Home Telugu Articles చైనా కట్టడికి వాణిజ్య ముట్టడి! పోరు తీరు మారాల్సిన తరుణం

చైనా కట్టడికి వాణిజ్య ముట్టడి! పోరు తీరు మారాల్సిన తరుణం

0
SHARE

‘చైనా వస్తువుల్ని బహిష్కరించండి’ అంటూ కొన్ని రోజులుగా పలు సందేశాలు సామాజిక మాధ్యమాల్ని హోరెత్తిస్తున్నాయి. భారత్‌ ఎంతగా అభ్యంతరపెట్టినా- పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ‘పాక్‌-చైనా ఆర్థిక నడవా’ (కారిడార్‌) నిర్మాణం విషయంలో చైనా వెనక్కి తగ్గడం లేదు. అణు సరఫరాదారుల బృందంలో సభ్యత్వం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో చైనా ప్రతిసారీ భారత్‌కు అడ్డుతగులుతోంది. భారత పార్లమెంటుపై దాడికి పాల్పడిన మసూద్‌ అజర్‌ను ‘సమితి’ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా, చైనా అతణ్ని వెనకేసుకొస్తోంది. ఈ పరిస్థితుల కారణంగా, భారతీయ యువత వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా చైనాపై ఆగ్రహం వెళ్లగక్కుతోంది. ఇప్పటికే భూటాన్‌, సిక్కిం సరిహద్దుల్లో దుందుడుకు చర్యలతో చైనా ఘర్షణాత్మక వైఖరి ప్రదర్శిస్తోంది. అందుకే భారత్‌లో చైనా వస్తువుల్ని బహిష్కరించాలన్న ప్రచారం బాగా వూపందుకుంది. భారత్‌ మొత్తం దిగుమతుల్లో 20శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్న చైనా వస్తువుల్ని నిజంగా బహిష్కరించగలమా అన్నదే ప్రశ్న!

కాచుకొనే యంత్రాంగమేదీ?

భారత్‌లో పలుచోట్ల చైనా బజార్లు వెలిశాయి. ఆ దేశం నుంచి వస్తున్న దిగుమతులు ఒకవిధంగా భారత విపణిని శాసిస్తున్నాయి. ఏటా దాదాపు 3.95లక్షల కోట్ల విలువగల ఉత్పత్తుల్ని చైనానుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచ దేశాలనుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తూత్పత్తుల్లో ఇది అయిదో వంతు. ఇంత భారీ మొత్తంలో చైనా వస్తువులు భారత మార్కెట్లను ముంచెత్తడానికి ప్రధాన కారణం- అవి అత్యంత చవకగా లభించడం! చైనా భారీయెత్తున ఉత్పత్తులు చేస్తోంది. 1978లో మొదలైన సంస్కరణలు గడచిన మూడు దశాబ్దాల్లో చైనాను ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మార్చేశాయి. అందువల్లే ఆ దేశం చవక ధరకే వస్తువులను తయారు చేయగలుగుతోంది. కార్మిక శక్తి పుష్కలంగా అందుబాటులో ఉంది. ఎగుమతి చేసిన వస్తూత్పత్తులపై చెల్లించిన పన్నును తిరిగి వాపస్‌ ఇవ్వడమే చైనా ప్రభుత్వ విధానం. వస్తూత్పత్తికి అవుతున్న ఖర్చుతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో తక్కువ ధరకే చైనా వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్థానిక ఉత్పత్తిదారులను దెబ్బతీసి, పోటీలేకుండా చేసుకొని, ఆయా విపణుల్లో గుత్తాధిపత్యం సాధిస్తోంది. ఒకవైపు చవకగా లభించే దిగుమతులు, మరో చైనా ‘డంపింగ్‌’ విధానాలనుంచి దేశీయ తయారీదారులను కాచుకునే యంత్రాంగం కొరవడటం భారత్‌కు ప్రతికూలంగా మారింది. స్థానికంగా అమలులో ఉన్న కఠినమైన కార్మిక చట్టాలు, అరకొర మౌలిక సదుపాయాల వల్ల కూడా దేశీయ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చైనా ప్రభుత్వం విరివిగా అందిస్తున్న సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలవల్ల భారత్‌తో పోలిస్తే ఆ దేశం ఎగుమతులు ఎనిమిదిశాతం నుంచి 10శాతం మేర చవకగా ఉంటున్నాయి. ఈ కారణాలవల్ల సౌర రంగంలో వచ్చే అయిదేళ్లలో రూ.2.5లక్షల కోట్ల విలువైన వ్యాపారం చైనాకు దఖలుపడే సూచనలున్నాయి. అదేవిధంగా, చైనా వస్త్ర ఉత్పత్తి యంత్రాలు భారత్‌తో పోలిస్తే 30శాతం నుంచి 50శాతం తక్కువ ధరలో లభిస్తున్నాయి. అందుకే చైనా నుంచి వస్త్ర ఉత్పత్తి యంత్రాల దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. 2008లో రూ.1,636కోట్ల మేరకు ఉన్న దిగుమతులు రూ.8,000కోట్లు దాటాయి. చైనా నుంచి దిగుమతి అవుతున్న డీజిల్‌ యంత్రాలు 50 శాతం మేరకు తక్కువ ధరకు లభిస్తుండటంతో, రైతులు వాటినే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో, డీజిల్‌ యంత్రాల్ని ఉత్పత్తిచేసే దేశీయ పరిశ్రమల సంఖ్య అప్పట్లో 500 ఉన్నప్పటికీ అది ఆ తరవాత 70కి పడిపోయింది. ఇదే తరహాలో, కొన్ని దశాబ్దాలుగా ఆటబొమ్మలు తయారుచేస్తున్న వందలాది పరిశ్రమలు మూతపడ్డాయి.

సాధారణంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య సాగే వాణిజ్యం ఆర్థిక దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అది యుద్ధాల్ని నివారిస్తుంది. వాణిజ్యాన్నే ‘వేదిక’గా ఎంచుకొన్న చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌, చైనాల మధ్య వాణిజ్యంలో కొన్ని అసాధారణ అంశాలున్నాయి. చైనాకు భారత్‌ పత్తి, నూలు, బియ్యం, ‘జనరిక్‌’ ఔషధాల వంటి సాధారణ వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. భారత్‌కు చైనా భారీ యంత్రాలు, అణు విద్యుత్కేంద్రాల పరికరాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి అధునాతన వస్తువుల్ని ఎగుమతి చేస్తోంది. ముడిసరకులకు విలువ జోడించి పూర్తయిన ఉత్పత్తుల్ని చైనా విక్రయిస్తోంది. సహజ ఉత్పత్తులను, వనరులను భారత్‌ విక్రయిస్తోంది! ఈ బలహీనతనే చైనా సొమ్ము చేసుకుంటోంది. అత్యంత ఆందోళన కలిగించే మరో అంశం- ప్రపంచ దేశాలనుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తూత్పత్తుల్లో 20శాతం చైనావి కావడం! చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వస్తూత్పత్తుల విలువ అమెరికా, సౌదీ అరేబియా, యూఏఈ నుంచి వచ్చిపడుతున్న దిగుమతులకంటే ఎంతో ఎక్కువ. పొరుగుదేశపు పరిశ్రమల్ని, విపణుల్ని ధ్వంసం చేసే వైఖరి కలిగిన చైనా నుంచి- భారత్‌ ఇంత విస్తృతస్థాయిలో ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం ఎంతో ప్రమాదకరం! దీనికి తోడు చైనా దిగుమతులతో పోలిస్తే మనం ఆ దేశానికి చేస్తున్న ఎగుమతులు ఏ మూలకూ కొరగావడం లేదు. దీనివల్ల చైనాతో భారత వాణిజ్య లోటు క్రమంగా ప్రమాదకర స్థాయి చేరుతోంది. బలమైన వ్యాపార, వాణిజ్య సంబంధాలుగల 25దేశాల్లోని 16దేశాలతో మనకు వాణిజ్య లోటుంది. ప్రపంచానికి ఎగుమతి చేస్తున్నదాని కంటే ఎంతో ఎక్కువగా భారత్‌ దిగుమతులు చేసుకుంటోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొంతవరకు ఈ పరిస్థితి సహజమే. అయితే చైనాతో భారత వాణిజ్య లోటు మరీ విపత్కర స్థాయులకు చేరింది. 2016-17 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం- భారత్‌కు చైనా రూ.3.95లక్షల కోట్ల విలువగల వస్తూత్పత్తుల్ని ఎగుమతి చేసింది. చైనాకు భారత్‌ కేవలం రూ.66వేలకోట్ల విలువగల వస్తువుల్ని ఎగుమతి చేయగలిగింది. అంటే భారత్‌తో పోలిస్తే రూ.3.29లక్షల కోట్ల అధికంగా చైనా వస్తూత్పత్తుల్ని ఎగుమతి చేసిందన్న మాట! గడచిన కొన్నేళ్లుగా ఈ వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2010-11లో రూ.1.89లక్షల కోట్లున్న ఆ లోటు, 2016-17లో రూ.3.29లక్షల కోట్లకు చేరింది.

మోసకారి విధానాలకు అడ్డుకట్ట

ఇప్పటికే చైనా అన్ని అంతర్జాతీయ వేదికలపైనా భారత వ్యతిరేక వాదనలు వినిపిస్తోంది. సరిహద్దుల్లో వివాదాలు సృష్టిస్తోంది. చైనాను కట్టడి చేయడానికి అన్ని మార్గాలూ అన్వేషించక తప్పదు. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో టపాసులు, ఆటబొమ్మల వాటా చాలా తక్కువ. వాటిని బహిష్కరించి, ఆ పరిశ్రమల్ని కాపాడుకోవాల్సిన అవసరముంది. ఏటా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న రూ.1.3లక్షల కోట్ల విలువగల ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రికల్‌ వస్తువులను బహిష్కరించగలిగితే చైనా దిగుమతుల్ని అధిక మొత్తంలో తగ్గించుకోగలుగుతాం. చైనా నేర్పిన విద్యను ఆ దేశంమీదే పూర్తిస్థాయిలో ప్రయోగించాల్సిన సమయం వచ్చింది. భారత్‌తోపాటు చైనాకు వ్యతిరేకంగా ఉన్న అమెరికా, తైవాన్‌, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు అనధికారిక స్థాయిలో చైనా దిగుమతులను నియంత్రించగలిగితే- అప్పుడు ఆ దేశంపై ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. చైనాతో వాణిజ్య లోటు తగ్గించుకోవాలన్నా, దాన్ని ఆర్థికంగా ఎదుర్కోవాలన్నా- చైనా వస్తువుల బహిష్కరణ ఒక్కటే మార్గం కాదు. మోసపూరితమైన ఆ దేశ వ్యాపార విధానాలకు భారత్‌ అడ్డుకట్ట వేయాలి. నాణ్యత ప్రమాణాలు అంతగా లేవనే కారణంతో భారత ప్రభుత్వం నిరుడు చైనానుంచి దిగుమతి అవుతున్న పాలను నిషేధించింది. అంతర్జాతీయ మొబైల్‌ గుర్తింపు సంఖ్య లేని చరవాణుల్ని సైతం ఆ జాబితాలో చేర్చింది. నాణ్యత ప్రమాణాల లోపాల్ని ఎత్తిచూపడం ద్వారానే చైనా డొల్లతనాన్ని భారత్‌ ఎండగట్టాలి. చైనానుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించాలి. 2000నుంచి 2014వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో భారత్‌లో చైనా పెట్టుబడి పెట్టింది కేవలం రూ.2,554కోట్లు. వివిధ దేశాలనుంచి భారత్‌కు వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఇది కేవలం ఒక శాతం. చైనా, నేపాల్‌వంటి దేశాల్లో పెట్టిన పెట్టుబడి కంటే ఇది తక్కువ. భారత్‌ యువశక్తి కలిగి ఉండటం, ప్రధాని మోదీ హయాములో ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు కావడంవల్ల చైనా పెట్టుబడిదారులు భారత్‌ను అవకాశాల స్వర్గంగా చూస్తున్నారు. ఈ పరిస్థితిని భారత్‌ అనుకూలంగా మలచుకోవాలి. మౌలిక సదుపాయాలను, నౌకాశ్రయాలను, విమానాశ్రయాలను మరెంతో అభివృద్ధిపరచి ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారాలి. విలువను జోడించే ఉత్పత్తుల్ని ప్రోత్సహించి ఎగుమతులకు చురుకు పుట్టించాలి. భారత్‌కు పట్టు ఉన్న ఐటీ, ఫార్మా రంగంలోని సంస్థల్ని చైనా తమ దేశంలో ఇప్పటివరకు వాణిజ్య వ్యాపారాలకు అనుమతించలేదు. దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం కృషిచేయాలి. చైనాను ఆర్థికంగా ఎదుర్కోవడానికి సకల చర్యలూ చేపట్టాలి!

– ఏనుగుల రాకేశ్‌రెడ్డి

(రచయిత- డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ లీడర్‌షిప్‌ అండ్‌ గవర్నెన్స్‌)