నేడు మన దేశంలో జరుగుతున్న సంఘటనల వెనుక కొంత మంది కాలం చెల్లిన సిద్ధాంత కర్తలు, జనాదరణకు నోచుకోని, నమ్మిన జనం ఛీకొట్టి తుంగలో తొక్కిన సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే వీరందరు కేవలం ఒక వ్యక్తి మీద ద్వేషాన్ని పెంచుకొని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేయటం మొదలు పెట్టారు. కాని వీరు 120 కోట్ల మంది ప్రజలు డా||బాబాసాహెబ్. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాతీర్పు ఇచ్చిన కారణంగా తను ప్రధాని అయ్యాడని, తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనే విషయాన్ని మరచి దేశంలో అస్థిరతను ఏర్పరచేందుకు నానా తంటాలు పడుతున్నారు. అయితే ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. నేడు ఒక ప్రభుత్వం రావొచ్చు రేపటి నాడు ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రావొచ్చు. కాని వీరు వీరి సర్వ సాధారణమైన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే అసలు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని కుహానా మేధావులు దేశంలో ఎవరైనా వున్నారా అంటే వారే ఈ కమ్యునిస్టులు.
1960లోనే ఒక కమ్యునిస్టు నాయకురాలు నంభుదరి పాట్నే బహిరంగంగానే డా||బి.ఆర్.అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పు బట్టింది. దీన్ని బట్టి చూస్తే వీరు రాజ్యాంగ వ్యతిరేకులు. అందుకే వీరు భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకిస్తారు. అంతే కాకుండా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం విధించిన ఉరిశిక్షని వ్యతిరేకిస్తారు. కాని మళ్ళీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కావాలి. ఆ హక్కు ద్వారా అన్నం పెట్టిన ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు ఈ దేశం గాలి పీల్చి ఈ దేశం తిండి తిని ఈ దేశం నీరు తాగి పర దేశం పాట పాడుతారు. ఇది తప్పు అని పోలీస్ కేసులు పెడితే కోర్టు తీర్పును తప్పు పట్టే ఈ ఎర్రోళ్ళు అదే కోర్టు దగ్గరకు బెయిల్ కోసం వెళ్తారు. దీని ప్రకారం వీరు పెద్ద అవకాశవాదులు.
అసలు ఈ దేశంలో కమ్యునిస్టులు ద్రోహ బుద్ధిని అప్రజాస్వామ్య విధానాన్ని మొదట గుర్తించింది అంబేద్కర్ గారే. అందుకే వారు 1949 నవంబర్ 25 నాటి ఉపన్యాసం లోనే చెప్పారు. నా ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు విశ్వసించరు అంటేవారు తప్పకుండా కమ్యునిస్టులే. నాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించి నేడు అంబేద్కర్ గారి పేరును కొన్ని సంఘాలకు పేరుగా పెట్టుకొని ఆ సంఘం ముసుగులో దేశద్రోహా దొంగలముటాకి మద్దతు పలుకుతున్నారు అంతే కాకుండా ఉగ్రవాదులను కీర్తిస్తున్నారు అందుకు వీరు దేశద్రోహులే అవుతారు కదా. కమ్యునిస్టులు అభివృద్ధి నిరోధకులు. దేశంలో వీరు చేసిన దాడుల కారణంగా ఏకంగా 16 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగింది. కేవలం బస్తర్, చత్తీస్‌ఘడ్‌లోనే 3700 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఇదే 3700 కోట్లు బస్తర్ అభివృద్ధికి వినియోగించి వుంటే కేసిఆర్ సింగపూర్, చంద్రబాబు నాయుడు జపాన్‌కు, వెంకయ్యనాయుడు స్మార్ట్ సిటీకు బదులుగా దేశం అంతా బస్తర్ లాంటి నగరాలను తయారు చేస్తాం అని అంటరనటంలో అతిశయోక్తి లేదేమో అనిపిస్తుంది. ఇప్పటికి కమ్యునిస్టులు బలంగా ఉన్న ఒకటో అర స్థలాలుంటే అవి ఇప్పటికి అభివృద్ధికి దూరంగా వున్నాయి. దారుణమైన విషయం ఏంటంటే దేశం మొత్తం మీద 9 లక్షల మంది బిక్షగాళ్ళు ఉంటే కేవలం వీరు పాలించిన పశ్చిమ బెంగాల్‌లోనే 3 లక్షల మంది బిక్షగాళ్ళు వున్నారు. ఇటువంటి అభివృద్ధి శూన్యతకు కమ్యునిస్టులు నిదర్శనం. మన రాష్ట్రంలో నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఒకప్పుడు బలంగా ఉండేవారు. అనేక పర్యాయాలు ఎంఎల్‌ఏలుగా కూడా పని చేశారు కాని ఇప్పటికి అక్కడ పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకోడానికి ఒక ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. దీన్ని బట్టి వీరు పేద విద్యార్థుల అభ్యున్నతికి వ్యతిరేకం.
కమ్యునిస్టులు దళిత వ్యతిరేకులు ఎందుకంటే ఇప్పటివరకు వీరి ఉభయ కమ్యునిస్టు పార్టీల్లో పోలీట్ బ్యూరో మెంబర్‌గా ఒక్క ఎస్సిని కూడా ఎన్నుకోలేదు. ఎందుకు ఎన్నుకోలేదంటే ఒక ఎర్రజెండా ఎర్రి నాయకుడు దళితులకు నాయకత్వ లక్షణాలు లేవు అన్నాడు. వాస్తవానికి వీరికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు భారత దేశంలో పుట్టి భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే లక్షణాలు అంబేద్కర్ వారసులైన దళితులకు వుండవు కదా. ఎందుకంటే దళితులు కూడా భారతీయులే కదా కావున కమ్యునిస్టులు దళిత వ్యతిరేకులు, ఆదివాసీ యులకు వ్యతిరేకులు. అయినా వీరి పార్టీలో స్థానం గంగలో కలవని గాని కమ్యునిస్టులు ప్రజా క్షేత్రంలో వుండి నక్సలైటు, మావోయిస్టులకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ నక్సలైట్లు మావోయిస్టులు చేసిన దాడుల కారణంగా అనేక మంది దళితులు ఆదివాసీలు చనిపోయారు. వీరి దాడుల కారణంగా ఈ 10 సంవత్సరాల్లో 12307 మంది చనిపోతే అందులో 9470 మంది ఆదివాసిలే. చత్తిస్ ఘర్ జిల్లాలోని బస్తర్లో గడిచిన 3 సంవత్సరాల్లో 126 మంది చనిపోతే 114 మంది ఆదివాసీలు వారి జీవితాలను కోల్పోయారు. ఇదే బస్తర్‌లో 3 సంవత్సరాల్లో 155 మంది జవాన్లు చనిపోతే అందులో 138 మంది ఆదివాసి కుటుంబీకులే. అంతే కాకుండా దంతేవాడ ఘటనలో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. అందులో 48 ఎస్టీలు, 8 మంది ఎస్సీలు. ఈ విధంగా వేలమంది దళితులను ఆదివాసిలను పొట్టన పెట్టుకొని వారి కుటుంబాలను బజారుకీడ్చారు ఈ కమ్యునిస్టులు. అందుకే వీరు దళిత, ఆదివాసి ద్రోహులు. ఈ కమ్యునిస్టులు దేశానికే కాదు దేశ సమగ్రతకు కూడా వ్యతిరేకమే. వీరి కార్యక్రమంలో పరాంజపే అనే మహిళా మేధావి భారత జాతికి, భారత జాతి సమైక్యతకు మద్దతుగా మాట్లాడితే తనపై అనేక రకాలుగా వీరు వీరి అసహనాన్ని ప్రదర్శించారు. కమ్యునిస్టులు స్త్రీ జాతి వ్యతిరేకులు. జెఎన్‌యులో కమ్యునిస్టులకు దొరికిన ఒక అగ్ర నాయకుడో అక్కరకు రాని నాయకుడో జవాన్ల గురించి తప్పుగా మాట్లాడాడు. అది అవాస్తవం అనే విషయం మన అందరికి తెలిసిన విషయమే, కాని వీరు మహిళలను అనేక చిత్ర హింసలకు గురి చేసిన కారణంగా కేవలం ఒకటిన్నర సంవత్సరంలో 6 రాష్ట్రాలలో 330 మంది మహిళలు వీరి తప్పుడు సిద్ధాంతం నుండి తప్పించుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిశారు. దీన్ని బట్టి స్త్రీ జాతి వ్యతిరేకులు ఈ కమ్యునిస్టులు.
ఈ మధ్య కాలంలో కూడా దేశ క్షేమాన్ని కోరుతు ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దు చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తూ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగే విధంగా బంద్‌లు చేయటం, బ్యాంకుల ముందు ధర్నాలు చేయటం కొరకు ప్రయత్నిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారే కాని బ్యాంకు ముందు లైన్‌లో నిల్చున్న ప్రజలకు గుక్కెడు మంచి నీరు అందించింది లేదు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక కార్యక్రమం చేసింది లేదు. ఈ విధంగా ఈ కమ్యునిస్టులు మొదటి నుండి దేశానికి, దేశ క్షేమానికి వ్యతిరేకంగా పనిచేసేవారే.
కావున ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేశం బాగోగులకు కూడా కమ్యునిస్టులు వ్యతిరేకులే. కమ్యునిస్టులు రాజ్యాంగ వ్యతిరేకులు, పేద ప్రజల అభ్యున్నతికి వ్యతిరేకులు, దేశ అభివృద్ధి నిరోధకులు, దళిత, ఆదివాసి వ్యతిరేకులు, మన దేశాన్ని నడిపిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకులు. అసలు ఈ ఎర్రోల్ల వ్యూహం ఏంటంటే ఈ దేశాన్ని కూడా రష్యాలో లాగ నియంతృత్వ పోకడలకు గురిచేసి మన దేశ సంస్కృతిని చిన్నా భిన్నం చేసి, దేశంలో అస్థిరతను ఏర్పరచాలి అనేదే వీరి లక్ష్యం కావున భారతీయులందరు కమ్యునిస్టుల విషయంలో ఇకనైనా జాగరూకత వహించాలి మిత్రమా.
-జవ్వాజి దిలీప్, జే.ఎన్.టి.యు, హైదరాబాద్
ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు
(సాందీపని సౌజన్యం తో)