Home News ‘బోఫోర్స్‌’ కుంభకోణం పై పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

‘బోఫోర్స్‌’ కుంభకోణం పై పునర్విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

0
SHARE
  • 12 ఏళ్ల నాటి పిటిషన్‌పై సుప్రీంకోర్టు అంగీకారం
  • అక్టోబర్‌ 30 తర్వాత విచారణ జరుపుతామన్న ధర్మాసనం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి న 30 ఏళ్ల నాటి బోఫోర్స్‌ కుంభకోణం మళ్లీ తెరపైకి వచ్చింది. రూ.64 కోట్ల ముడుపులకు సంబంధించిన ఈ కేసు పునర్విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 2005 మే 31న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ సోదీ.. యూరప్‌కు చెందిన పారిశ్రామికవేత్తలైన హిందూజా సోదరులైన శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్‌తో పాటు బోఫోర్స్‌ కంపెనీపై అభియోగాలను కొట్టే శారు. అలాగే ఈ కేసు దర్యాప్తు కోసం రూ.250 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడంపై సీబీఐపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ 90 రోజుల గడువులోగా అప్పీలు చేయడంలో సీబీఐ విఫలం కావడంతో 2005 అక్టోబర్‌ 18న సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్‌ నేత అజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. 12 ఏళ్ల నాటి అగర్వాల్‌ పిటిషన్‌పై త్వరితగతిన విచారణ జరిపేందుకు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం అంగీకారం తెలిపింది. అక్టోబర్‌ 30 తర్వాత  కేసు విచారణ చేపడతామంది. అత్యున్నత స్థాయిలో ముడుపులు చేతులు మారాయని ఇటీవల స్వీడన్‌ చీఫ్‌ ఇన్వెస్టిగేటర్‌ స్టెన్‌ లిండ్‌స్టర్మ్‌ వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు రావడంతో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు బోఫోర్స్‌ కేసు పునర్విచారణకు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో కోర్టు త్వరితగతిన విచారణ చేపడతామని ప్రకటించడం గమనార్హం.

బోఫోర్స్‌ కుంభకోణం ఇదీ

400 అత్యాధునిక తుపాకుల సరఫరా నిమిత్తం స్వీడిష్‌ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్, భారత ప్రభుత్వం మధ్య 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కోసం బోఫోర్స్‌.. భారత్‌లో ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించినట్టు 1987 ఏప్రిల్‌ 16న స్వీడిష్‌ రేడియో ప్రకటించడంతో దుమారం రేగింది.దీంతో 1990 జనవరిలో సీబీఐ వివిధ సెక్షన్ల కింద అప్పటి బోఫోర్స్‌ ప్రెసిడెంట్‌ మార్టిన్‌ ఆర్డ్‌బో, మధ్యవర్తి విన్‌ చద్దా, హిందూజా సోదరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

1999 అక్టోబర్‌ 22న చద్దా, ఇటలీ వ్యాపారవేత్త ఒట్టావియో ఖత్రోచి, అప్పటి రక్షణ శాఖ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్, ఆర్డ్‌బో, బోఫోర్స్‌ కంపెనీలపై తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. అక్టోబర్‌ 9న హిందూజా సోదరులను చేరుస్తూ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై ఉన్న కేసును 2011, మార్చి 4న ఢిల్లీలోని సీబీఐ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఖత్రోచి, భట్నాగర్, చద్దా, ఆర్డ్‌బో ఇప్పటికే మరణించారు. 2005లో హైకోర్టు తీర్పుకంటే ముందు 2004 ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు మరో జడ్జి.. దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీపై నమోదైన అభియోగాలను తోసిపుచ్చారు.

(సాక్షి సౌజన్యం తో )