Home News ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం, ఆరు నెలల్లోగా పార్లమెంట్‌ చట్టం తీసుకురావాలి: సుప్రీంకోర్టు

ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధం, ఆరు నెలల్లోగా పార్లమెంట్‌ చట్టం తీసుకురావాలి: సుప్రీంకోర్టు

0
SHARE

ఇస్లాం మతాచారమైన ముమ్మారు తలాక్‌పై సుప్రీంకోర్టు నేడు సంచలన తీర్పు వెలువరించింది. ముమ్మారు తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ పద్ధతి చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖురాన్‌ నియమాలకు తలాక్‌ వ్యతిరేకంగా ఉందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనిపై పార్లమెంట్‌లో చట్టం తేవాలని ఆదేశించింది. ఆరు నెలల్లోగా చట్టం తీసుకురావాలని అప్పటివరకూ తలాక్‌పై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ కేసును చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ ఐదుగురు భిన్న మతాలకు చెందిన వారు కావడం విశేషం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌(సిక్కు మతం), న్యాయమూర్తులు జస్టిస్‌ కురియన్‌ జోసఫ్‌(క్రైస్తవ), జస్టిస్‌ నారిమన్‌(పార్శీ), జస్టిస్‌ లలిత్‌(హిందూ), జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌(ముస్లిం)లతో కూడిన ధర్మాసనం నేడు తలాక్‌పై విచారణ చేపట్టింది. ఇందులో న్యాయమూర్తులు కురియన్‌, లలిత్‌, నారిమన్‌లు ముమ్మారు తలాక్‌ను వ్యతిరేకించారు. ముమ్మారు తలాక్‌ రాజ్యంగ విరుద్ధమని.. ఇస్లాం దేశాల్లోనే దీన్ని నిషేధించినప్పుడు భారత్‌లో ఎందుకు కొనసాగించాలని అన్నారు. ముమ్మారు తలాక్‌ సమానత్వ హక్కును అతిక్రమిస్తోందని అభిప్రాయపడ్డారు. కాగా.. చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌, జస్టిస్‌ నజీర్‌ మాత్రం తలాక్‌ అంశాన్ని పార్లమెంట్‌కే వదిలేస్తున్నట్లు చెప్పారు. అది దశాబ్దాల నాటి ఆచారమని.. దానిపై న్యాయస్థానం జోక్యం చేసుకోదని ఖేహర్‌ అన్నారు.

అయితే ముమ్మారు తలాక్‌పై పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చేంత వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని స్పష్టం చేసింది. చట్టం చేసిన తర్వాతే దానికి లోబడి కేసులను విచారిస్తామని పేర్కొంది. చట్టం చేయడానికి కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది. అప్పటివరకూ ముమ్మారు తలాక్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేస్తూ దానిపై నిషేధం విధించింది. ఆరు నెల్లలోపు చట్టం తీసుకురాకపోతే నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

షరియా చట్టాలను పరిగణనలోకి తీసుకొని చట్టం చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు చేసింది. చట్టం చేసే సమయంలో ముస్లిం సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని సూచించింది. దీనిపై రాజకీయ పక్షాలన్నీ కేంద్రానికి సహకరించాలని తెలిపింది.

వాట్సాప్‌, సోషల్‌మీడియా, పోస్టుకార్డు, న్యూస్‌పేపర్‌ ద్వారా ముమ్మారు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. దీంతో ముమ్మార్‌ తలాక్‌ న్యాయబద్ధం కాదని, దాని వల్ల తాము జీవితాలను కోల్పోతున్నామని ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 1400 ఏళ్ల నాటి మతాచారంపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మహిళల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ముమ్మారు తలాక్‌ పద్ధతి ఉందని.. ఈ విధానాన్ని తొలగించేలా చట్టం తీసుకురావాలని పిటిషన్‌దారులు కోరారు. అయితే పిటిషన్లపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మత సంబంధమైన వ్యవహారాలపై కోర్టు జోక్యం సరికాదని చెప్పింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నేడు సంచలన తీర్పు వెల్లడించింది.

(ఈనాడు సౌజన్యం తో)