Home Telugu ‘ఆవు’పై పరిశోధనకు 19 మంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

‘ఆవు’పై పరిశోధనకు 19 మంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

0
SHARE

ఆవు వల్ల సమకూరే ప్రయోజనాలపై పరిశోధన చేపట్టేందుకు ప్రభుత్వం 19 మంది సభ్యులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి హర్షవర్దన్‌ నేతృత్వంలోని ఈ సంఘంలో ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీతో సంబంధమున్న ముగ్గురు సభ్యులున్నారు. పంచగవ్య అని పిలిచే ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యితో వ్యవసాయ పరంగా, ఆరోగ్య పరంగా, ఇతరత్రా కలిగే ప్రయోజనాలను శాస్త్రీయంగా రుజువు చేసే ప్రాజెక్టులను ఈ సంఘం ఎంపిక చేస్తుంది.

ఈ సంఘంలో శాస్త్ర, సాంకేతికపరిజ్ఞాన విభాగం, జీవసాంకేతిక పరిజ్ఞాన విభాగం కార్యదర్శులు, నవ్య, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ కార్యదర్శి, పసుపు, బాస్మతి బియ్యంపై అమెరికా మేధోహక్కులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సీఎస్‌ఐఆర్‌ మాజీ సంచాలకుడు ఆర్‌.ఎ.మాష్లేకర్‌, దిల్లీ ఐఐటీ సంచాలకుడు ప్రొఫెసర్‌ వి.రాంగోపాల్‌రావు, ఇదే ఐఐటీలో గ్రామీణాభివృద్ధి కేంద్రానికి చెందిన ప్రొఫెసర్‌ వి.కె.విజయ్‌ సభ్యులుగా ఉంటారు. ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీలకు అనుబంధ సంస్థలైన విజ్ఞాన భారతి, గో విజ్ఞాన్‌ అనుసంధాన కేంద్రానికి చెందిన ముగ్గురు కూడా సభ్యులుగా ఉంటారు. విజ్ఞాన్‌ భారతి అధ్యక్షుడు విజయ్‌ భట్కర్‌ ఈ సంఘానికి సహ ఛైర్మన్‌గా ఉంటారు. పరమ్‌ సూపర్‌కంప్యూటర్ల రూపకర్తగా ఈయనకు పేరుంది. బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం ఛాన్సెలర్‌గా కూడా పని చేస్తున్నారు. మరొక సభ్యుడు విజ్ఞాన భారతి సెక్రటరీ జనరల్‌ జయకుమార్‌ కాగా ఇంకొకరు నాగ్‌పుర్‌లో వీహెచ్‌పీకి అనుబంధ సంస్థ అయిన గో విజ్ఞాన్‌ అనుసంధాన్‌ కేంద్రానికి చెందిన సునిల్‌ మణిసింఘ్కా.

దేశంలో ప్రస్తుతం ఆవు భావోద్వేగపూరిత అంశంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సైంటిఫిక్‌ వాలిడేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆన్‌ పంచగవ్య-‘ఎస్‌వీఏఆర్‌వోపీ’గా నామకరణం చేసింది. ఎస్‌వీఏఆర్‌ఓపీకి మార్గదర్శకత్వం వహించే సంఘం కాలవ్యవధి మూడేళ్లని ప్రభుత్వం ఓ ఉత్తర్వులో పేర్కొంది. విద్యాసంస్థలు, పరిశోధన ప్రయోగశాలలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులకు దేశీయ ఆవుల విశిష్టతను శాస్త్రీయంగా రుజువు చేసే పరిశోధనల్లో భాగస్వామ్యం కల్పిచాలని మార్గదర్శనం చేసింది.

(ఈనాడు సౌజన్యం తో)