Home Telugu ఒకే దేశం.. ఒకే పతాకం, రాష్ట్రాలకు విడివిడి జెండాలను అనుమతించే నిబంధన లేదు: కేంద్ర హోంమంత్రిత్వ...

ఒకే దేశం.. ఒకే పతాకం, రాష్ట్రాలకు విడివిడి జెండాలను అనుమతించే నిబంధన లేదు: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ

0
SHARE

దేశ మంతటికీ ఒకే పతాకం ఉంటుందని, అది…త్రివర్ణ పతాకం మాత్రమేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రాలకు విడివిడిగా జెండాలను అనుమతించే నిబంధన ఏదీ రాజ్యాంగంలో లేదని పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించుకునేందుకు కమిటీ నియమించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. ‘‘మనది ఒకే దేశం. ఒకే జెండా. ఏ రాష్ట్రమైనా ప్రత్యేక పతాకం రూపొందించుకోవటంపై చట్టబద్ధమైన నిబంధనలు లేవు’’ అని హోంమంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం పసుపు, కుంకుమ వర్ణాలతో దీర్ఘ చతురస్రాకార వస్త్రంపై కర్ణాటక చిత్రపటాన్ని ముద్రించి కన్నడ జెండాగా గౌరవిస్తున్నారు. ‘‘ఆ పతాకానికి చట్టబద్ధత లేదు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి సందర్భాల్లో దానిని ఉపయోగించరు. కన్నడ జెండాపై అభ్యంతరాలు తెలుపుతూ న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నడుస్తున్నాయి’’ అని చెప్పారు. రాజ్యాంగంలోని 370 అధికరణం ప్రకారం జమ్ముకశ్మీరుకు మాత్రమే ప్రత్యేక జెండా ఉంది. వచ్చే డిసెంబరులో దావణగెరెలో ప్రపంచ కన్నడ సమ్మేళనం నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం బెంగళూరులో జరిగిన సన్నాహక సభలో జెండా రూపకల్పన సమితి ఏర్పాటు విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.

(ఈనాడు సౌజన్యం తో)