విషయంలో ఆ దేశంతో భారత్‌కు రక్షణ ఒప్పందం ఉంది. ఆర్థికపరమైన అవసరాలకు నేపాల్‌ భారత్‌పై ఆధారపడుతోంది.

చైనా ముత్యాల దండ

భారత్‌ చుట్టూ రక్షణ స్థావరాలను ఏర్పర్చడమే ఈ ముత్యాల దండ. భారత్‌ సముద్ర జలాల చుట్టూ ఓడరేవులను, నౌకాదళ స్థావరాలను నిర్మించాలన్నది చైనా అప్రకటిత విధానం. హిందూ మహాసముద్రంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆ దేశం.. భారత్‌ చుట్టూ పాగా వేయడానికి ప్రయత్నిస్తోంది. మయన్మార్‌లోని కోకోస్‌ ద్వీపంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో,

హంబన్‌టోటలో, మాల్దీవుల్లోని మరావ అటోల్‌లో, పాకిస్థాన్‌లోని గ్వాదర్‌లో చైనా తన ఉనికిని స్థిరం చేసుకుంది. మరో వైపు భారత్‌.. చైనా చుట్టు పక్కల దేశాలతో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

నదీ జలాల వివాదం: చైనాకు దాదాపు అన్ని పొరుగుదేశాలతోనూ నదీ జలాల వివాదాలున్నాయి. భారత్‌తో బ్రహ్మపుత్ర నదీ జలాలపై వివాదం ఉంది. టిబెట్‌లో త్సాంగ్‌పో అని పిలిచే ఈ నదిపై ఎగువ ప్రాంతంలో చైనా పలు ఆనకట్టలు కడుతోంది. భారత్‌లో ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం పొంచి ఉంటోంది.

అణు సరఫరా దేశాల గ్రూప్‌ (ఎన్‌ఎస్‌జీ): 48 దేశాల ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి భారత్‌ తీవ్రంగా కృషి చేస్తోంది. ఏదో ఒక సాకు చెబుతూ చైనా భారత్‌కు మోకాలడ్డుతోంది.

ఉగ్రవాదం: ఉగ్రవాదాన్ని అన్ని విధాలుగా అడ్డుకోవాలని భారత్‌ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్‌ చేస్తోంది. పొరుగున ఉన్న పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని సాక్ష్యాలతో భారత్‌ చెబుతోంది. పాకిస్థాన్‌కు చెందిన జైష్‌ ఎ మహ్మద్‌ అధిపతి మసూద్‌ అజహర్‌పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న భారత్‌ ప్రయత్నాలకు చైనా అడ్డు తగులుతోంది.
సీపెక్‌: భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్థాన్‌కు చైనా అండదండలు అందిస్తోంది. చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపెక్‌)ను నిర్మిస్తోంది. ఈ నడవా.. పాక్‌ ఆక్రమిత కశ్మీరుగుండా వెళ్తుంది. సీపెక్‌కు భారత్‌ అభ్యంతరం తెలియజేస్తోంది.
డోక్‌లామ్‌ వివాదానికి 1966లోనే బీజం

దిల్లీ: భారత్‌, చైనా మధ్య ప్రస్తుతం డోక్‌లామ్‌ వద్ద నెలకొన్న సరిహద్దు వివాదానికి 1966లో బీజం పడింది. డోక్‌లామ్‌ పీఠభూమిలోని తమ భూభాగంలోకి చైనా బలగాలు చొరబడ్డాయని అప్పట్లో భూటాన్‌ ఆరోపించగా చొరబాటుకు వ్యతిరేకంగా భూటాన్‌కు రక్షణగా ఉంటామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఆ ఏడాది రెండు దేశాల మధ్య కొద్ది నెలల పాటు పరస్పర విమర్శలు కొనసాగాయి. సిక్కిం సెక్టార్‌లో ఘర్షణ కూడా జరిగింది. చైనాను వ్యతిరేకించడానికి, చైనా, భూటాన్‌ మధ్య విభేదాలు సృష్టించడానికి భారత ప్రభుత్వం కొత్త సాకును వెదుక్కోవాలనుకుంటోందని, రక్షణ కల్పించే పేరుతో భూటాన్‌పై నియంత్రణ సాధించాలన్న కుతంత్రానికి ప్రయత్నిస్తోందని చైనా అధికార వార్తా సంస్థ అప్పట్లో పేర్కొంది. ఇటీవల చైనా చేసిన వాదన 1966లో ఆ దేశం చేసిన వాదన, అందుకు ఉపయోగించిన పదజాలానికి దగ్గరగా ఉంది. భూటాన్‌ పట్ల మాత్రం చైనా వైఖరి మెతగ్గానే ఉంది.

సిక్కిం సరిహద్దులకు మరిన్ని భారత బలగాలు

దిల్లీ: భారత్‌-చైనాల మధ్య దాదాపు నెల రోజులుగా ఉద్రిక్తతలు నెలకొన్న సిక్కిం సరిహద్దుల్లోని డోక్‌లామ్‌ ప్రాంతానికి మరిన్ని భారత బలగాలు చేరుకున్నాయి. అయితే, చైనాతో తలపడే ఉద్దేశంతో కాకుండా ఆ ప్రాంతంలో తమ పట్టును బిగించేందుకేనని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గత నెల ఒకటో తేదీన డోక లా లోని రెండు భూగర్భ రక్షణ నిర్మాణాల(బంకర్లు)ను తొలగించాలని చైనా సైన్యం కోరగా భారత సైనికలు తిరస్కరించటం, ఆ తర్వాత వాటిని చైనా బలవంతంగా కూల్చివేయటంతో వివాదం రాజుకుంది. ఈ బంకర్లను భారత్‌ 2012లో నిర్మించింది. ఆ తర్వాత చైనా సైనికులు డోక్‌లామ్‌లో రహదారిని నిర్మించేందుకు యత్నించగా భారత సైనికులు అడ్డుకోవటంతో తలెత్తిన ప్రతిష్ఠంభన ఇన్ని రోజుల పాటు కొనసాగటం 1962 తర్వాత ఇదే ప్రథమం. అయితే, తాజా ఉద్రిక్తతలపై చర్చలకు సిద్ధమేనని అంటున్న చైనా డోక్‌లామ్‌ నుంచి భారత సైనికులను ఉపసంహరించాలని షరతు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ భారత్‌ బలగాల సంఖ్యను మరింత పెంచటం ద్వారా చైనా ఒత్తిడికి లొంగబోమనే సంకేతాలిస్తోంది.

(ఈనాడు సౌజన్యం తో)