భారతదేశం ఎదుగుతోంది, భారతీయ శక్తి విస్తరిస్తోంది. విదేశ దాస్యాంధకార విముక్త భారత జాతి కోటి కోటి ‘కరాల’తో సముజ్వల శక్తి రూపిణిగా తేజరిల్లుతోంది! ప్రపంచంలోని నలుమూలల నుంచి తరిమివేతకు గురి అయిన శరణార్థులను తన ఒడిలో చేర్చుకొని లాలించి పాలించిన భరతమాత ప్రభావ సంస్కారం మళ్లీ విస్తరిస్తోంది! భారతీయుల ‘యోగం’ ప్రపంచాన్ని మరోసారి సంస్కారవంతం చేస్తుండడం ఈ ‘విద్యా విజ్ఞాన శక్తి’కి నిదర్శనం! క్రీస్తుశకం 1974లో భారతదేశం ‘అణ్వస్త్ర పాటవ పరీక్ష’ను నిర్వహించినప్పుడు, ‘‘అన్నం లేక ఆకలితో అల్లాడుతున్న ప్రజలున్న దేశానికి అణ్వాయుధాలు కావలసి వచ్చాయా?’’ అని పాశ్చాత్య దేశాల ప్రచార మాధ్యమాలవారు, ప్రభుత్వాలు ఎగతాళి చేయడం చరిత్ర! మన ఇంటిని శతాబ్దుల పాటు దోచుకొని తమ పొట్టలను నింపుకున్న తోడేళ్ల వంటి పాశ్చాత్యులు ఒకప్పుడు తమకు మనదేశం బిచ్చం పెట్టిన సంగతిని మరచిపోయారు! బిచ్చమెత్తడానికి వచ్చిన వారు బీభత్సకారులుగా మారడం శతాబ్దుల చరిత్ర… అంతకుపూర్వం భారతమాత సహస్రాబ్దుల పాటు అజేయశక్తిగా అలరారడం కూడ చరిత్ర! మహాకవి కరుణశ్రీ అన్నట్లు ‘‘అచ్చపు చీకటిండ్ల పొరలాడుచునుండ ప్రపంచమెల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్…’’! అంతేకాదు అన్నార్తులై, అన్నార్థులై వివిధ దేశాల నుంచి వచ్చి తన ఇంటి గుమ్మం వద్దకు చేరినవారికి, ‘‘బిచ్చము పెట్టెరా భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులన్!’’ భారత ‘ఆర్థికశక్తి’ ఇతర దేశాలకు జాతులకు ఆశ్రయం కల్పించడం చరిత్ర. భారత ఆర్థికశక్తి అవనీతలానికి అభయం ఇచ్చింది, అంతేకాని విదేశాలను వంచించలేదు. వాటి సంపదను దోచుకోలేదు! క్రీస్తుశకం 1998లో రెండవసారి అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపేనాటికి భారతదేశం ఆహార ధాన్యాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ‘అగ్ని’, ‘పృథివి’ ‘ఆకాశ్’ ‘బ్రహ్మ’ వంటి అస్త్రాలను తన ‘కోటికోటి భుజైర్ధృత’’ కరాలతో ధరించి ఉన్న భరతమాత సనాతన శక్తి స్వరూపిణి! ఈ ‘్భతికశక్తి’ జాతీయ సరిహద్దులను రక్షించుకొనడానికి మాత్రమే నిత్య చైతన్య స్వరూపిణిగా త్రివిక్రమ స్ఫూర్తి భాసింప చేస్తోంది! ఇతర దేశాలను దురాక్రమించడం, ఇతర బలహీన జాతులను వేటాడి చంపడం, ఇతర దేశపు మతాలను మట్టుపెట్టడం ఆయా దేశాలలోని సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేయడం భారతీయ ‘భౌతిక శక్తి’కి లక్ష్యం కాలేదు. కాబోదు!! భారతీయ శక్తి దురాక్రమించే దోపిడీ చేసే శక్తి కాదు, స్వీయ జాతీయ అస్తిత్వానికి రక్షణశక్తి మాత్రమే! అందుకే మహాకవి బంకించంద్ర ఛటర్జీ భరతమాతను ‘రిపుదళ వారిణి’’గా అభివర్ణించాడు! శుభంకరమూర్తి భరతమాత…
అమెరికా విదేశాంగ మంత్రి జేమ్స్ మట్టీస్ ఇటీవల మనదేశానికి వచ్చి వెళ్లాడు. అఫ్ఘానిస్తాన్‌లో శాంతిభద్రతను నెలకొల్పడానికి వీలుగా మన దేశపు సైనిక దళాలను ఆ దేశానికి పంపాలన్నది మట్టీస్ ఆకాంక్ష! కానీ ఆఫ్ఘానిస్తాన్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కూడా నిశ్ఛయంతో ఉన్న మన ప్రభుత్వం మన సైనికులను ఆ దేశానికి పంపడానికి మాత్రం నిరాకరించింది! ఇలా విదేశాలలో మన దళాలను నెలకొల్పడం వల్ల ఆయా దేశాల ఆంతరింగిక వ్యవహారాలలో మన ‘సైనికశక్తి’ అనవసరమైన జోక్యం కల్పించుకున్నట్టు కాగలదన్నది మన ప్రభుత్వ విధానం. అత్యవసరమైతే తప్ప ఆ దేశాల ప్రభుత్వాలు కోరితే తప్ప మన సైనిక దళాలు ఇతర దేశాలలోకి వెళ్లడం మన విధానం కాలేదు. క్రీస్తు శకం 1970వ 1971వ సంవత్సరాలలో బంగ్లాదేశ్ ప్రవాస ప్రభుత్వం అభ్యర్థించినప్పుడు మన సైనిక దళాలు బంగ్లాదేశ్‌లోకి చొచ్చుకొనిపోయాయి. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుంచి విముక్తం చేశాయి. కానీ నిర్వర్తించవలసిన బాధ్యత పూర్తికాగానే మన సైనికులు ఒక్క రోజు కూడా బంగ్లాదేశ్‌లో ఉండలేదు. 1988లో మాల్‌దీవుల ప్రభుత్వాన్ని కిరాయి హంతకులు కూలదోయడానికి యత్నించారు. మాల్‌దీవుల ప్రభుత్వం మన సహాయం కోరింది. మాల్‌దీవులకు వెళ్లిన మన సైనికులు కిరాయి హంతకుల తిరుగుబాటును అణచివేశారు. వెంటనే తిరిగి వచ్చారు! భారతీయ ‘శక్తి’ స్వభావం ఇది. భౌతిక దురాక్రమణకు మాత్రమే కాదు, వ్యూహాత్మక దురాక్రమణకు సైతం భారతదేశం యత్నించకపోవడం అనాదిగా చరిత్ర!
శరీరగత శక్తి దేహాన్ని రక్షించుకొనడానికి మాత్రమే.. ఇతరులపై దాడులు చేయడానికి కాదు! దేశస్థిత సంఘటిత జాతీయ శక్తి దేశ సరిహద్దులను సంరక్షించుకొనడానికి మాత్రమే… ఇతర దేశాలలోకి చొరబడడానికి కాదు! ఇది సనాతన భారత జాతీయ శక్తి స్వభావం… ఈ స్వభావం సృష్టినిహితమై ఉంది! బృహత్‌శక్తి స్వరూపాలైన గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర సమూహాలు నిండిన అసంఖ్యాక బ్రహ్మాండాలు’ – గెలక్సీస్ – నిరంతరం శక్తిని సమకూర్చుకుంటున్నాయి. విశ్వరజాన్ని – కాస్మిక్ డస్ట్ -ను ఈ ‘అంతరిక్ష చరాలన్నీ – హెవన్‌లీ బాడీస్- భోంచేస్తున్నాయి, అపరిమిత శక్తిని పొంది నిరంతరం భ్రమిస్తున్నాయి, పరిభ్రమిస్తున్నాయి. అంతరిక్షంలో పరిక్రమిస్తున్నాయి. కాని ‘భూమి’తో సహా ఈ అంతరిక్ష చరాలు తమ శక్తిని ప్రదర్శించి ఒకదాని పరిథిలోకి మరొకటి దురాక్రమించడం లేదు. తమ శక్తిని నిరంతరం తమ ప్రగతి ప్రస్థానం కోసం మాత్రమే వినియోగిస్తున్నాయి. అందువల్లనే విశ్వ వ్యవస్థలో ఆద్యంతరహితమైన సమన్వయం నెలకొని ఉంది. వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని ఏకాత్మభావం నెలకొని ఉంది. ఈ ‘సమన్వయం’ సనాతనమైనది, అంటే శాశ్వతమైనది. ఈ సమన్వయ ప్రాతిపదిక విశ్వగత చైతన్యం, ఋతం.. ‘ఋతం’ సృష్టిచోదక సహజ చైతన్యం.. ఇదే దైవశక్తి, దీనికి, ఈ సమన్వయ వ్యవస్థకు విఘాతం కల్పించే వికృతులు దుష్ట శక్తులు, దానవ శక్తులు! వెలుగు దైవీశక్తి, చీకటి దానవశక్తి!
మానవ సమాజం విశ్వవ్యవస్థలో భాగమన్న సనాతన – శాశ్వత – వాస్తవాన్ని భారతీయులు అనాదిగా గుర్తించారు! వేదద్రష్టలు వివరించారు. అందుకే దురాక్రమణ చీకటిపై వెలుగు నిరంతరం పోరాడుతోంది. వెలుగు భారతీయుల సనాతన శక్తి. విశ్వనిహిత విశ్వవ్యాప్త ఈ సనాతన శక్తి మూడు విధాలుగా ప్రస్ఫుటిస్తోంది, విజ్ఞానశక్తి – సరస్వతీ మాత, ఆర్థికశక్తి – మహాలక్ష్మి, భౌతిక శక్తి – దుర్గాదేవి ఈ త్రివిధ రూపాలు! స్వరూపాల వైవిధ్యం కల ఈ త్రివిధ శక్తుల, త్రిమూర్తుల, అసంఖ్యాక దివ్యరూపాల స్వభావం అద్వితీయం. ఇదీ సనాతన సమన్వయం! ఆద్యంత రహితమైన ఈ శాశ్వత చైతన్యశక్తి స్వభావానికి ‘స్వరూపం’ మనం నివసిస్తున్న భూమాత, భరతమాత! ‘‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి’’ – ‘‘ఏ దేవుడికి మొక్కినప్పటికీ అది కేశవునికి చెందుతుంది’’ – అని అన్నట్టుగా సకల దేవతల సమీకృత శక్తి మన అస్తిత్వ కారకమైన భూమి, మాతృభూమి… మన భరతభూమి! అభినవ మహిష దనుజులపాలిట ఆదిశక్తి భరత మాతృశక్తి…
ఆంధ్రభూమి సౌజన్యం తో)