Home News డోక్లామ్‌పై భారత్‌కు జపాన్ మద్దతు

డోక్లామ్‌పై భారత్‌కు జపాన్ మద్దతు

0
SHARE
  • -యథాతథస్థితిని బలప్రయోగంతో మార్చవద్దంటూ చైనాకు హితవు
  • -జపాన్‌కు వాస్తవాలు తెలియవన్న చైనా

డోక్లామ్ వివాదంలో చైనా క్రమంగా దౌత్యపరమైన పట్టును కోల్పోతున్నది. డోక్లామ్ ప్రతిష్టంభనలో భారత్ వైఖరికి ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌లు మద్దతునివ్వగా, తాజాగా జపాన్ కూడా తోడయ్యింది. డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మించడంపై జపాన్ స్పందిస్తూ ఏ దేశమైనా యథాతథ స్థితిని ఏకపక్షంగా బలప్రయోగంతో మార్చేందుకు ప్రయత్నించరాదని స్పష్టం చేసింది. డోక్లామ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని భారత్‌లోని జపాన్ రాయబార కార్యాలయం తెలిపింది. భూటాన్, చైనా మధ్య డోక్లామ్ వివాదాస్పద ప్రదేశమని గుర్తించాం. ఉభయ దేశాలు సరిహద్దుపై చర్చలు జరుపుతున్నాయి. భూటాన్‌తో ఉన్న ఒప్పందం కారణంగానే భారత సైన్యాలు డోక్లామ్ అంశంలో జోక్యం చేసుకున్నాయని తెలుసు అని భారత్‌లో జపాన్ రాయబారి కెంజి హిరామత్సు పేర్కొన్నారు. అనేక ప్రపంచ దేశాలతో దౌత్యపరంగా సానుకూల సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో భారత్‌కు డోక్లామ్ అంశంలో మద్దతు పెరుగుతున్నది.

జపాన్ మద్దతుపై చైనా విస్మయం

డోక్లామ్ అంశంలో భారత్‌కు జపాన్ మద్దతు తెలుపడం చైనాను విస్మయపరిచింది. డోక్లామ్ గురించి జపాన్‌కు వాస్తవాలు తెలియవని వ్యాఖ్యానించింది. సిక్కిం సరిహద్దులోని డోక్లామ్‌లో యథాతథస్థితిని మార్చేందుకు భారత్ ప్రయత్నించిందని, తాము కాదని తెలిపింది. వాస్తవాలు తెలియకుండా జపాన్ రాయబారి అటువంటి వ్యాఖ్యలు చేయరాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు.

జపాన్ రాయబారి కెంజి హిరామత్సు
జపాన్ మద్దతు వెనుక కారణాలివీ

తూర్పు చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని జపాన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది. తూర్పు చైనా సముద్రంతోపాటు హిమాలయాల్లో చైనా దురాక్రమణను అడ్డుకొనేందుకు ఒక కూటమిని ఏర్పాటు చేయాలని 2014లో జపాన్ భారత్‌కు సూచించింది. తూర్పు చైనా సముద్రంలో చైనా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్‌ను ఏర్పాటు చేయడాన్ని జపాన్ వ్యతిరేకించింది. ఇక ఈ ఏడాది మే నెలలో చైనాకు చెందిన నాలుగు యుద్ధ నౌకలు, ఒక మానవ రహిత విమానం జపాన్‌కు చెందిన సెంకాకు దీవులలో ప్రవేశించాయి. అప్పుడు కూడా జపాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. డోక్లామ్ విషయంలో చైనా వాదనను సమర్థిస్తే సెంకాకు దీవుల విషయంలో మూల్యం చెల్లించాల్సి వస్తుందని జపాన్ గ్రహించింది.

చర్చలు కొనసాగిస్తాం : భారత్

డోక్లామ్ ప్రతిష్టంభనకు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం చైనాతో చర్చలు కొనసాగిస్తామని భారత్ శుక్రవారం పునరుద్ఘాటించింది. అంతకన్నా ముందు సరిహద్దులో శాంతి నెలకొనాలని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు.

పవర్‌గ్రిడ్, టెలికాం నిబంధనలు కఠినతరం

-చైనాకు చెక్ పెట్టేందుకే..

దేశంలోని కీలకమైన రంగాలలోకి చైనా ప్రవేశాన్ని నియంత్రించేందుకు విద్యుత్, టెలికాం రంగాల్లో నిబంధనలను భారత్ మరింత కఠినతరం చేయనుంది. చైనాకు చెందిన హార్బిన్ ఎలక్ట్రిక్, డోంగ్‌ఫాంగ్ ఎలక్ట్రానిక్స్, షాంగై ఎలక్ట్రిక్, సిఫాంగ్ ఆటోమేషన్ తదితర సంస్థలు దేశంలోని 18 నగరాలలో విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను నియంత్రిస్తున్నాయి. విద్యుత్ రంగంలో చైనా భాగస్వామ్యాన్ని దేశీయ సంస్థలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయి. తమకు చైనా మార్కెట్లలో ప్రవేశం లేకపోగా, ఆ దేశ కంపెనీలు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నాయని మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలకు దిగింది.

(నమస్తే తెలంగాణా సౌజన్యం తో)