Home News హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడమే లవ్‌ జిహాద్‌ లక్షం, అంగీకరించిన ముస్లిం సంస్థ

హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చడమే లవ్‌ జిహాద్‌ లక్షం, అంగీకరించిన ముస్లిం సంస్థ

0
SHARE
  • చదువు పేరుతో మత మార్పిడులు.. మనసు మార్చి వివాహాలు
  • హవాలా మార్గంలో గల్ఫ్‌ నిధులు
  • ఇండియాటుడే స్టింగ్‌ ఆపరేషన్లో అంగీకరించిన పీఎఫ్ఐ సభ్యురాలు
  • సంస్థను నిషేధించాలన్న బీజేపీ

న్యూఢిల్లీ: కేరళలో పథకం ప్రకారం ‘లవ్‌ జిహాద్‌’ జరుగుతోందని ఆంగ్ల టీవీచానెల్‌ కథనం ఒకటి వెల్లడించింది. 23 ఏళ్ల హిందూ వైద్య విద్యార్థిని అఖిల అశోకన్‌ను(హదియా జహాన్‌) ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్న సంఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హదియా తన భర్త సఫిన్‌ జహాన్‌తోనే ఉంటానని పట్టుబట్టగా తన కుమార్తెను ‘లవ్‌ జిహాద్‌’ నుంచి కాపాడాలని తండ్రి అశోకన్‌ సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశారు. హైకోర్టు వివాహాన్ని రద్దు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లవ్‌ జిహాద్‌పై దర్యాప్తు జరుగుతోంది. హదియా మత మార్పిడి, ఇస్లామిక్‌ వివాహంలో కీలక పోషించినట్లు భావిస్తున్న స్వచ్ఛంద సంస్థ పాప్యులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్ ఐ) మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.ఎ్‌స.జైనబాపై ‘ఇండియాటుడే’ స్టింగ్‌ ఆపరేషన్‌ చేసింది.

ఈ సందర్భంగా ఆమె అమ్మాయిలను ఇస్లాంలోకి మారుస్తున్నట్లు అంగీకరించింది. జైనబా అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యురాలు కూడా. ఆంగ్ల చానెల్‌ ప్రతినిధితో ఆమె సంభాషణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, తానెవరితో మాట్లాడలేదని, తాను మత మార్పిడులకు పాల్పడలేదని జైనబా బుధవారం విలేకరులకు చెప్పింది. హదియా 2013లోనే ఇస్లాంలోకి మారిందని, 2015లో ఆమె పీఎఫ్ఐ అనుబంధ సంస్థ సత్యశరణిలో చేరేందుకు వచ్చినపుడు పరిచయం అయ్యిందని, వారిద్దరి మధ్య పెద్దలు కుదిర్చిన పెళ్లే జరిగిందని చెప్పారు. మీడియా ప్రతినిధితో సంభాషణల్లో మాత్రం ఇప్పటివరకు ఐదు వేల మంది హిందూ, క్రిస్టియన్‌ యువతులను ఇస్లాంలోకి మార్చినట్లు జైనబా, ఆమె భర్త అలీ గర్వంగా వెల్లడించారు. మతం మారుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారని, నాలుగేళ్ల క్రితం ఎమ్మెస్సీ మాథ్స్‌, బీఈడీ చేసిన శుభ అనే అమ్మాయిని మతం మార్చామని, ఇప్పుడామె ఫాతిమాగా స్థిరపడిందని తెలిపారు.

చారిటబుల్‌ ట్రస్టులు, విద్యాసంస్థల ముసుగులో ఉండబట్టే చేయగలుగుతున్నామని చెప్పారు. విద్యాసంస్థ ట్రస్ట్‌గా రిజిస్టర్‌ అయిన సత్యశరణి కూడా చేసేది మత మార్పిడులేనని, పేరు మర్పిడి సర్టిఫికెట్లు తెచ్చిపెట్టే బాధ్యత కూడా తమదేనని వెల్లడించారు. పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యుడు అహ్మద్‌ షరీఫ్‌ ఢిల్లీలో ఆంగ్ల చానెల్‌ విలేకరితో మాట్లాడుతూ, ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే తన లక్ష్యమని చెప్పారు. మొదట భారత్‌ను ఇస్లామిక్‌ రాజ్యంగా మార్చాక ప్రపంచమంతా విస్తరిస్తామని తెలిపారు. మత మార్పిడుల కోసం పెద్ద మొత్తంలో అరబ్బు దేశాల నుంచి నిధులను హవాలా మార్గంలో తెచ్చుకుంటున్నట్లు చెప్పారు.

ఐదేళ్ల క్రితం తన చేతుల మీదుగా పది లక్షల గల్ఫ్‌ మనీని కేరళకు పంపించానన్నారు. పీఎఫ్ఎఫ్ఐ సంస్థను వెంటనే నిషేధించాలని, సంస్థ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పీఎఫ్ఐ దేశంలోని చట్టాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు అన్నాయి. అగ్రవర్ణాల వేధింపుల వల్లే బీసీలు, దళితులు ఇస్లాం వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించాయి. దేశంలో పలు రాష్ట్రాలు ప్రలోభపెట్టి చేసే మత మార్పిడులను నిషేధించాయి.

లవ్‌జిహాద్‌ పేరుతో ఉగ్ర కార్యకలాపాలు

లవ్‌జిహాద్‌ దేశానికి పెనుముప్పు. దాని మాటున కేరళలో ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇటీవలి లవ్‌జిహాద్‌ కేసు ఐఎస్‌ ఉగ్రసంస్థతో ముడిపడి ఉంది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించాల్సిందే.  – కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)