Home News అమర జవాన్ల వివరాలు సేకరిస్తూ వారి కుటుంబాలను కలిసి ఓదారుస్తున్న చిరుద్యోగి

అమర జవాన్ల వివరాలు సేకరిస్తూ వారి కుటుంబాలను కలిసి ఓదారుస్తున్న చిరుద్యోగి

0
SHARE

అందరూ యుద్ధం చేయరు. సరిహద్దుల్లో చల్లని మంచుగడ్డపై వెచ్చని రక్తాన్ని పారించే అదష్టం అందరికీ దొరకదు. శత్రువు తూటాకు ఛాతీ ఎదురొడ్డి నిలిచే జాతకం అందరికీ ఉండదు.

జితేంద్ర సింగ్‌కూ ఆ అదష్టం దొరకలేదు. సైన్యంలో భర్తీ కాలేకపోయాడు. రాజస్థాన్‌కు చెందిన ఈ వ్యక్తికి పన్నెండు వేలకు గుజరాత్‌లోని సూరత్‌లో ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం దొరికింది. సరిహద్దుల్లో శత్రువు తలలతో బంతులాట ఆడుకోవాలనుకున్న జితేంద్రకు దుకాణం ముందు నిలుచుని సలాం కొట్టే పని దొరికింది.

దేశం కోసం ప్రాణాలిచ్చే వీరజవాన్లను కేవలం వార్తా పత్రికల ఆఖరు పేజీ, చివరి కాలంలో ఒక పేరు గానో, ఒక గణాంకంగానో పెట్టేస్తే సరిపోతుందా? ఇంటిని, ఊరిని, అయిన వారిని వదిలి ఎక్కడో సరిహద్దు కశ్మీరంలోనో, లడాఖ్‌ లోయల్లోనో, కార్గిల్‌ కొండల్లోనో, సియాచిన్‌లోనో ఉన్నవారిని మనం పట్టించుకోకపోతే ఎలా? సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా జితేంద్ర సింగ్‌ను ఆ ఆలోచన తొలచేస్తూనే వచ్చింది. నా కోసం, నీ కోసం, మనందరి కోసం ప్రాణాలిస్తున్న జవాన్లను మనం ఎలా స్మరించుకోవాలి? ఇదే ఆయన మనసును ఆక్రమించింది. నేనేం చేయాలి? వారికి నేనెలా నివాళి అర్పించాలి? ఇదే ఆలోచన వామనుడి నుంచి త్రివిక్రముడంత అయింది.

అంతే… దేశం కోసం పోరాడుతూ ప్రాణాలర్పిస్తున్న సైనికుల వివరాలను, వారి పేర్లను, వారి రెజిమెంట్లను, వారి సొంత ఊరిని, చిరునామాలను సేకరించడం మొదలుపెట్టాడు. కొన్ని సార్లు పేపర్లలో వివరాలు దొరికాయి. కొన్ని సార్లు ఫోన్లు చేసి వివరాలు సంపాదించాడు. గత పదిహేడేళ్లుగా జితేంద్ర సింగ్‌ ఇదే పనిచేస్తున్నాడు. దాదాపు ఇరవై వేల మంది అమర జవాన్ల పేర్లు, చనిపోయిన తేదీలు, వారి ఊరి పేరు, కుటుంబ సభ్యుల వివరాలను అతడు సేకరించాడు. సైన్యం తరువాత ఇంత భారీ మొత్తంలో అమరజవాన్ల వివరాలు ఉన్నది జితేంద్ర వద్దేనంటే ఆశ్చర్యం లేదు. ఇదంతా తన ప్రయత్న ఫలితమే.

దగ్గర్లో ఉంటే, ఆ జవాన్ల కుటుంబాలను కలుసుకుంటాడు. కాసిన్ని కబుర్లు చెబుతాడు. కన్నీరు తుడుస్తాడు. మీ కుమారుడి త్యాగం వల్లే మేమంతా ఇలా సుఖంగా ఉంటున్నామని సాంత్వననిస్తాడు. తరువాత ఆ కుటుంబ సభ్యుల భుజం తట్టి తిరిగి వచ్చేస్తాడు. వందలాది అమరజవాన్ల కుటుంబ సభ్యులను జితేంద్ర సింగ్‌ ఇలా పలకరించాడు.

దూరంగా ఉండి, వెళ్లడం కుదరకపోతే ఒక పోస్టు కార్డుపై తన మనసులోని మాటల్ని వ్రాసి అమర జవాన్ల కుటుంబ సభ్యులకు పంపిస్తాడు. ఇలా ఇప్పటికి మూడు వేలకు పైగా పోస్టు కార్డులు పంపించాడు జితేంద్ర సింగ్‌. కార్గిల్‌ యుద్ధం సమయంలో జితేంద్ర సింగ్‌ ఈ పనిని మొదలు పెట్టాడు. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తన జేబులోని డబ్బులనే ఖర్చు చేస్తూ, తన సమయాన్ని, ఆలోచనలను అక్షరబద్ధం చేస్తూ లేఖలు వ్రాస్తూనే ఉన్నాడు. ఒక రూపాయి పోస్టుకార్డే కావచ్చు. కానీ ఆయన హదయాం తర్గత దేశభక్తి భావనను వామనమూర్తి పాదమంతగా పెంచి పంచుతుంది ఆ లేఖ.

అంతే కాదు. చాలా కుటుంబాలతో అతనికి ఎంత మైత్రి ఏర్పడిపోయిందంటే ఆయన ఒక పదిరోజుల పాటు ఫోన్‌ చేయకపోతే షహీదుల కుటుంబాల నుంచి ఫోన్లు వస్తాయి. రోజుకు పాతికకు పైగా అమరజవాన్ల కుటుంబాలతో ఫోన్‌లో సంభాషిస్తాడు జితేంద్ర. ‘ఇదిగో… ఈ గుజరాత్‌లోని సూరత్‌లో … ఇక్కడ అమర జవాన్ల కుటుంబాల గురించి ఆలోచించే వాడు ఒక్కడున్నాడు’ అని వారనుకుంటే చాలు అంటాడు జితేంద్ర.

తమాషా ఏమిటంటే జితేంద్ర మిత్రులు, కుటుంబ సభ్యులు, ఆఖరికి భార్య కూడా జితేంద్రకు పిచ్చి పట్టిందనే అనుకుంటారు. ఎముకలు అరగదీసుకుని సంపాదించిన కొద్దిపాటి డబ్బులోనుంచి ఫోన్లు చేయడం, కార్డులు పంపడం వెర్రిబాగులదనం కాక మరేమిటన్నది వారి వాదన. జితేంద్రకు వారి వాదనతో పనిలేదు. సరిహద్దులో నా కోసం ప్రాణాలిచ్చిన నా జవాను కుటుంబాన్ని పలకరించడం నా విధ్యుక్త ధర్మం… నా పరమ కర్తవ్యం. దాని కోసం కాసిని కాసులు, కాసింత సమయం ఇవ్వడం దేవుడి పూజతో సమానం అంటాడు జితేంద్ర.

రాజస్థాన్‌లోని కుథేడాకి చెందిన జితేంద్ర పెద్దగా చదువుకోలేదు. పట్టాలు పుచ్చుకోలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం లేదు. సూరత్‌ లో ఒక దుకాణం ముందు ‘సలాం సాబ్‌’ అంటూ ఉండే ఈ సామాన్యుడు కూడా దేశాన్ని రక్షించే పనిలోనే ఉన్నాడు. అతను తుపాకీ పట్టకపోవచ్చు. సరిహద్దుల్లో పోరాడకపోవచ్చు. కానీ దేశం మందిరమైతే, సైనికుడు దేవుడు. జితేంద్ర లాంటి వారు పూజారులు. భక్తులు.

అన్నట్టు జితేంద్రకు ఒక కొడుకు. ఆ కొడుకు పేరు హరదీప్‌ సింగ్‌. ఈ హరదీప్‌ సింగ్‌ ఎవరో తెలుసా? 2003 లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలర్పించిన అమర జవాను. ఆయన పేరే తన కొడుక్కు పెట్టుకున్నాడు జితేంద్ర.

– ప్రభాత్‌

(జాగృతి సౌజన్యం తో)

(ఈ వార్త మొదట 22 సెప్టెంబర్ 2017 నాడు ప్రచురితమైంది)