Home News ఉన్నత ఉద్యోగావకాశాలను వదులుకొని సామాజిక సేవకై ముందుకు వచ్చిన స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌లు

ఉన్నత ఉద్యోగావకాశాలను వదులుకొని సామాజిక సేవకై ముందుకు వచ్చిన స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌లు

0
SHARE
  • స్వచ్ఛ ప్రేరకులు.. కార్య సాధకులు
  • బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలే ఈ యువ ప్రతినిధుల లక్ష్యం
  • ఉన్నత ఉద్యోగావకాశాలను వదులుకొని సామాజిక సేవ

వంద శాతం బహిరంగ మలవిసర్జన రహితంగా గ్రామాలను తీర్చిదిద్దే క్రతువులో పాలుపంచుకునేందుకు కొందరు యువ ప్రతినిధులు స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌లుగా మారారు. టాటా ట్రస్టులో శిక్షణ పొంది వినూత్న ఆలోచనల ద్వారా పల్లెవాసుల్లో మార్పు తెచ్చేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు టాటా ట్రస్టు దేశవ్యాప్తంగా 300 మంది యువతీయువకులకు శిక్షణ ఇవ్వగా.. వారిలో కొందరు తెలంగాణలోని యాదాద్రి భువనగిరి, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, మంచిర్యాలలో ప్రేరక్‌లుగా పనిచేస్తున్నారు. ‘ఈనాడు-ఈటీవీ’తో వారు తమ అనుభవాలను పంచుకున్నారు. ఉన్నత ఉద్యోగావకాశాలు ఎన్నో ఉన్నా ఏడాదిపాటు ప్రేరక్‌లుగా పనిచేయడానికి పురిగొల్పిన అంశాలను వివరించారు. వ్యాసరచన పోటీలు, ఆలోచింపజేసే లఘుచిత్రాలు, వినూత్న కార్యక్రమాల ద్వారా లక్ష్యాన్ని చేరుతామని ధీమాగా చెబుతున్నారు. బహిరంగ మలవిసర్జన రహితంగా గ్రామాలను మార్చడంతోపాటు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చేలా మార్పు తెస్తామంటున్నారు. వీరంతా 25-27 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. వీరు నైపుణ్యం కలిగిన యువత కావడంతో మెరుగైన ఫలితాలు వస్తాయని అధికారులు సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

న్యాప్‌కిన్స్‌ వినియోగంపై అవగాహన

– వి.హనుమంతు(25), నల్గొండ

నేను టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఏం.ఏ (సోషల్‌ వర్క్‌) చదివాను. ప్రశాంత్‌కిషోర్‌ నిర్వహిస్తున్న ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌కమిటీలో రెండేళ్లు పనిచేశా. ఆ సమయంలోనే ప్రేరక్‌లుగా పనిచేసేవారు కావాలంటూ ప్రకటన వచ్చింది. ఆలోచించకుండా మంచి జీతమొచ్చే ఉద్యోగాన్నివదిలి శిక్షణ తీసుకున్నా. అనంతరం సొంత జిల్లాలోనే పనిచేసే అవకాశం ఇచ్చారు. విద్యార్థినుకోసం పాఠశాలలు, కళాశాలల్లో శానిటరీ న్యాప్‌కిన్లు ఇచ్చే యంత్రాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం. వాడిన న్యాపికిన్లను కాల్చివేసే యంత్రాలనూ అక్కడే బిగించనున్నాం.

 

పరిశుభ్రతే లక్ష్యంగా..

– కోటపల్లి హరీశ్‌(25), సంగారెడ్డి

నేను ఐఐటీ-ఇండోర్‌లో బీటెక్‌, పీహెచ్‌డీ పూర్తి చేశా. అక్కడ చదువుతున్న రోజుల్లో ఉన్నత భారత్‌ అభియాన్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌లోని సిమ్రోల్‌ గ్రామ రూపురేఖలు మార్చడంలో కీలకంగా పనిచేశా. పీహెచ్‌డీకి సంబంధించి ప్యారిస్‌, ఫిన్లాండ్‌ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ పరిసరాల పరిశుభ్రతకు వారిస్తున్న ప్రాధాన్యం ఆకట్టుకుంది. ఇక్కడ అలా ఉంచడం ఎందుకు సాధ్యం కాదనే ఆలోచనతో ప్రేరక్‌గా మారాను. జిల్లాలోని మారుమూల గ్రామాలు తిరిగి ప్రజల్లో చైతన్యం తెచ్చేలా పనిచేస్తున్నా.

ప్రజలతో కలిసి పనిచేయాలనే ధ్యేయంతో..

-సందీప్‌కుమార్‌ ధరావత్‌ (27), యాదాద్రి భువనగిరి

మాది ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం. ఐఐటీ-మద్రాసు నుంచి 2014లో బీటెక్‌ పూర్తి చేశా. ఆ తర్వాత మెరైన్‌ ఇంజినీర్‌గా అవకాశాలూ వచ్చాయి. అయితే ప్రజలతో కలిసి పనిచేసి వారి కష్టాలను తీర్చే ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నా. ఇంతలో స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌గా పనిచేసే అవకాశం దక్కింది. మూడు నెలలుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ కార్యక్రమంలో నిమగ్నమయ్యాను.

ఆ పరిస్థితి చూసి చలించిపోయా…

– శవణ్‌ నేమనా(27), రంగారెడ్డి

సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేశా. మొబైల్‌ యాప్‌లు రూపొందించే సంస్థలో ఏడాది పనిచేశా. ఉద్యోగరీత్యా ఒక రోజు ముంబయిలోని లోకల్‌ రైలులో ప్రయాణిస్తుండగా.. పట్టాలకు సమీపంలో ఒక మహిళ చీరకొంగు తలపై కప్పుకొని మలవిసర్జనకు వెళుతున్న దృశ్యం నన్ను కలచివేసింది. ఎందరో మహిళలు ఇలా అవమాన భారంతో రోజూ గడపాల్సిందేనా? అనే ప్రశ్న తలెత్తింది. ఇదే సమయంలో స్వచ్ఛభారత్‌ ప్రేరక్‌గా పనిచేసేందుకు అవకాశం రావడంతో మరో ఆలోచన లేకుండా వచ్చేశా.

 

పల్లె రూపురేఖలు మార్చేందుకు..

– వి.రాహుల్‌ (25), మంచిర్యాల

గ్రామీణాభివృద్ధి అంశమై ముంబయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఏ పూర్తి చేశా. మూడేళ్లపాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున ఆదిలాబాద్‌ జిల్లాలో ‘యంగ్‌ ప్రొఫెషనల్‌గా’ పనిచేశా. పల్లెల రూపురేఖలు మార్చే పనిలో నిమగ్నం కావడం సంతృప్తినిచ్చింది. గత ఐదు నెలలుగా పల్లెల్లో తిరుగుతున్నా. బహిరంగ మలవిసర్జన రహితంగా గ్రామాలను మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను రచించి, ఉన్నతాధికారుల సహకారంతో వాటిని అమలు చేసేలా పనిచేస్తున్నా.

 

(ఈనాడు సౌజన్యం తో)