వరదల విలయం ఒకవంక, కరవు ఛాయల వికృతి మరోవంక! నూట పాతిక రకాల వాతావరణ జోన్లు గల ఇండియాలో పరస్పర విరుద్ధ ప్రకృతి ఉత్పాతాలు రెండూ భిన్న ప్రాంతాల్లో ఒకే సమయంలో సంభవిస్తుండటంతో భారతావనికి ఏటా తప్పనిది- గుండెకోత! ఇండియాలో నాలుగు కోట్ల హెక్టార్ల ప్రాంతానికి వరదముప్పు, 68 శాతం భూభాగానికి కరవు కాటకాల విపత్తు దాపురించే అవకాశం ఉందని జాతీయ అధ్యయన గణాంకాలు దశాబ్దాలుగా ఎలుగెత్తి చాటుతున్నాయి. అసోం, బిహార్లలో వరద బీభత్సాన్ని వెన్నంటి దేశవ్యాప్తంగా 210 జిల్లాలపై కరవు ఛాయలు పరచుకోవడం నేడు కళ్లకు కడుతున్న నిజం. ప్రపంచ భూభాగంలో దాదాపు రెండున్నర శాతం, జలవనరుల్లో నాలుగు శాతంగల ఇండియా ఎకాయెకి 18 శాతం జనావళికి ఆవాసమైనా- తన నదీ జలాల్లో మూడోవంతునైనా వినియోగించుకోలేక పోతోందన్నది వాస్తవం. నదుల అనుసంధాన మహాయజ్ఞాన్ని నిష్ఠగా పూర్తి చెయ్యగలిగితే- వరదల ముప్పును తప్పించడంతోపాటు క్షామ పీడిత పరగణాల్లో పంట సిరులకు భరోసా ఇవ్వగల వీలుంది. దశాబ్దాలుగా దస్త్రాలకే పరిమితమైన ఆ భూరి ప్రాజెక్టును పట్టాలకెక్కించడానికి మోదీ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. అయిదున్నర లక్షల కోట్ల రూపాయలకుపైగా వ్యయం కాగల ఈ భగీరథ యత్నాన్ని పర్యావరణ హితకరంగా చేపట్టి, అరవై నదుల్ని అనుసంధానించాలని మోదీ సర్కారు తలపోస్తున్నది. తొలుత ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల గుండా ప్రవహించే కెన్, బెట్వా నదుల అనుసంధానంతో శ్రీకారం చుట్టడానికి పూర్వ రంగాన్ని వడివడిగా సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం- భాజపా పాలిత రాష్ట్రాల మధ్య సదవగాహనతో వాటిని పూర్తి చెయ్యడం ద్వారా తక్కిన రాష్ట్రాల్లో సుహృద్భావానికి ప్రోది చెయ్యాలనుకొంటోంది. పదిహేనేళ్ల క్రితం వాజ్‌పేయీ మానస పుత్రికగా వెలుగులోకి వచ్చిన ఈ బృహత్ సంకల్పం మోదీ నేతృత్వంలో సాకారమైతే- సుజలాలతో భారత ధాత్రి సుఫలమవుతుంది!
భారతావనిలోని నదులన్నీ జాతి సమగ్రతా సారథులు. నదిలోని నీరు నీదా నాదా అన్న వ్యర్థ రాద్ధాంతాలతో రాష్ట్రాలు రాజకీయ కుస్తీలు పడుతుంటే, శిశువుకు దక్కని స్తన్యంలా ఉప్పు సముద్రం పాలవుతున్నాయి ప్రాణ జలాలు! గంగ-కావేరీ నదుల్ని కలిపితే పట్నా దగ్గర 150 రోజులపాటు 60వేల క్యూసెక్కుల దాకా వరద నీటిని బిగబట్టి, 40 లక్షల హెక్టార్ల సాగునేలను సస్యశ్యామలం చెయ్యగల వీలుందని 1972లోనే తెలుగు బిడ్డ కేఎల్ రావు ప్రతిపాదించారు. పిమ్మట అయిదేళ్లకు వెలుగు చూసిన దస్తూర్ పథకం పూలహారంలా జల వనరుల అనుసంధానానికి లక్షా 20 వేలకోట్ల రూపాయల వ్యయం కాగలదని అంచనా వేసింది. రహదారులు, టెలికాం సేవలు, రైళ్ల వంటి అనుసంధాన ప్రక్రియల్లో భాగంగా నదుల్నీ కలిపి కరవు కాటకాల్ని పారదోలేందుకు సురేశ్ ప్రభు సారథ్యంలో వాజ్‌పేయీ ప్రభుత్వం కార్యదళాన్ని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానం ఏ తీరుగా సాగాలో విపులీకరించిన కార్యదళం- ఆ భగీరథ యత్నం పూర్తి అయితే 2050 నాటికి సేద్య యోగ్య భూమి 16 కోట్ల హెక్టార్లకు పెరుగుతుందని, 34 గిగావాట్ల విద్యుదుత్పత్తి సాధ్యపడుతుందని స్పష్టీకరించింది. ఈ పథకం పరిపూర్తికి అయిదు లక్షల 60 వేలకోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని ప్రస్తావించిన సురేశ్ ప్రభు కార్యదళం- అది సజావుగా అమలుకు నోచుకోవాలంటే, పార్టీల మధ్య, ప్రభుత్వాల నడుమ రాజకీయ అనుసంధానం ఆవశ్యకతను నొక్కిచెప్పింది. కెన్, బెట్వా నదుల మిగులుజలాల్ని ఉభయ తారకంగా మళ్ళించేందుకు 2005 ఆగస్టులోనే త్రైపాక్షిక ఒప్పందం కుదిరినా, పుష్కరకాలంగా ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉండటానికి కారణం- రాజకీయ అనుసంధానం కొరవడటమే. ఆ మౌలిక ప్రతిబంధకాన్ని అధిగమిస్తే- సమగ్రాభివృద్ధికి రాచబాటలు పడినట్లే!
ద్వీపకల్ప నదుల్ని, హిమాలయ నదుల్ని వేర్వేరుగా అనుసంధానించాలన్న దానిపై దాదాపు ఏకాభిప్రాయం ఉంది. దక్షిణ భారత దేశంలో 16 నదుల్ని అనుసంధానించి 27 డ్యాములు కట్టడం ద్వారా నీటికొరత తీర్చి, 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించాలని సురేశ్ ప్రభు కార్యదళం లోగడే వెల్లడించింది. హిమాలయ ప్రాంతంలో తొమ్మిది ప్రధాన ఆనకట్టల నిర్మాణం, 14 అనుసంధాన ప్రక్రియల ద్వారా నీటి మళ్లింపుతోపాటు 30వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్నీ ప్రస్తావించింది. స్థూల దేశీయోత్పత్తిలో ఎకాయెకి నాలుగు శాతం వృద్ధికి దోహదపడే అనుసంధాన మహాయజ్ఞ ప్రయోజనాల్ని పరిశీలించిన సుప్రీంకోర్టు సైతం- సత్వరం దాన్ని పట్టాలకెక్కించాలంటూ 2012 ఫిబ్రవరిలో మన్మోహన్ సర్కారుకు సూచించింది. దేశీయంగా ఆహారం, విద్యుత్, తాగునీటి భద్రత సాధించేందుకు నదుల అనుసంధానం అత్యావశ్యకమంటున్న 44 మంది మేధావులు, శాస్త్రవేత్తలు- దానిపై ఎలాంటి సందేహాలనైనా తీర్చడానికి సంసిద్ధమని కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. భారీగా ముంపు ప్రాంతాలు, లక్షల్లో నిర్వాసితులు, అటవీ భూములనూ సేకరించాల్సి రావడంతో పర్యావరణానికి హాని… వంటివి ఈ పథకానికి ఎదురుకానున్న ప్రధాన సమస్యలు. వాస్తవానికి అవి ఏవీ కూడా పరిష్కరించలేనివి కావు. 2050 నాటికి దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని, అప్పటికి ఆహార ధాన్యాల ఉత్పత్తి 45 కోట్ల టన్నులకు చేరుకోవాలని ముందస్తు లక్ష్యాలు ఉద్ఘోషిస్తున్నాయి. వాటిని సాధించడంతోపాటు, జలరవాణా వృద్ధి ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి పెంపుదలకూ ఎంతో దోహదపడే ఈ భగీరథ యత్నంలో రాష్ట్రాలన్నీ నిష్ఠగా భాగస్వాములు కావాలిప్పుడు!
(ఈనాడు సౌజన్యం తో)