Home Telugu 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌, 65.6శాతం ఓట్లతో ఘన విజయం

14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌, 65.6శాతం ఓట్లతో ఘన విజయం

0
SHARE

భారతావనికి 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌పై ఆయన 65.6శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. మొత్తం నాలుగు టేబుళ్లపై ఎనిమిది రౌండ్లలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపులో ప్రక్రియలో ఆయన 7,02,044 ఓట్లు సాధించారు. రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ ఎన్నికైనట్టు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా మీడియాకు అధికారికంగా వెల్లడించారు.

ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగియనుంది. దీంతో తదుపరి ప్రథమ పౌరుడి కోసం జులై 17న ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 99శాతం ఓటింగ్‌ నమోదైంది. అధికార ఎన్డీయే తరఫున బిహార్‌ మాజీ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌.. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. ఎన్డీయే కూటమి పార్టీలతో పాటు జేడీయూ, మరికొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కోవింద్‌కు మద్దతిచ్చాయి. దీంతో కోవింద్‌ గెలుపు లాంఛనప్రాయమైంది. ఈ నెల 25న రామ్‌నాథ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

(ఈనాడు సౌజన్యం తో)