భారతదేశంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు హిందూ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా తెలిపారు. ఆదివారం నల్గొండలోని లయన్స్ క్లబ్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి హెల్ప్‌లైన్ ద్వారా సేవలందిస్తామని ఆయన వివరించారు.
దేశంలో మధుమేహం, క్యాన్సర్, రక్తహీనత వంటి జబ్బులతో బాధపడుతున్న వారు ఏడాదికి సగటున రూ.16 లక్షల కోట్లను వైద్య సేవల కోసం వినియోగిస్తున్నారని వెల్లడించారు. పాశ్చాత్య జీవన శైలిని అనుకరించటం వల్లే అనేక జబ్బులు సంక్రమిస్తున్నాయని చెప్పారు. భారతీయ జీవన విధానం అలవర్చుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని ప్రజలకు సూచించారు.
హెల్ప్‌లైన్ ద్వారా రోగులకు సేవలందించటానికి నల్గొండలో పలువురు వైద్యులు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వాలు సరైన వైద్య సేవలు అందించడంలేదని అభిప్రాయపడ్డారు.
హిందూ హెల్ప్‌లైన్ సేవల కోసం 020 66803300, 07588682181 నంబర్లలో లేదా [email protected], www.hinduhelpline.com లలో సంప్రదించాలని సూచించారు.
వైద్యులు, పుర ప్రముఖులు, వీహెచ్‌పీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వీహెచ్‌పీ నాయకులు రామారావు, కాటమయ్య, కర్తాల్‌రెడ్డి, గోవర్ధన్, గోపి తదితరులు పాల్గొన్నారు.
(ఈనాడు సౌజన్యం తో)